close

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అమెరికా పార్లమెంట్‌లో ఇండో-అమెరికన్ల హవా..!

వాషింగ్టన్‌: నవంబరు 3న జరిగే అమెరికా ఎన్నికల్లో అక్కడి కాంగ్రెస్‌ (పార్లమెంటు)లో ఈసారి ఎక్కువ మంది ఇండో అమెరికన్లు ఎన్నికయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కాకస్‌ల ‌(సమూహాల) మద్దతుతో అమెరికా కాంగ్రెస్‌లో ఇండో-అమెరికన్ల సంఖ్య పెరిగే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ఇది స్పష్టమవుతోందని అమెరికా కాంగ్రెస్‌ సభ్యుడు రాజా కృష్టమూర్తి అభిప్రాయపడ్డారు.

చర్చల ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే ‘కాకస్‌’లలో ఎక్కువ మంది మద్దతు కూడగట్టుకున్న వారే తుది అభ్యర్థిగా నిలుస్తారు. ఇలా ఇప్పటికే ఐదుగురు ఇండో అమెరికన్లు ముందున్నారు. వీరిలో ప్రతినిధుల సభలో నలుగురు కాగా సెనేటర్‌గా ఉన్న కమలా హారిస్‌ ఉన్నారు. కమలా హారిస్ ఇప్పటికే‌ అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా పోటీలో ఉన్న విషయం తెలిసిందే.

ప్రతినిధుల సభలో డాక్టర్‌ అమీ బేరా, రో ఖన్నా, కృష్ణమూర్తితోపాటు ప్రమీలా జయపాల్‌ మరోసారి తిరిగి ఎన్నికయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. వీరిలో అమీ బేరా కాంగ్రెస్‌కు నాలుగు సార్లు ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఐదోసారి ప్రతినిధుల సభలో అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. రో ఖన్నా, ప్రమీలా జయపాల్‌ ఇద్దరూ మూడోసారి గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. డెమోక్రాట్లకు మంచి పట్టున్న ఇల్లినాయిస్‌ స్థానం నుంచి ప్రమీలా బరిలో ఉన్నారు. ఇక టెక్సాన్‌ నుంచి డెమోక్రాటిక్‌ అభ్యర్థిగా పోటీలో ఉన్న ప్రెస్టోన్‌ కులకర్ణీ కూడా రిపబ్లికన్‌ ప్రత్యర్థితో పోలిస్తే ముందంజలో ఉన్నారు. గత సంవత్సరం ఓటమి చవిచూసిన కులకర్ణి  ఈ సారి ప్రతినిధుల సభలో అడుగుపెట్టనున్నట్లు స్థానిక మీడియా అంచనా వేస్తోంది. ఇక మైనె రాష్ట్రం నుంచి సెనేట్‌ రేసులో ఉన్న సారా గిడియాన్‌ (48) రిపబ్లికన్‌ ప్రత్యర్థి నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. భారత మూలాలున్న సారా గిడియాన్‌ తండ్రి భారతీయులు కాగా తల్లి ఆర్మేనియాకు చెందినవారు. వీరితో పాటు మరికొందరు ఇండో అమెరికన్లు అమెరికా పార్లమెంటులో అడుగుపెట్టే దిశగా దూసుకెళ్తున్నారు. రిపబ్లికన్‌ పార్టీ నుంచి రిక్‌ మెహతా, మంగా అనంతాత్ములా, నిషా శర్మ వంటి వారు అమెరికా ఎన్నికల బరిలో ముందున్నారు. అమెరికా చట్టసభల్లో ఇండియన్‌ అమెరికన్లు అడుగుపెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారనడానికి ఇవే నిదర్శనమని అక్కడి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇదిలా ఉంటే, అమెరికాలో అధ్యక్ష పదవితో పాటు కాంగ్రెస్‌కూ ఎన్నికలు జరుగుతాయి. అమెరికాలో కాంగ్రెస్‌ అంటే మన పార్లమెంట్‌ లాంటిది. అక్కడ కూడా రెండు సభలుంటాయి. ఒకటి ప్రతినిధుల సభ (మనలోక్‌సభ లాంటిది). మరొకటి సెనేట్‌ (ఇక్కడ రాజ్యసభలాంటిది). ప్రతినిధుల సభకు రెండేళ్లకొకసారి ఎన్నికలు జరుగుతాయి. అధ్యక్ష ఎన్నికలతో కలిపి ఒకసారి, రెండేళ్లయిన తర్వాత మరోసారి ఉంటాయి. సెనేట్‌ సభ్యుల పదవీ కాలం మాత్రం ఆరు సంవత్సరాలు. ఎన్నికల్లో భాగంగా ప్రతి రాష్ట్రంలోనూ ప్రైమరీలు, కాకస్‌లు జరుగుతాయి. ప్రైమరీలను రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తాయి. కాకస్‌లను పార్టీలు నిర్వహిస్తాయి. పార్టీ తరఫున పోటీ పడే అభ్యర్థులకు ప్రైమరీల్లో రిజిస్టర్డ్‌ ఓటర్లు ఓటు వేస్తారు. కాకస్‌ల్లో సాధారణంగా చర్చల ద్వారా ఒక అభిప్రాయానికి వస్తారు. వీటిల్లో ఎక్కువ మంది మద్దతు కూడగట్టుకున్న వారే తుది అభ్యర్థిగా నిలుస్తారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు