close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
పులి... పది మీటర్ల దూరంలో!

మనిషి నెత్తురు రుచి మరిగిన మృగాన్ని పట్టుకునే పనిలో ఉన్నారు ఓ ఇద్దరు మహిళా అధికారులు. అడుగడుగునా సవాళ్లు... వాటిని దాటుతూ లక్ష్యం వైపు వెళుతున్నారు వారు...
కుమురం భీం జిల్లా...
పెంచికల్‌పేట, దహెగాం ఫారెస్టు రేంజి ప్రాంతాలు...
మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లో దట్టమైన అడవులకు ఆనుకుని ఉన్న 110 గ్రామాలు, జనావాసాలు వీటి పరిధిలోకి వస్తాయి.. నెల రోజులుగా వరసగా జరుగుతున్న పెద్ద పులి దాడులతో ఇక్కడి ప్రజలకు కంటి మీద కునుకులేదు.

దిగిడకు సమీపంలో ఉన్న  పెద్దవాగులో చేపలు పట్టుకుని వస్తున్న విఘ్నేశ్‌ అనే యువకుడిని, పెంచికల్‌పేట మండలం కొండపల్లి సమీపంలో పొలాల్లో పత్తి తీయడానికి వెళ్లిన నిర్మల అనే బాలికను పెద్ద పులి పొట్టన పెట్టుకోవడంతో ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నారు. ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందోననే భయంతో అటు అధికారయంత్రాంగం కూడా ఆందోళనగా ఉంది.

ఒకవైపు టైగర్‌ రిజర్వు ఫారెస్టు కావడంతో పులిని పట్టుకోవడంలో నిబంధనలు.. మరోవైపు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మనిషి నెత్తురు రుచి మరిగిన పులి దాడులు. అటు పులిని ప్రాణాలతో పట్టుకోవాలి... ఇటు ప్రజల్లో భయంతో పెరుగుతున్న ఆందోళనలను నివారించాలి...

ఈ సవాళ్ల మధ్య అక్షరాలా కత్తిమీద సాములాంటి బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు ఆ ఇద్దరు మహిళా అధికారులు. వారిలో ఒకరు దహెగాం ఫారెస్ట్‌ రేంజి ఆఫీసర్‌ పూర్ణిమ, మరకొరు పెంచికల్‌పేట డిప్యూటీ రేంజి ఆఫీసర్‌ రమాదేవి.
రోజూ ఉదయం 6:30కే ఆయా గ్రామాలకు వెళ్లి ప్రజల బాగోగులు విచారించి, వారికి ధైర్యం చెప్పిరావడం వీరి విధుల్లో ముఖ్యభాగం. పులి జాడను కనిపెట్టడానికి అడవిలో సర్వే చేయాల్సిందీ వీరే. పులిని బంధించాల్సిన ప్రధాన బాధ్యత కూడా వీరిదే. 

దట్టమైన అడవిలో వెళ్తుంటే ఎదురుగా పులి కనిపిస్తే... పైప్రాణాలు పైనే పోతాయి కదా.
కానీ ఈ పెద్ద పులి వేటలో ఒకటి కాదు నాలుగు సార్లు పులిని చూసిన వారున్నారు. 

తమ సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ రోజుల తరబడి సాగే అన్వేషణలో ధైర్యసాహసాలతో పాటు అకుంఠిత దీక్ష కూడా అవసరం. ఆ అటవీ అధికారులు అడుగడుగునా సవాళ్లను ఎదుర్కొంటూ ధైర్య సాహసాలకు ప్రతీకగా నిలుస్తున్న తీరు ఎంతో ఆసక్తికరం...


కుమురం భీం జిల్లా దహెగాం మండలం దిగిడలో నవంబర్‌ 11న విఘ్నేష్‌ అనే యువకుడు పులి దాడిలో చనిపోయాడు. ఈ ప్రాంతంలో పులి తరచూ ప్రజలకు కనిపించినా ఎన్నడూ మనుషులపై దాడి చేయలేదు. కానీ విఘ్నేశ్‌ ఘటనతో ప్రజల్లో ఆందోళన తారాస్థాయికి చేరింది. పులి కదలికను పర్యవేక్షించడంతో పాటు, ఇటు గ్రామస్థులకు ధైర్యం కల్పించాలనే లక్ష్యంతో దిగిడ గ్రామంలోనే మకాం ఉన్నాను.  40 మంది అటవీ సిబ్బంది ఆరుగురు చొప్పున బృందాలుగా దిగిడ అడవుల్లో అన్వేషణ మొదలుపెట్టాం. పులి పాదముద్రలు, చెట్లు గీరడం, పెరామెన్స్‌ అనే వాసన ఆధారంగా పులి ఉనికితో పాటు, ఎటు వైపు వెళ్లింది అనే అంశాలను తెలుసుకునే వాళ్లం. చరవాణి సాంకేతాలు లేనందున దిగిడలోనే కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసి, పులి కదలికల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలియచేసేవాళ్లం. దిగిడ దాడి జరిగిన మూడు రోజులకు అడవుల్లో పులి పాదముద్రల ఆధారంగా ముందుకు వెళ్తున్న క్రమంలో పది మీటర్ల దూరంలోనే పులి కనిపించింది. నాతో పాటు సిబ్బంది మొత్తం విగ్రహాల్లా నిలబడిపోయాం. పులినే చూస్తూ మెల్లిగా వెనక్కి నడిచాం. పులి పక్కకు వెళ్లిపోవడంతో ఊపిరి తీసుకున్నాం. మనుషులు పరిగెత్తినా, అనవసర అలికిడి చేసినా పులి దాడి చేస్తుంది. ప్రస్తుతం శాకాహార జంతువుల కోసం 15 హెక్టార్లలో గడ్డి క్షేత్రాలను పెంచడంతో పాటు, నీటి వసతి కోసం నాలుగు చోట్ల సోలార్‌ బోర్లను, సాసర్‌పీట్‌లను ఏర్పాటు చేశాం.

- బస్వరాజు పూర్ణిమ, ఫారెస్ట్‌ రేంజి ఆఫీసర్‌, దహెగాం.


ప్రజలే చంపుతామన్నారు...కానీ!

కొండపల్లి ప్రాంతంలో యువతిని చంపిన అనంతరం పులి కదలికపై ప్రత్యేక నిఘా ఉంచాం. రెండో మరణం పులి వల్ల సంభవించడంతో పెంచికల్‌పేట్‌, దహెగాం మండలాల్లో గ్రామల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. పులిని పట్టుకుంటారా, మమ్మల్నే చంపేయమంటారా అని నిలదీసేవారు. మరోవైపు పులి నిత్యం ఈ ప్రాంతంలో ఏదో చోట ప్రజలకు కనిపించేది. పులి సంరక్షణ చర్యలతో పాటు, సమీప ప్రాంతాల్లో ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయడం కత్తిమీద సాములా మారింది. ఈ నేపధ్యంలో వారిని సముదాయించి, ప్రజలతో మమేకమవుతూ విధులు నిర్వహించాను. ఇప్పటికే ఈ ప్రాంతంలో మూడు కొత్త పులులు తిరుగుతున్నందున ప్రజలను అనుక్షణం అప్రమత్తం చేస్తున్నాం. వన్యప్రాణుల జీవన విధానం, తీసుకునే జాగ్రత్తల గురించి ప్రజలను వివరిస్తున్నాం. ఉదయం ఆరు గంటలకు పులి అడవుల నుంచి బయటకు వచ్చే అవకాశం ఉన్నందున ఈ సమయానికి ముందే అంటే ఐదు గంటలకే సిద్ధమై వాహనాల్లో అటవీ పరిసర గ్రామాలకు వెళ్లి ప్రజలను అప్రమత్తం చేస్తున్నా.

- రమాదేవి, డిప్యూటీ ఫారెస్టు రేంజి ఆఫీసర్‌, పెంచికల్‌పేట
- చొక్కాల రమేశ్‌, ఆసిఫాబాద్‌.


మరిన్ని