close

గ్రేటర్‌ హైదరాబాద్‌

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పోటెత్తిన వాన

ఘట్‌కేసర్‌లో గరిష్ఠంగా 18.1 సెం.మీ. వర్షం
మళ్లీ మూసీ ఉగ్రరూపం
 విద్యుదాఘాతంతో ఇద్దరి మృతి
  స్తంభించిన రాకపోకలు, నీట మునిగిన కాలనీలు

  విధులు ముగించుకుని ఇళ్లకు బయల్దేరిన ఉద్యోగులు, సిబ్బంది, కార్మికులు భారీ వర్షానికి రోడ్లపై చిక్కుకుపోయారు. రాత్రి ఏడు గంటలకు వనస్థలిపురంలో బయల్దేరిన బస్సులు 11 గంటలైనా దిల్‌సుఖ్‌నగర్‌ చేరుకోలేకపోయాయి.

ప్రధాన రోడ్లపై వాహనాలు నిలిచిపోవడంతో పలువురు కాలనీల మార్గాలను ఆశ్రయించి చిక్కుల్లో  పడ్డారు. చెట్లు పడిపోవడంతో  రాకపోకలు సాధ్యం కాలేదు.

మంగళవారం నాటి అతి భారీ వర్షానికి మురుగునీరు, బురదలో ఇన్ని రోజులూ నరకయాతన అనుభవిస్తున్న బస్తీవాసులు.. మరోమారు వెల్లువలా వచ్చిన వరదను చూసి భీతిల్లిపోతున్నారు.

ఈనాడు, హైదరాబాద్‌: జోరువాన రాజధానిని మరోసారి ముంచెత్తింది. వరద కష్టాలు మళ్లీ మొదటికొచ్చాయి. వీడిందనుకున్న వాన.. ఉరుములు, మెరుపులతో శనివారం మళ్లీ విరుచుకుపడింది. క్యుములోనింబస్‌ మేఘాల వల్ల హైదరాబాద్‌ మహానగరంలోని అనేక ప్రాంతాల్లో కుండపోతగా వర్షం పడింది. శాంతించిన చెరువులకు తిరిగి వరద పోటెత్తింది. తగ్గిందనుకున్న నాలాల ప్రవాహం ఉగ్రరూపం దాల్చింది. రోడ్లన్నీ జలమయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బండ్లగూడలో వర్షం మొదలైన మూడు గంటల్లో 12సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. వరదనీటితో కాలనీలు, బస్తీలు ప్రమాదంలో పడ్డాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక జనం బిక్కుబిక్కుమంటున్నారు. నగరవ్యాప్తంగా ఇదే పరిస్థితి తలెత్తింది. వనస్థలిపురం, ఎల్బీనగర్‌, ఉప్పల్‌, సికింద్రాబాద్‌, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, కూకట్‌పల్లి, హైటెక్‌సిటీ, మెహిదీపట్నం, అత్తాపూర్‌,  ఆరాంఘర్‌ చౌరస్తా, చాంద్రాయణగుట్ట రోడ్లపై నడుములోతున నీరు చేరడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. పలుచోట్ల ద్విచక్రవాహనాలు ప్రవాహంలో చిక్కుకుపోయి వాహనదారులు కిందపడిపోయారు. మలక్‌పేట యశోదా ఆస్పత్రి సమీపంలో ఒకరు, అరుంధతినగర్‌లో కంచెలేని విద్యుత్తు నియంత్రిక వద్ద మరో బాలుడు విద్యుదాఘాతంతో మృత్యువాతపడ్డారు. బాటసింగారం, మజీద్‌పుర్‌ మధ్యనున్న వాగు పొంగిపొర్లడంతో ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తున్న కారు కొట్టుకుపోయింది. ఫలక్‌నుమా ప్రధానరోడ్డు మార్గం కుంగిపోయింది. మల్కాపూర్‌ బ్రహ్మపురికాలనీ, గ్రీన్‌హిల్స్‌కాలనీ నీట మునిగాయి. హిమాయత్‌సాగర్‌ గేట్లు తెరవడంతో మళ్లీ మూసీ ఉగ్రరూపం దాల్చింది. గోల్కొండ, లంగర్‌హౌజ్‌, మెహిదీపట్నం, పురానాపూల్‌, చాదర్‌ఘాట్‌, మూసారాంబాగ్‌ ప్రాంతాల్లో మూసీ పరివాహక ప్రాంతాలకు వరద తాకింది. మూసీపై ఉన్న వంతెన మార్గాలను అధికారులు మూసేశారు.

విద్యుత్తు సరఫరాకు ఆటంకం
అనేక కాలనీల్లో సెల్లార్లలో నీరు చేరింది. విద్యుత్తు సరఫరాకు ఆటంకం కలగడంతో వీధులన్నీ అంధకారంలో మగ్గాయి. మంగళవారం  మునిగిన కాలనీలకు మళ్లీ వరద చేరింది. రాత్రి 11 గంటల సమయానికి ఘట్‌కేసర్‌ సింగపూర్‌ టౌన్‌షిప్‌లో 18.1సెంటీ మీటర్ల వర్షం పడింది. నాగోలు, పీర్జాదిగూడలలో 16.9, సరూర్‌నగర్‌లో 16.6, ఎల్బీనగర్‌లో 16.4, బండ్లగూడలో 15.3, హబ్సిగూడ 15.2, కందికల్‌గేట్‌లో 15.1, రామంతాపూర్‌లో 14.9, ఉప్పల్‌లో 14.7 సెం.మీ.ల వర్షం పడింది.

ప్రమాదకరంగా చెరువులు..
దాదాపు 300 కాలనీల్లో ఇప్పటికీ సమస్య తీవ్రంగా ఉండగా.. శనివారం రాత్రి కురిసిన వర్షానికి చెరువులకు మళ్లీ వరద తాకిడి పెరిగింది. దీంతో నాలుగు రోజులుగా ముంపులో ఉండి బయటపడుతున్న లోతట్టుప్రాంతాలు, కాలనీల్లో ఆందోళన నెలకొంది. శివారు ప్రాంతాల్లో రహదారులపైకి భారీగా వరదనీరు చేరుతోంది. నాలాల నుంచి ఉప్పొంగుతున్న మురుగు తోడవటంతో పరిస్థితి బీభత్సంగా మారింది.
నలువైపులా నరకయాతన
* భారీ వర్షం కురుస్తుండడంతో దుర్గం చెరువు తీగల వంతెనపై శని, ఆదివారాల్లో వాహనాల రాకపోకలను అనుమతిస్తున్నామని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ ఎస్‌.విజయ్‌కుమార్‌ తెలిపారు. జూబ్లీహిల్స్‌ నుంచి హైటెక్‌ సిటీవైపు వెళ్లేవారు ఈ మార్గాన్ని వినియోగించుకోవాలని, సందర్శకులు మాత్రం రావొద్దని సూచించారు.
*  హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారిపై వరదనీరు పారుతోందని, పీవీ ఎక్స్‌ప్రెస్‌ హైవే పైనా వర్షం నీరు భారీగా ప్రవహిస్తున్న దృష్ట్యా హైదరాబాద్‌ నుంచి కర్నూలు వైపు వెళ్లే వాహనాలు ఆరాంఘర్‌ మీదుగా రాకుండా బాహ్యవలయ రహదారిని ఎంచుకోవాలని శంషాబాద్‌ డీసీపీ ఎన్‌.ప్రకాశ్‌ రెడ్డి తెలిపారు.
* ఎల్బీనగర్‌ కూడలి వద్ద అండర్‌పాస్‌లో వరదనీరు ప్రవహిస్తుండడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. చింతల్‌కుంటలో వరద ప్రవాహంతో పనామా గోదాములు, వనస్థలిపురం, హయత్‌నగర్‌ వరకూ జాతీయ రహదారిపై వాహనాలు ఆగిపోయాయి. ఉప్పల్‌ నల్లచెరువు పొంగి వరంగల్‌ రహదారిపై  నీరు ప్రవహిస్తుండటంతో రెండువైపులా వాహనాలు స్తంభించాయి.
* సాయం కోరుతూ జీహెచ్‌ఎంసీకి 683 ఫిర్యాదులు వచ్చాయి.
ఏమిటీ క్యుములోనింబస్‌...
అప్పటికప్పుడు ఏర్పడే కారుమబ్బుల్ని క్యుములోనింబస్‌ మేఘాలుగా వ్యవహరిస్తారు. ఈ మేఘాల వల్ల 2, 3 గంటల వ్యవధిలోనే 10 సెంటీమీటర్లకు పైగా కుంభవృష్టి కురవడం ఆనవాయితీ. హైదరాబాద్‌లో శనివారం మధ్యాహ్నం దాకా ఎండ ఉండగా సాయంత్రానికి  కుంభవృష్టి కురిసింది.
* బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో ఈ నెల 19న అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణాధికారి రాజారావు తెలిపారు. ఇది ఈ నెల 20 నాటికి తీవ్రమవుతుందని అంచనా వేస్తున్నామన్నారు.
ప్రధాన రహదారులపై వరదనీరు ముంచెత్తడంతో చాదర్‌ఘాట్‌, మలక్‌పేట రైల్వే వంతెనకింద వాహనాల నిలిచిపోయాయి. కోఠి నుంచి దిల్‌సుఖ్‌నగర్‌ వైపు వెళ్తున్న ఓ కారులోంచి మంటలు ఎగిసిపడ్డంతో అందులో ఉన్న నలుగురూ బయటకు వచ్చారు. పోలీసులు మంటలు ఆర్పి కారును పక్కకు తీసేంత వరకూ గంటసేపు ట్రాఫిక్‌ ఆగిపోయింది. షేక్‌పేట నాలా పొంగడం, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌లలో పడిన వర్షం కిందకు రావడంతో గచ్చిబౌలి వరకూ ట్రాఫిక్‌ స్తంభించింది. మెహిదీపట్నం నుంచి టోలీచౌకీ చేరుకునేందుకు రెండుగంటలు పట్టింది. సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు నానక్‌రామ్‌గూడ, జూబ్లీహిల్స్‌మీదుగా ట్రాఫిక్‌ మళ్లించారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు