close

క్రైమ్

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
లాఠీ దెబ్బలతో వృద్ధురాలు మరణించిందని పోలీస్‌ స్టేషన్‌పై దాడి

అడవిదేవులపల్లి, న్యూస్‌టుడే: విచారణ పేరుతో పోలీసులు కొట్టిన దెబ్బలు తాళలేక వృద్ధురాలు మరణించిందని ఆరోపిస్తూ మృతురాలి కుటుంబసభ్యులు, గ్రామస్థులు శనివారం నల్గొండ జిల్లా అడవిదేవులపల్లిలోని పోలీస్‌స్టేషన్‌పై దాడి చేశారు. అడవిదేవులపల్లి మండలం ఉల్సాయిపాలెంలో నాటుసారా తయారీ, విక్రయాలు జరుగుతున్నాయన్న సమాచారంతో పోలీసులు గురువారం రాత్రి గ్రామంలోని కేతావత్‌ సక్రి(55) ఇంటిపై దాడి చేశారు. నిందితురాలిపై కేసు నమోదు చేయడానికి ఠాణాకు తరలించే ప్రయత్నం చేయగా.. మరుసటి రోజు ఉదయం(శుక్రవారం) పంపిస్తామని ఆమె కుటుంబ సభ్యులు, గ్రామస్థులు మాట ఇచ్చారు. దీంతో పోలీసులు వెళ్లిపోయారు. శుక్రవారం ఉదయం ఎస్సై ఎస్‌.కె.నాగుల్‌మీరా గ్రామానికి చేరుకుని నిందితురాలిని ఠాణాకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. ఆమె నిరాకరించింది. వృద్ధాప్య పింఛను ఇప్పిస్తామంటూ నల్గొండలోని డిస్ట్రిక్ట్‌ పోలీస్‌ ట్రైనింగ్‌ సెంటర్‌(డీటీసీ)కు తీసుకెళ్లారు. అనంతరం అదేరోజు రాత్రి 8 గంటల సమయంలో వృద్ధురాలిని ఆమె కుటుంబ సభ్యులు, బంధువులకు అప్పగించారు. శనివారం ఉదయం నుంచి ఒంటి నొప్పులతో బాధపడుతున్న సక్రి.. మధ్యాహ్నం 2 గంటల సమయంలో మృతి చెందిందని బంధువులు తెలిపారు.  విచారణ పేరిట పోలీసులు కొట్టిన దెబ్బలతోనే సక్రి మరణించిందని ఆరోపిస్తూ ఆమె కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్థులు ఠాణాపై దాడికి పాల్పడి ఫర్నిచర్‌ను స్వల్పంగా ధ్వంసం చేశారు. మృతదేహంతో ధర్నా నిర్వహించి వృద్ధురాలి మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ డీఎస్పీ వెంకటేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు