close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ఆ మచ్చలు తగ్గేదెలా?

నా వయసు 35. నాకు ఆస్తమా ఉండటంతో మందులు వాడుతున్నాను. వీటితో దురదలు వస్తున్నాయి. గోకితే అక్కడ నల్లగా మచ్చలు పడుతున్నాయి.  ఇలా ఒళ్లంతా నల్ల మచ్చలు పడ్డాయి. మందులు మానేస్తే అవి తగ్గిపోతున్నాయి. కానీ ఆస్తమా సమస్య తీవ్రమవుతోంది. నాకు సొరియాసిస్‌ లేదు. అయినా ఇలా ఎందుకు జరుగుతోంది?

- వైశాలి, హైదరాబాద్‌

వివిధ రకాల కారణాల వల్ల ఇలా దురదలు వస్తాయి. ఒక్క మందుల వల్లే కాకుండా ఆహారం పడకపోయినా ఇలా జరగొచ్చు. అలాగే ఒత్తిడి వల్ల కూడా ఈ సమస్య ఎదురవుతుంది.
జాగ్రత్తలు: వీలైనంత వరకు మీరు సబ్బు వాడకాన్ని తగ్గించాలి. గాఢత తక్కువగా ఉండే క్లెన్సర్లను వినియోగించాలి. దురదగా ఉన్నప్పుడు గోకకుండా కొబ్బరినూనె లేదా వైట్‌ పెట్రోలియం జెల్లీ రాయాలి. స్నానానికి, అలాగే రాత్రి పడుకునే ముందు కొబ్బరినూనె రాసుకోవాలి. వైట్‌ పెట్రోలియం జెల్లీ రాసినా ఫలితం ఉంటుంది. వీటివల్ల చర్మం పొడిబారకుండా తేమగా ఉంటుంది. వేసుకునే దుస్తుల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. వదులుగా ఉండే నూలు వస్త్రాలనే ధరించాలి. దురద పుట్టిన ప్రతిసారీ గోకకుండా కొబ్బరినూనె రాయాలి. ఎక్కువ వేడిగా ఉండేవి కాకుండా గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి.   దురద మరీ ఎక్కువగా ఉన్నప్పుడు ఐస్‌నీళ్లలో వస్త్రాన్ని ముంచి ఆ ప్రాంతంలో కప్పడం వల్ల కూడా తగ్గుతుంది.  ఎండలోకి వెళ్లే ముందు సన్‌స్క్రీన్‌ రాసుకోవడాన్ని కూడా అలవాటు చేసుకోవాలి.
అలాగే మీకు ఈ మందులను సూచించిన వైద్యులను ఒకసారి కలిసి పడుతున్న ఇబ్బందులను వివరించండి. ఆస్తమాకు ప్రస్తుతం వాడుతున్న మందులను మారుస్తారు. లేదా దురదలు, మచ్చలు తగ్గడానికి నోటి ద్వారా తీసుకునే మందులను సూచిస్తారు. ఆస్తమా, దురదలు రెండింటినీ తగ్గించే మందులు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.


మరిన్ని