close

బిజినెస్‌

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
₹2500కే జియో 5జీ ఫోన్!

దిల్లీ: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో మరో సంచలనానికి సిద్ధమవుతోంది. రూ.5వేల లోపే 5జీ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. వీలైతే రూ.2,500 నుంచి రూ.3వేలకే విక్రయించాలని యోచిస్తోందని సమాచారం. ‘‘జియో రూ.5వేలలోపే ఓ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురావాలని చూస్తోంది. సేల్స్‌ను బట్టి రూ.2,500 నుంచి రూ.3వేల లోపే దాన్ని విక్రయించాలనుకుంటోంది’’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఆ కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. దీనిపై జియో అధికారికంగా ఎలాంటి ప్రకటనా వెలువడలేదు.

ప్రస్తుతం 4జీ విషయంలో దూకుడుగా ఉన్న రిలయన్స్‌ జియో.. 2జీ వినియోగదారుల పైనా కన్నేసింది. దాదాపు 20 కోట్ల నుంచి 30 కోట్లుగా ఉన్న ఈ వినియోగదారులను తమవైపు తిప్పుకొనే ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఏడాది జరిగిన 43వ కంపెనీ ఏజీఎంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ప్రస్తుత 5జీ దశలోనూ దేశంలో ఇంకా సుమారు 35 కోట్ల మంది 2జీ వినియోగదారులు ఉన్నారని పేర్కొన్నారు. ‘2జీ ముక్త్‌ భారత్‌’ చేయాలని పలుమార్లు పేర్కొన్నారు.

మరోవైపు ప్రస్తుతం దేశంలో 5జీ సాంకేతికత అందుబాటులోకి రానప్పటికీ స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు జరుగుతున్నాయి. వాటి ధరలు రూ.27వేల నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ దశలో రూ.5వేల లోపు 5జీ స్మార్ట్‌ఫోన్‌ అంటే ఓ సంచలనమే! ఇప్పటికే ఆండ్రాయిడ్‌ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌ తయారీకి జియో..  గూగుల్‌తో జట్టుకట్టింది. జియో ప్లాట్‌ఫామ్స్‌పై గూగుల్‌ రూ.33,737 కోట్ల పెట్టుబడితో 7.7 శాతం వాటాను దక్కించుకుంది. ఇంకోవైపు 5జీ ప్రయోగాలకు స్పెక్ట్రం కేటాయించాలని ప్రభుత్వాన్ని జియో కోరుతోంది. అయితే, 5జీ సాంకేతికతలో దేశీయ పరికరాలకు పెద్దపీట వేసే ఉద్దేశంతో ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు