close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ఆవలి గట్టున... ఆమె కోసం!

అవి మార్చి నెల చివరి రోజులు... లాక్‌డౌన్‌తో మహారాష్ట్రలోని నర్మదా నది ఒడ్డునున్న ఆ రెండు గ్రామాలకూ రవాణా నిలిచి పోయింది. ఆ గ్రామాల్లో ఎందరో గర్భిణీలూ, బాలింతలూ, చిన్నారులూ... వాళ్లందరికీ పోషకాహారం అందాలంటే ఎవరైనా నదిని దాటి ఆ గ్రామాలకు వెళ్లాల్సిందే. తానే పడవ నడుపుతూ ఆ సాహసం చేస్తోంది అక్కడి అంగన్వాడీ ఉద్యోగిని రేలు.
నర్మదానది ఒడ్డున ఉన్న.. నందర్‌బర్‌ జిల్లా(మహారాష్ట్ర)లోని చిమల్‌కేడీ గ్రామం రేలు వాసవేది. ఆరేళ్లక్రితం స్థానిక అంగన్‌వాడీ ఉద్యోగిగా చేరింది. నర్మదానదికి ఆవలివైపు ఉన్న అలీఘాట్‌, దాదర్‌ గ్రామాల్లో ఉండే గిరిజనులు  నదిని దాటి వచ్చి రేలు దగ్గర్నుంచి పిల్లలు, గర్భిణులకు కావాల్సిన పౌష్టికాహారం, మందులు, రేషన్‌ సరకులు వంటివన్నీ తీసుకెళుతూ ఉండేవారు. కానీ వాళ్లకు అసలు కష్టాలు ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచే మొదలయ్యాయి. లాక్‌డౌన్‌ కారణంగా రవాణా నిలిచిపోయింది. పడవలు కట్టేవాళ్లు లేరు. దాంతో నది ఆవల ఉన్న గిరిజనులు ఇవతలికి రాలేని పరిస్థితి.  రేలు ఈ జనవరిలో ఓ ఆడపిల్లను ప్రసవించింది. సెలవులో ఉన్నా.. రేలుని గిరిజన గ్రామాల్లో ఉన్న గర్భిణులు, బాలింతల పరిస్థితి కలవర పెట్టింది. ఒక ఉద్యోగిగా మాత్రమే కాదు, బాలింతగా కూడా. నదినిదాటి ఒక్కరూ ఇటువైపుకు రాకపోతే ఆ బిడ్డలకు వ్యాక్సిన్లు, ఆ తల్లులకు ఐరన్‌ మాత్రలు ఎవరు చేరుస్తారు?ఈ ఆలోచనలే ఆమెని నిరంతరం కలవర పెట్టేవి. వాళ్లు రాకపోతేనేం... తనే వెళ్లాలని నిర్ణయించుకుంది. కానీ మామూలు పడవల్లేవు. చేపలు పట్టడానికి జాలర్లు వాడే నాటు పడవలే కనిపించాయి. ఇక చేసేది లేక రోజుకి 50 రూపాయల చొప్పున అద్దె చెల్లించి తనే సొంతంగా పడవను నడపడానికి సిద్ధమయ్యింది. రేలుకి.. ఈత కొట్టినపిండి. ఆపై పడవ నడపడం కూడా నేర్చుకుంది. మందులు, వ్యాక్సిన్లు, పసిపిల్లలకు అందివ్వాల్సిన పౌష్టికాహారాన్ని నింపుకొని పడవను నడుపుకొంటూ నదిని దాటింది. రెండుమూడు మైళ్లదూరం కొండల్లోకి నడిచి.. ఆ సామాను మొత్తాన్ని ఒంటరిగా మోస్తూ వెళ్లిన రేలుకి తన కోసం ఆశగా ఎదురుచూస్తున్న గిరిజనులు కనిపించగానే ఆమె అలసట అంతా మాయమయ్యింది. ఇలా ఏదో ఒక రోజుతో అయిపోయిందనుకుంటే పొరపాటు... కరోనా గురించి గిరిజనులకు ఇంకా భయం పోకపోవడంతో ఏడునెలలుగా ఇలానే చేస్తోంది. ‘ఉదయం మా గ్రామంలో వారికి కావాల్సిన సరకులు అందిస్తా. మధ్యాహ్నం నుంచి పడవ ప్రయాణం మొదలుపెడతా. మొత్తం 17 కిలోమీటర్ల దూరం. రెండు గ్రామాల్లో 600కు పైగా గడపలుంటాయి. వారికి కావాల్సిన మందులు, పౌష్టికాహారంతోపాటు చిన్నారుల బరువు చూసే వేయింగ్‌ మిషన్‌నీ తీసుకెళ్తుంటా. ఇంటికొచ్చేసరికి చీకటిపడిపోతుంది.  పడవ ప్రయాణంలో భయం అనిపించినా ఈత వచ్చు కాబట్టి ఎలా అయినా బయటపడొచ్చనే ధైర్యం నాది. నా శ్రమ వృథాపోలేదు. మా ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే నన్ను అభినందించారు. అంతకంటే ఏం కావాలి?’ అంటోంది రేలూ!


మరిన్ని