close

గ్రేటర్‌ హైదరాబాద్‌

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
చివరి వరకూ టెన్షనే

 ఎంసెట్‌ వెబ్‌ ఆప్షన్లపై   ఏటా తప్పని ఉత్కంఠ.. సందిగ్ధత
 కొత్త సీట్లకు అనుమతి ఇస్తూ శనివారం రాత్రి జీవో జారీ
 నేటి సాయంత్రం నుంచి  వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ మొదలు
 సీట్లు దాదాపు లక్ష.. కొత్త కోర్సుల్లో 19,500

ఈనాడు, హైదరాబాద్‌: విద్యాశాఖ వైఖరి వల్ల ఏటా ఎంసెట్‌ కౌన్సెలింగ్‌కు హాజరయ్యే వేలాది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు  తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ధ్రువపత్రాల పరిశీలన వరకు కౌన్సెలింగ్‌ సజావుగా సాగుతున్నా.. వెబ్‌ ఆప్షన్లకు వచ్చేసరికి చివరి క్షణం దాకా ఇంజినీరింగ్‌ కళాశాలలకు అనుమతి, అనుబంధ గుర్తింపు ఇవ్వకపోతుండటంతో తీవ్ర ఆందోళన తప్పడం లేదు. ఈసారీ అదే తీరు.. రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నుంచి విద్యార్థులు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉండగా.. శనివారం రాత్రి 9 గంటల తర్వాత ప్రభుత్వం కొత్త కోర్సుల సీట్లకు అనుమతి ఇస్తూ జీఓ జారీచేయడం గమనార్హం.  ఆయా వర్సిటీలు అనుబంధ గుర్తింపు ప్రక్రియను పూర్తిచేసి ఎంసెట్‌ ప్రవేశాల కమిటీకి పంపడం...అనంతరం విద్యార్థులకు ఆప్షన్లు అందుబాటులోకి వచ్చే సరికి  ఆదివారం సాయంత్రం అవుతుందని అధికారవర్గాలు చెబుతున్నాయి.
జేఎన్‌టీయూహెచ్‌లో 18,210 కొత్త కోర్సుల సీట్లు
దేశవ్యాప్త విధానంలో భాగంగా రాష్ట్రంలోని జేఎన్‌టీయూహెచ్‌, ఓయూ, కాకతీయ విశ్వవిద్యాలయాలు కొత్త కోర్సులకు కళాశాలల నుంచి దరఖాస్తులు స్వీకరించాయి. ఆ కోర్సులకు రాష్ట్ర ప్రభుత్వం నిరభ్యంతర ధ్రువపత్రం(ఎన్‌ఓసీ) జారీ చేయాలి. కళాశాలల వారీగా కొత్త కోర్సుల జాబితాను రెండు నెలల క్రితమే జేఎన్‌టీయూహెచ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. ఆ వర్సిటీ పరిధిలో బీటెక్‌ కృత్రిమ మేధ, సైబర్‌ సెక్యూరిటీ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, డేటా సైన్స్‌ తదితర ఆరు కొత్త కోర్సుల్లో మొత్తం 18,210 సీట్లు కావాలని కళాశాలలు దరఖాస్తు చేశాయి. 13,800 డిమాండ్‌ లేని సీట్లను రద్దుచేసుకున్నాయి. వాటికి అక్కడి నుంచి అనుమతి రాకపోవడంతో ఈనెల 12 నుంచి మొదలుకావాల్సిన ఎంసెట్‌ వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ 18కి వాయిదా పడింది. శనివారం రాత్రి 9 గంటల తర్వాత విద్యాశాఖ 18,210 సీట్లకు ఎన్‌ఓసీ ఇస్తూ జీఓ జారీచేసింది. కొత్త సీట్ల వల్ల జేఎన్‌టీయూహెచ్‌ పరిధిలో మొత్తం రూ.33.85 కోట్ల ఆర్థిక భారం పడుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఓయూ, కాకతీయ వర్సిటీల పరిధిలోని కళాశాలలు కూడా కొత్త కోర్సులకు దరఖాస్తు చేశాయి. ఓయూ పరిధిలో 1170 కొత్త సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ రెండు వర్సిటీల జీఓలు వెల్లడికాలేదు.
విద్యార్థులకేదీ వెసులుబాటు?
రాష్ట్రంలో దాదాపు 190 కళాశాలలు.. వాటిల్లో పదుల సంఖ్యలో బ్రాంచీలున్నాయి. అందుకే కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభానికి కనీసం వారం పది రోజులు ముందుగా కళాశాలలు, వాటిల్లో బ్రాంచీలు, సీట్ల సంఖ్య వివరాలు వెల్లడిస్తే విద్యార్థులు వెబ్‌ ఆప్షన్లు సక్రమంగా ఇచ్చే వెసులుబాటు ఉంటుంది. వర్సిటీలు మాత్రం వెబ్‌ ఆప్షన్లు ప్రారంభమయ్యే నాడే కళాశాలలకు అనుబంధ గుర్తింపు జారీచేస్తున్నాయి. అదేమంటే అనుమతి రాని కళాశాలలు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాయన్న ఆలోచనతో అలా చేస్తుంటామని జేఎన్‌టీయూహెచ్‌ వర్గాలు అంతర్గతంగా చెబుతుంటాయి. ఈసారి వర్సిటీ సకాలంలోనే ప్రక్రియను ముగించినా రాష్ట్ర ప్రభుత్వం చివరి వరకు అనుమతి ఇవ్వకపోవడంతో విద్యార్థులు ఉత్కంఠకు గురయ్యారు.

ఎంసెట్‌ గణాంకాలివీ...

* ఎంసెట్‌లో ర్యాంకులు పొందినవారు: దాదాపు 85 వేల మంది
* మొత్తం రాష్ట్రంలో బీటెక్‌ సీట్లు: సుమారు లక్ష    (అందులో కొత్త సీట్లు 19,500 వరకున్నాయి)
* కౌన్సెలింగ్‌ ద్వారా కన్వీనర్‌ కోటా కింద భర్తీచేసే సీట్లు: 70 శాతం
* ఈనెల 17 వరకు కౌన్సెలింగ్‌ స్లాట్‌ బుక్‌ చేసుకున్నవారు: 55,812
* ఈనెల 17 వరకు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరైనవారు: 43,721


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు