close

గ్రేటర్‌ హైదరాబాద్‌

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఇసుక బుకింగ్‌లు బంద్‌

భారీ వర్షాలు, వరదలే కారణం
మార్కెట్లో ధరలకు రెక్కలు
ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెస్తున్న దళారులు

ఈనాడు, హైదరాబాద్‌: భారీ వర్షాలు, వరదలు ఇసుక సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. రీచుల్లో తవ్వకాలు ఆగిపోయాయి. స్టాక్‌యార్డుల్లో నిల్వలు తరిగిపోయాయి. కొన్నిచోట్ల ఇసుక ఉన్నా లారీలు రాకపోకలు సాగించేందుకు అనువైన పరిస్థితుల్లేవు. దీంతో తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎండీసీ) ఆన్‌లైన్‌లో బుకింగ్‌లను నిలిపివేసింది. ఫలితంగా ధరలు పెరిగిపోయాయి. ఈనెల 11, 12 తేదీల వరకు సన్న ఇసుక ధర చిల్లర విక్రయాల్లో టన్నుకు రూ.2,700-రూ.3,000 ఉండగా.. 16వ తేదీ నాటికి రూ. 3,700-రూ. 4,000కు చేరింది. వర్షాల నేపథ్యంలో తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ ముందు జాగ్రత్తగా హైదరాబాద్‌ చుట్టూ సబ్‌ స్టాక్‌ యార్డుల్లో ఇసుకను తెచ్చిపెట్టినా.. ఇప్పటికే నిల్వలు తగ్గిపోయాయి. హైదరాబాద్‌ చుట్టూ టీఎస్‌ఎండీసీ ఏర్పాటుచేసిన యార్డుల్లో బౌరంపేటలో మాత్రమే 30 వేల క్యూబిక్‌ మీటర్ల వరకు ఇసుక ఉన్నట్లు అక్కడి సిబ్బంది చెప్పారు. అయితే చుట్టూ వర్షం నీరు భారీగా చేరింది. వారం, పదిరోజుల వరకు లారీలు వచ్చిపోయే పరిస్థితి లేదని అన్నారు. కొద్దిరోజులు ఆగితే బుకింగ్‌లు, సరఫరా మొదలవుతాయని.. అప్పటివరకు వేచి ఉండాలని టీఎస్‌ఎండీసీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది. కొన్నిచోట్ల ఇసుక అందుబాటులో ఉన్నా వరద, బురద వల్ల వాహనాలు వెళ్లడానికి కుదరక ఇబ్బంది తలెత్తిందని తెలిపింది.

పొరుగు రాష్ట్రాల నుంచి రాక
దళారుల వద్ద మాత్రం ఇసుక దొరుకుతోంది. కొందరు అక్రమంగా, మరికొందరు ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించి అధిక ధరలకు అమ్ముతున్నారు. ‘ఈనాడు’ ప్రతినిధి ఎల్‌బీ నగర్‌లో ఇసుక విక్రయాలు జరిపే ప్రాంతానికి వెళ్లినప్పుడు అనేకచోట్ల నిల్వలు కనిపించాయి. బేరమాడితే కొంత తగ్గిస్తున్నారు. ఓ దళారితో మాట్లాడుతున్న సమయంలోనే.. పరిమితికి మించి భారీ లోడ్‌తో ఓ ఇసుక లారీ వచ్చింది. ఆరా తీస్తే ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెప్పించినట్లు తెలిసింది. లారీలో 40 టన్నుల ఇసుక ఉందని, మొత్తం కొంటే టన్ను రూ. 3,100 చొప్పున ఇస్తానని ఆ వ్యాపారి చెప్పాడు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు