close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
మూడురోజులకే ఎందుకిలా..

నా వయసు పాతికేళ్లు. తలస్నానం చేసిన మూడో రోజుకే జుట్టు అంతా జిడ్డుగా మారుతోంది. ఆ తరువాతి రోజే తలస్నానం చేయకపోతే చాలు, తలంతా చుండ్రు మొదలై, జుట్టు ఎక్కువగా రాలిపోతోంది. దీనికి ఏదైనా పరిష్కారం ఉంటుందా?

- ధరణి, భీమవరం

శరీరప్రకృతి, పిత్తకఫ ప్రకృతి అయితే ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తలలో ఒక రకమైన డెర్మటైటిస్‌ సమస్య ఉన్నప్పుడు జుట్టు జిడ్డుగా మారుతుంది. దీంతోపాటు చుండ్రు మొదలై జుట్టు ఎక్కువగా రాలిపోయే ప్రమాదం ఉంది. దీన్ని నియంత్రించాలంటే ఆహారంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా నూనె పదార్థాలు తగ్గించాలి. చేదుగా ఉండే కాకరకాయ, గోరుచిక్కుడు, దొండకాయ వంటి కాయగూరలను ఎక్కువగా తీసుకోవాలి. తలస్నానం చేయడానికి వీలైనంత కుంకుడుకాయ రసాన్ని వినియోగిస్తే మంచిది. అలాగే స్నానానికి ముందుగా కుంకుడుకాయ రసాన్ని సిద్ధం చేసుకుని, ఇందులో రెండు చెంచాలు వేపాకుల రసం, చెంచాడు మెంతిపొడి వేసి కొద్దిగా కాచి చల్లార్చాలి. ఆ తరువాత ఈ మిశ్రమంతో తలస్నానం చేయాలి. అలాగే స్నానం చివర్లో చెక్క నిమ్మరసం కలిపిన గోరువెచ్చని నీటిని తలపై పోసుకోవాలి.
* చెంచా చొప్పున గోరింటాకు, మెంతి, యష్టిమధు, ఉసిరి పొడులను తగినంత వేడినీటిలో గంటసేపు నానబెట్టాలి. ఈ మిశ్రమాన్ని తలకు ప్యాక్‌లా వేసుకుని అరగంట తరువాత తలస్నానం చేయాలి. వారానికొకసారి ఇలా మూలికల పొడులన్నీ కలిపిన పూత వేయడం ద్వారా మీ జుట్టు ఆరోగ్యంగా, అందంగా తయారవుతుంది. జిడ్డు సమస్య నుంచి దూరం కావచ్చు. అలాగే చుండ్రు, జుట్టు రాలే సమస్య కూడా తగ్గుముఖం పడుతుంది.


మరిన్ని