close

క్రైమ్

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
యూపీ కాల్పుల ఘటన కేసులో అయిదుగురి అరెస్టు

 ప్రధాన నిందితులపైౖ జాతీయ భద్రత చట్టం, గూండా చట్టం కింద కేసు నమోదు

బల్లియా: ఉత్తర్‌ప్రదేశ్‌లోని బలియా జిల్లాలో జరిగిన కాల్పుల ఘటనలో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టుచేశారు. మరో అయిదుగురు నిందితులను నిర్బంధించారు. ఈ కేసులో ప్రధాన నిందితులపైౖ జాతీయ భద్రత చట్టం, గూండా చట్టం కింద కేసు నమోదు చేయనున్నట్లు పోలీసులు శనివారం తెలిపారు. రేవతి పోలీస్‌ ఠాణా పరిధిలోని దుర్జన్‌పుర్‌ గ్రామంలో స్వయం సహాయక సంఘాలకు రేషన్‌ దుకాణాలు కేటాయించే విషయమై గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో వివాదం తలెత్తడంతో.. జైప్రకాశ్‌(46) అనే వ్యక్తిని స్థానిక భాజపా నేత ధీరేంద్ర ప్రతాప్‌ సింగ్‌ తుపాకీతో కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ కేసులో 8 మందిని పోలీసులు నిందితులుగా పేర్కొన్నారు. వీరిలో స్థానిక భాజపా నేత ధీరేంద్ర ప్రతాప్‌ సింగ్‌ సహా పరారీలో ఉన్న ఆరుగురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ధీరేంద్ర ప్రతాప్‌ సింగ్‌ సోదరులైన నరేంద్ర ప్రతాప్‌ సింగ్‌, దేవేంద్ర ప్రతాప్‌ సింగ్‌లను ఇప్పటికే అరెస్టుచేశారు. ఈ ఎనిమిది మంది కాకుండా గుర్తు తెలియని మరో 20-25 మందిని పోలీసులు నిందితులుగా ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు. వారిలో ముగ్గురిని మున్నా యాదవ్‌, రాజ్‌ప్రతాప్‌ యాదవ్‌, రాజన్‌ తివారీలుగా గుర్తించి శనివారం అరెస్టు చేశారు. పరారీలో ఉన్న నిందితుల ఆచూకీ తెలిపిన వారికి రూ.50 వేలు నగదు బహుమతిని డీఐజీ సుభాశ్‌ చంద్ర దూబే ప్రకటించారు. ఈ ఘటనపై వేగంగా స్పందించిన సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ ఆదేశాల మేరకు.. సమావేశంలో పాల్గొన్న సబ్‌ డివిజనల్‌ మెజిస్ట్రేట్‌ సురేశ్‌ చంద్ర పాల్‌, సీఐ చంద్రకేశ్‌ సింగ్‌ సహా అక్కడ విధుల్లో ఉన్న 9 మంది పోలీసులను సస్పెండ్‌ చేశారు. ఈ ఘటనను ఎస్పీ, బీఎస్పీ సహా ఇతర పార్టీల నాయకులు ఖండించారు. శాంతిభద్రతల పరిరక్షణలో యోగీ ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం విఫలమయిందని విమర్శించారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు