close

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
టాప్ 10 న్యూస్ @ 9 PM

1. ఏపీలో మరో 3 రోజులు వర్షాలు

పశ్చిమ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం వచ్చే 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉన్నందున వచ్చే మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో తేలిక నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రానున్న మూడు రోజులు రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర, దక్షిణకోస్తాలో తేలిక నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. జన్యుపరంగా స్థిరంగానే వైరస్‌!

కరోనావైరస్‌ను ఎదుర్కోవడంలో భాగంగా ఇప్పటికే వ్యాక్సిన్‌ కోసం ముమ్మర కృషి జరుగుతోంది. ఈ సమయంలో మరో ఊరట కలిగించే విషయం వెల్లడైంది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ జన్యుపరంగా స్థిరంగానే ఉందని, ఎలాంటి భారీ ఉత్పరివర్తనాలు (మ్యుటేషన్లు) చోటుచేసుకోలేదని తేలింది. దీనికి సంబంధించిన రెండు దేశవ్యాప్త అధ్యయనాలు ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్లు కేంద్రప్రభుత్వం ప్రకటించింది. కరోనా వ్యాక్సిన్‌ తుది దశ ప్రయోగాలకు చేరుకున్న నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో మ్యుటేషన్ల ప్రభావం ఎక్కువగా ఉందని గుర్తించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

₹2500కే జియో 5జీ ఫోన్!

3. మోదీ వల్ల వాళ్లకూ మేలే: ఫడణవీస్‌

ప్రధాని మోదీపై ప్రజలకున్న నమ్మకం వల్ల భాజపాకు మాత్రమే కాకుండా మిత్రపక్ష పార్టీలకూ మేలు కలుగుతుందని బిహార్‌ భాజపా ఎన్నికల బాధ్యుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ అన్నారు. ఎన్నికల తేదీ దగ్గర పడుతుండటంతో అధికార, ప్రతిపక్షాలు తమ ప్రచారాన్ని వేగవంతం చేశాయి. విమర్శలు, ప్రతి విమర్శలకు పదును పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో పట్నాలో ఎన్డీయే కూటమి నేతలతో ఫడణవీస్‌ సమావేశం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించడం ఖాయమన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. సంకీర్ణ ధర్మం కోసమే నాపై విమర్శలు: చిరాగ్‌

లోక్‌ జనశక్తి పార్టీ (ఎల్జేపీ)తో తమకెలాంటి సంబంధాల్లేవంటూ ఇటీవల భాజపా చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ అధ్యక్షుడు చిరాగ్‌ పాస్వాన్‌ స్పందించారు. సంకీర్ణ ధర్మాన్ని పాటించేందుకు,  బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ను సంతృప్తి పరిచేందుకే ఆ పార్టీ అలాంటి వ్యాఖ్యలు చేస్తోందే తప్ప మరొకటి కాదని పేర్కొన్నారు. ‘‘నాన్న (రాంవిలాస్‌ పాస్వాన్‌) ఆస్పత్రిలో ఉన్నప్పటి నుంచి ఆయన అంత్యక్రియల వరకూ ప్రధాని మోదీ నాకెంతో చేశారు. ఆయన చేసిన మేలును మరిచిపోలేను. నా వల్ల ఆయన ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సంకీర్ణ ధర్మం కోసం, నీతీశ్‌ను సంతృప్తి పరిచేందుకు నన్ను ఆయన ఎన్ని మాటలన్నా పర్వాలేదు’’ అని చిరాగ్‌ అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. శీతాకాలంలో మరోసారి కరోనా విజృంభణ!

రానున్న శీతాకాలంలో కరోనా మరోసారి విజృంభించే అవకాశాలు భయాందోళన కలిగిస్తున్నాయి. నీతి ఆయోగ్‌ సైతం ఇదే విషయాన్ని వెల్లడిస్తోంది. దేశంలో కరోనా కేసులు, మరణాలు తగ్గుముఖం పట్టాయని పేర్కొన్న నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ రానున్న శీతాకాలంలో కరోనా మరోసారి విజృంభించే అవకాశాలను కొట్టివేయలేమన్నారు. కరోనా కట్టడి చర్యల సమన్వయ బృందానికి నేతృత్వం వహిస్తున్న వీకే పాల్ న్యూస్‌ ఏజెన్సీ పీటీఐతో ఆదివారం మాట్లాడారు. యూరోప్‌లో తిరగబెడుతున్న కేసులను గుర్తుచేస్తూ శీతాకాలంలో భారత్‌లో సెకండ్‌ వేవ్‌ వచ్చే అవకాశాలను పరిగణనలోకి తీసుకోవాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. నిర్లక్ష్యానికి..కేరళ మూల్యం చెల్లిస్తోంది!

కరోనా వైరస్‌ వ్యాప్తిని నియంత్రించడంలో నిర్లక్ష్యం వహించినందుకు ప్రస్తుతం కేరళ రాష్ట్రం మూల్యం చెల్లిస్తోందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ అభిప్రాయపడ్డారు. ఓనం ఉత్సవాల సందర్భంగా కరోనా నిబంధనలను పక్కన పెట్టినందుకు ఇప్పుడు తీవ్ర సమస్యను ఎదుర్కొంటున్నట్లు ఆయన స్పష్టంచేశారు. ‘సండే సంవాద్‌’ పేరుతో ప్రతి ఆదివారం సామాజిక మాధ్యమం ద్వారా ప్రజలతో మాట్లాడే కార్యక్రమంలో హర్షవర్ధన్‌ ఈ విధంగా హెచ్చరించారు. ‘ఓనం ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రజలు భారీ సమూహాలుగా తిరిగారు. ఆ సమయంలో సరైన జాగ్రత్తలు పాటించలేదు. ఆ నిర్లక్ష్యానికి కేరళ ఇప్పుడు మూల్యం చెల్లిస్తోంది’ అని హర్షవర్ధన్‌ పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. మహేశ్‌.. మరో రెండు గుండెల చప్పుడు!

అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు మరో రెండు గుండెల చప్పుడయ్యారు. ఆయన సాయంతో ఇద్దరు చిన్నారులకు గుండె శస్త్ర చికిత్స విజయవంతంగా జరిగింది. ఆయన ఇప్పటికే దాదాపు 1000 మంది చిన్నారుల శస్త్ర చికిత్సకు సాయం చేసి, దాతృత్వం చాటుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో ఇద్దరు తల్లిదండ్రుల చిరునవ్వుకు సూపర్‌స్టార్‌ కారణమయ్యారని నమ్రత పేర్కొన్నారు. ఆ కుటుంబాల ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. కోల్‌కతా సూపర్‌ విజయం

హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా సూపర్‌ ఓవర్‌లో విజయం సాధించింది. మ్యాచ్‌ పూర్తయ్యే సమయానికి హైదరాబాద్‌ 163/6తో నిలవడంతో స్కోర్లు సమమయ్యాయి. ఆపై హైదరాబాద్‌ సూపర్‌ ఓవర్‌లో రెండు పరుగులకే రెండు వికెట్లు కోల్పోవడంతో అనంతరం కోల్‌కతా సునాయాసంగా విజయం సాధించింది. రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో మూడు పరుగులు తీయడం ద్వారా మోర్గాన్‌ టీమ్‌ ఈ సీజన్‌లో ఐదో విజయాన్ని నమోదు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ముంబయిXపంజాబ్‌: లైవ్‌ బ్లాగ్‌ కోసం క్లిక్‌ చేయండి

9. ఎన్టీఆర్ సిక్స్‌ప్యాక్‌..‌ ఫొటో వైరల్‌

సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్‌ డబూ రత్నానీ యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ అభిమానుల్ని సర్‌ప్రైజ్‌ చేశారు. ఆయన ఫొటోగ్రాఫర్‌గా కెరీర్‌ ఆరంభించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గతంలో ప్రముఖుల ఫొటోషూట్‌లో తీసిన స్టిల్స్‌ను ఆదివారం షేర్‌ చేశారు. ఈ క్రమంలో ఎన్టీఆర్‌ సిక్స్‌ప్యాక్‌లో ఉన్న అరుదైన చిత్రాన్ని ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. 2018లో ‘అరవింద సమేత’ సినిమా కోసం తారక్‌ ఇలా ఫిట్‌గా తయారయ్యారు. ఆ సమయంలో క్లిక్‌ మనిపించిన ఫొటో అది. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. చెన్నై అభిమానులకు చేదువార్త!

దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో గాయంతో ఆఖరి ఓవర్‌ వేయలేకపోయిన చెన్నై ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో.. కోలుకోవడానికి కొన్ని రోజుల నుంచి వారాల సమయం పడుతుందని ఆ జట్టు కోచ్‌ స్టీఫెన్ ఫ్లెమింగ్‌ తెలిపాడు. శనివారం దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో బ్రావో అస్వస్థతతో మైదానాన్ని వీడిన సంగతి తెలిసిందే. దీంతో ఆఖరి ఓవర్‌లో స్పిన్నర్‌ జడేజాతో బౌలింగ్‌ చేయించగా చెన్నై పరాజయాన్ని చవిచూసింది. అయితే బ్రావోకి గజ్జల్లో గాయమైందని, కోలుకోవడానికి కాస్త సమయం పడుతుందని మ్యాచ్ అనంతరం ఫ్లెమింగ్‌ అన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు