close

గ్రేటర్‌ హైదరాబాద్‌

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వరద బాధితులకు సీఎం రిలీఫ్‌ కిట్‌

రూ.2,800 విలువైన సరకులు, 3 దుప్పట్లు ఇంటికే 

జీహెచ్‌ఎంసీపై సమీక్షలో మంత్రి కేటీఆర్‌ 

మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున చెక్కుల పంపిణీ

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌- రాజేంద్రనగర్‌, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఇస్తున్న సీఎం రిలీఫ్‌ కిట్‌లను వరద బాధిత కుటుంబాల ఇళ్ల వద్దకు వెళ్లి అందజేయాలని పురపాలక మంత్రి కేటీఆర్‌ అధికారులను ఆదేశించారు. రూ.2,800 విలువ గల కిట్‌లో నెలకు సరిపడా నిత్యావసర వస్తువులు, 3 దుప్పట్లు ఇస్తున్నట్లు తెలిపారు. నగరాన్ని వరదల ముందున్న సాధారణస్థితికి తెచ్చేందుకు అవసరమైన అన్నిచర్యలు చేపట్టాలని సూచించారు. శనివారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్‌ బొంతు రామ్మోహన్‌, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌తో కలిసి కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ‘‘ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని పటిష్ఠంగా చేపట్టాలి. యాంటీలార్వా, సోడియం హైపోక్లోరైట్‌, క్రిమిసంహారక ద్రావణాలను పిచికారీ చేయించాలి. వ్యర్థాల తొలగింపునకు అదనపు సిబ్బందిని, వాహనాలను వినియోగించాలి. దెబ్బతిన్న ఇళ్లను లెక్కించాలి’’అని సూచించారు. మొబైల్‌ మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ డీఎంఈ డాక్టర్‌ శ్రీనివాస్‌కు కేటీఆర్‌ సూచించారు. సమావేశంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డి.ఎస్‌.లోకేశ్‌కుమార్‌, హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ శ్వేతామహంతి, విపత్తు నిర్వహణ డైరెక్టర్‌ విశ్వజిత్‌ తదితరులు పాల్గొన్నారు.

 కిట్‌లోని సరకులివే..
బియ్యం- 5 కిలోలు, కందిపప్పు- 1 కిలో, వంటనూనె- 500 మి.లీ, కారం- 200 గ్రాములు, పసుపు- 100 గ్రా, సాంబార్‌ పొడి- 200 గ్రా, ఉప్పు- 1 కిలో, చింతపండు- 250 గ్రా, గోదుమపిండి- 1 కిలో, టీ పొడి- 100 గ్రా, పంచదార- 500 గ్రాములు
అప్ప చెరువు ఆక్రమణలు తొలగించండి
రాజేంద్రనగర్‌ పరిధిలోని గగన్‌పహాడ్‌ అప్ప చెరువు ఆక్రమణలపై కఠినంగా వ్యవహరించాలని మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. చెరువుకు గండి పడటంతో గగన్‌పహాడ్‌లో నలుగురు మృతి చెందగా.. పెద్ద సంఖ్యలో వాహనాలు ధ్వంసమైన సంగతి తెలిసిందే. మృతుల కుటుంబ సభ్యులను కేటీఆర్‌ శనివారం పరామర్శించారు. గగన్‌పహాడ్‌లో మృతి చెందిన నలుగురిలో మృతదేహాలు లభ్యమైన ముగ్గురికి, అలీనగర్‌లో మృతి చెందిన మరొకరికి సంబంధించి రూ.5 లక్షల చొప్పున చెక్కులను అందజేశారు. ఆయా కుటుంబాలకు రెండు పడక గదుల ఇళ్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అప్ప చెరువును సందర్శించి ఆక్రమణలను తొలగించాలని ఆర్డీవో చంద్రకళను ఆదేశించారు. చెరువుకు ఎవరైనా ఉద్దేశపూర్వకంగా గండి కొట్టినట్లు తేలితే క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌కు సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, ఎంపీలు అసదుద్దీన్‌ ఒవైసీ, రంజిత్‌రెడ్డి, నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి   తదితరులు పాల్గొన్నారు.
   ట్రామా కేర్‌ సెంటర్‌ ప్రారంభం
శంషాబాద్‌, న్యూస్‌టుడే: హెచ్‌ఎండీఏ- అపోలో సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘ఓఆర్‌ఆర్‌ ట్రామా కేర్‌ సెంటర్‌’ను శంషాబాద్‌లోని కిషన్‌గూడ ఔటర్‌ జంక్షన్‌ వద్ద మంత్రి కేటీఆర్‌ శనివారం ప్రారంభించారు. 10 లైఫ్‌ సపోర్ట్‌ అంబులెన్స్‌లకూ పచ్చజెండా ఊపారు. క్షతగాత్రులకు లైఫ్‌ సపోర్ట్‌ అంబులెన్స్‌ వైద్య సేవలను దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో అందిస్తున్న ఘనత హెచ్‌ఎండీఏకు దక్కిందని ప్రశంసించారు.


విపత్తులు తట్టుకునేలా పారిశ్రామిక పార్కులు
పరిశ్రమల శాఖ అధికారులకు మంత్రి కేటీఆర్‌ ఆదేశాలు

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న 56 పారిశ్రామిక పార్కులను విధిగా బృహత్తర ప్రణాళికతో నిర్మించాలని, అన్నింటికి పకడ్బందీగా అధునాతన లేఅవుట్లు ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. భారీ వర్షాలు, వరదల వంటి విపత్తులను తట్టుకునేలా వాటిని రూపొందించాలని పరిశ్రమల శాఖ అధికారులను ఆదేశించింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో కొత్త పారిశ్రామిక పార్కులను ప్రభుత్వం నిర్మిస్తోంది. వీటికి ఇప్పటికే భూకేటాయింపులు పూర్తయ్యాయి. ఏ పార్కులో ఏ పరిశ్రమలు ఏర్పాటు చేయాలనేది నిర్ణయించారు. తాజాగా హైదరాబాద్‌, ఇతర జిల్లాలను వరదలు, వర్షాలు ముంచెత్తాయి. ఈ నేపథ్యంలో పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ కొత్త పారిశ్రామిక పార్కుల గురించి ఉన్నతస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. విపత్తులను తట్టుకునే అధునాతన ప్రమాణాలతో పారిశ్రామిక పార్కులకు డీపీఆర్‌లు, వాటికి అనుగుణంగా లేఅవుట్లు, వాటిల్లో సౌకర్యాలు, వసతులు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇప్పటికే హైదరాబాద్‌ శివార్లలోని దండుమల్కాపూర్‌లో టీఎస్‌ఐఐసీ ఆధ్వర్యంలో తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య (టిఫ్‌)నిర్మిస్తున్న దేశంలోనే తొలి పారిశ్రామిక పార్కు లేఅవుట్‌ను ప్రామాణికంగా తీసుకోవాలని, తాజా పరిస్థితుల నేపథ్యంలో మరిన్ని సౌకర్యాలను చేపట్టాలని మంత్రి సూచించారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు