close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
అనాథ పిల్లలతో ఆటలు.. ప్రిన్స్‌ ఛార్సెస్‌తో మాటలు!

‘వోగ్‌’ కవర్‌పేజీపై అందంగా ఒదిగిపోయినా..
ప్రిన్స్‌ ఛార్లెస్‌తో కలిసి భోజనం చేసినా..  
అదంతా సేవలో భాగంగానే అంటుంది నటాషా పూనావాలా.
వ్యాక్సిన్‌ తయారీరంగంలో అగ్రగామి సంస్థ ‘సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా’ బాధ్యతల్లో కీలకంగా వ్యవహరించడంతోపాటూ...
‘విల్లూ పూనావాలా ఫౌండేషన్‌’ వేదికగా సేవారంగంలో
తనదైన ముద్ర వేస్తోందీ బహుముఖ ప్రజ్ఞాశాలి.  

నదేశంలోని ధనిక కుటుంబాల జాబితాని తీస్తే... అందులో ముందు వరుసలో ఉండే కుటుంబం సైరస్‌ పూనావాలాది. వ్యాపార వర్గాలు ఆయన్ని ‘వ్యాక్సిన్‌ కింగ్‌ ఆఫ్‌ ఇండియా’ అని  పిలుచుకుంటాయి. పిల్లలకు అవసరమైన వ్యాధినిరోధక టీకాల తయారీలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న ‘సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా’ని ఈ కుటుంబమే నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీతో కలిసి కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ని అభివృద్ధి చేస్తున్న ఈ సంస్థకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న నటాషా ఆ ఇంటి కోడలే. మొన్నటివరకూ వ్యాపార కుటుంబంగా మాత్రమే ముద్రపడిన పూనావాలా కుటుంబం నేడు సేవారంగంలోనూ దూసుకుపోవడానికి కారణం నటాషా గొప్పతనమే. తన అత్తగారు విల్లూ జ్ఞాపకార్థం ప్రారంభించిన ‘విల్లూపూనావాలా ఫౌండేషన్‌’ కోసం ఎంత శ్రమైనా పడతాననే నటాషాది భిన్నమైన వ్యక్తిత్వం. ఓ పక్క ఫ్యాషన్‌ ప్రపంచంలో తనదైన ముద్రవేస్తూనే... మరో పక్క విద్య, వైద్య రంగాల్లో, పిల్లలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా పోరాడుతోంది నటాషా.  
ఆ పార్టీలో చూసి...
‘బ్యూటీ విత్‌ బ్రెయిన్‌’ అనే మాటకు అతికినట్టుగా సరిపోయే నటాషా పుట్టి పెరిగింది పుణెలో. ‘లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌’ నుంచి మాస్టర్స్‌ ఆఫ్‌ సైన్స్‌లో డిగ్రీ పుచ్చుకుంది. ఓ న్యూ ఇయర్‌ పార్టీలో సైరస్‌ వారసుడు అదార్‌పూనావాలాను కలుసుకుంది. సేవాపరంగా ఇద్దరి భావాలు ఒక్కటే కావడంతో వివాహంతో ఒక్కటయ్యారు. ఇద్దరు పిల్లలు. సైరస్‌, డేరియస్‌. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఏమాత్రం వెనకాడని తత్వం నటాషాది. పెళ్లయిన తర్వాత సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చిన్నచిన్న విభాగాల్లో పనిచేస్తూ చకచకా వ్యాపార సూత్రాలని వంటపట్టించుకుంది. అత్యంత తక్కువకాలంలోనే ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ హోదాని అందుకోగలిగింది. మరోపక్క అత్తగారి జ్ఞాపకార్థం ప్రారంభించిన విల్లూ పూనావాలా ఫౌండేషన్‌కి ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు తీసుకుంది. ఇందులో భాగంగా ఏ ఆసరాలేని పేదల కోసం ఉచితంగా వైద్య, విద్యా సౌకర్యాలు అందించడం మొదలుపెట్టింది. 24 గంటలు అందుబాటులో ఉండే ఆధునిక వైద్య సేవలని అందుబాటులోకి తెచ్చింది. కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా... స్కూళ్లని నిర్మించి యాభైవేలమంది పిల్లలకు ఉచితంగా విద్యనందిస్తోంది. పరిశుభ్రమైన నీటిని అందించడం కోసం సౌరశక్తితో నడిచే నీటి ఏటీఎమ్‌లకు శ్రీకారం చుట్టింది. వీటితోపాటూ కాలుష్యం లేని నగరాలని తీర్చిదిద్దడానికి.. పర్యావరణంపై దృష్టిపెట్టి వెయ్యిఎకరాల స్థలంలో పార్కుల నిర్మాణం చేపట్టింది. రూ.100 కోట్లతో వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ పద్ధతుల్ని తీసుకొచ్చి కాలుష్యానికి చెక్‌ పెడుతోంది.


ప్రిన్స్‌ ఛార్లెస్‌తో కలిసి...
భవిష్యత్తు తరాలని కాపాడుకునే పనిని ‘మనం కాకపోతే ఎవరు చేస్తారు?’ అని ప్రశ్నించే నటాషా సేవలో తనకి మెలిండాగేట్స్‌ ఆదర్శం అంటోంది. పిల్లలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా బ్రిటన్‌ యువరాజు ప్రిన్స్‌ ఛార్లెస్‌తో కలిసి మరో అడుగు ముంద]ుకేసింది. ఛార్లెస్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న ‘బ్రిటిష్‌ ఏషియన్‌ ట్రస్ట్‌’కి చెందిన చిల్డ్రన్స్‌ ప్రొటెక్షన్‌ ఫండ్‌ ఇండియాకు ఛైర్‌పర్సన్‌గా నిర్వహణ బాధ్యతలని తీసుకుంది. ‘ఎనిమిదేళ్ల క్రితం ప్రిన్స్‌ ఛార్లెస్‌ భారత్‌లో పర్యటించినప్పుడు మా వ్యాక్సిన్‌ తయారీ యూనిట్‌ని చూడ్డానికి వచ్చారు. ఆయన నడిపే బ్రిటిష్‌ ఏషియన్‌ ట్రస్ట్‌ సేవాకార్యక్రమాలకి మా సంస్థ నుంచే వ్యాక్సిన్లు వెళ్లేవి. మేము చేస్తున్న పని నచ్చడంతో ఆయన సేవా సంస్థను భారత్‌లో నిర్వహించే పనిని  నాకప్పగించారు. బాలలపైన జరిగే హింసని అరికట్టడం, లైంగిక విద్యపై అవగాహన, మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించడం వంటివి ఈ సంస్థ లక్ష్యాలు. ఇప్పటికే రాజస్థాన్‌లో వివిధ రంగాల్లో బాలకార్మికులుగా బతుకీడిస్తున్న అనేకమంది చిన్నారులకు విముక్తి కలిగించాం’ అనే నటాషా.. నెదర్లాండ్స్‌లో పిల్లలకోసం సైన్సుపార్కునీ నడుపుతోంది. ‘ఒక మంచి పని... మరో మంచి పని చేయడానికి కావాల్సిన సానుకూల ఆలోచలని, శక్తిని అందిస్తుంది. అదే వ్యతిరేక ఆలోచన... మనలోని శక్తిని హరిస్తుంది. అందుకే ఈ నిమిషం మా సంస్థలో హెచ్‌.ఆర్‌. బాధ్యతలు చూస్తాను. మరునిమిషం... పుణె, ఆలీబాగ్‌లో నేను ఉచితంగా కట్టిన స్కూళ్లలో చదువుతున్న పిల్లలతో కలిసి ఆడుకుంటాను. ప్రిన్స్‌ఛార్లెస్‌తో కలిసి భోజనం చేస్తూ ఆర్గానిక్‌ ఆహారంపై చర్చిస్తాను. ఇవన్నీ నాలో శక్తిని నింపుతాయి. నాలుగు మంచి పనులుచేయడం కోసం రోజులో వెయ్యిసార్లు విమానం ఎక్కి దిగడానికీ నేను రెడీ. ‘చనిపోతే తప్ప నేను పూర్తిగా నిద్రపోనేమో’ ఈ మాటని మావారితో తరచూ అంటాను’ అని నవ్వేసే నటాషాని ఫ్యాషన్‌ ప్రపంచంలో ఐకాన్‌గానే అభివర్ణించవచ్చు. నటి, మోడల్‌ కాకపోయినా ఫ్యాషన్‌లో ప్రయోగాలు చేసే నటాషాని వోగ్‌ మ్యాగజైన్‌ ఎన్నోసార్లు కవర్‌పేజీపై ముద్రించడానికి కారణం అదే.


మరిన్ని