close

గ్రేటర్‌ హైదరాబాద్‌

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఇది ముమ్మాటికీ మానవ తప్పిదమే

‘కల్వకుర్తి ఎత్తిపోతల’ ప్రమాదానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం
సీఎం బహిరంగ క్షమాపణ చెప్పాలి
 పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ డిమాండ్‌
ఘటనాస్థలికి వెళుతుండగా రేవంత్‌రెడ్డి, భాజపా నేత డీకే అరుణ అరెస్ట్‌

గాంధీభవన్‌, న్యూస్‌టుడే- ఈనాడు డిజిటల్‌, నాగర్‌కర్నూల్‌: కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పంప్‌హౌస్‌ నీట మునిగిన ప్రమాదం ముమ్మాటికీ మానవ తప్పిదమేనని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. నిర్లక్ష్యమే దీనికి కారణమని ఆరోపించారు. దీనికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలన్నారు. జ్యుడిషియల్‌ విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. నీటిపారుదల శాఖను నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి ఈ విషయంలో ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఘటనా స్థలిని సందర్శించాల్సిన బాధ్యత కాంగ్రెస్‌పై ఉందంటూ.. అక్కడికి వెళ్తున్న ఎంపీ రేవంత్‌రెడ్డి సహా ఇతర నాయకులను పోలీసులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఉత్తమ్‌ తెలిపారు. ఆయన శనివారం ఆన్‌లైన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టుకు కేవలం 400 మీటర్ల దూరంలోనే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు భూగర్భ పనులు చేపట్టడం ప్రమాదకరమని 2016లో నిపుణులు ఇచ్చిన నివేదికను ప్రభుత్వం బుట్టదాఖలు చేసిందని ఆరోపించారు. అక్కడ జరుగుతున్న బ్లాస్టింగుల వల్లనే ఇంత నష్టం జరిగిందన్నారు. 14 అంతస్తుల పంప్‌హౌస్‌లో 10 అంతస్తులు నీటిలో మునిగిపోవడంతో ఉమ్మడి మహబూబ్నగర్‌ జిల్లా పరిధిలో 3, 4 లక్షల ఎకరాలకు నీరు అందకుండా పోయి.. వేల మంది రైతులు నష్టపోతారన్నారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిలు ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపించి తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు.
కమీషన్ల కోసం నీటిపారుదల శాఖను నిర్వీర్యం చేశారు: భట్టివిక్రమార్క
కమీషన్లకు కక్కుర్తిపడి నీటిపారుదల శాఖను తెరాస ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత మల్లు భట్టివిక్రమార్క విమర్శించారు. ఈఎన్‌సీ మురళీధర్‌రావు పదవీ విరమణ చేసి ఏడేళ్లయినా ఆయన్నే ఎందుకు కొనసాగిస్తున్నారో చెప్పాలన్నారు. ఆయన ఆధ్వర్యంలో పిలిచిన టెండర్లు, సాంకేతిక అంచనాలపై సీబీఐ లేదా విజిలెన్స్‌ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. శనివారం ఆయన అసెంబ్లీ మీడియాపాయింట్‌ వద్ద విలేకరులతో మాట్లాడారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో పంప్‌హౌస్‌ మునిగి భారీ నష్టం జరిగితే.. మంత్రి నిరంజన్‌రెడ్డి అక్కడికి వెళ్లి గత పాలకుల వల్లే ఇది జరిగిందనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
కేసీఆర్‌ స్వార్థం, నిర్లక్ష్యంతోనే జాతి సంపద ధ్వంసం: రేవంత్‌రెడ్డి
నీటమునిగిన పంప్‌హౌస్‌ని పరిశీలించేందుకు వెళుతున్న ఎంపీ రేవంత్‌రెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ తదితరులను తెలకపల్లి సమీపంలో పోలీసులు అడ్డుకొని ఉప్పునుంతల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో రేవంత్‌రెడ్డి కాలుకు గాయమైంది. ఎంపీ అయిన తనపై దాడి చేయించారని, పోలీసులు కొట్టడంతోనే గాయమైందని ఎంపీ చెప్పారు. ప్రమాదంపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. త్వరలోనే కృష్ణా నది మేనేజ్‌మెంట్‌ బోర్డు ఛైర్మన్‌, కేసీఆర్‌, ఈఎన్‌సీపై కోర్టులో ప్రత్యేక దావా వేస్తానని చెప్పారు. మాజీ మంత్రి చిన్నారెడ్డి, మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణను కూడా పోలీసులు అరెస్టు చేసి పెద్దకొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. భాజపా ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణను వనపర్తి జిల్లా పెబ్బేరులో అడ్డుకొని అరెస్టు చేశారు.  
* కల్వకుర్తి ఎత్తిపోతల పథకంపై 2016లో నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను తక్షణం బయటపెట్టాలని తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి డిమాండు చేశారు. పంప్‌హౌస్‌ మునకపై న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు