close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
116 ఏళ్లుగా ఆమె సంకల్పమే!

చల్లని చేతులతో పురుడు పోసి తల్లీబిడ్డలను క్షేమంగా ఇంటికి పంపించడమే లక్ష్యంగా పనిచేస్తుందీ ఆసుపత్రి. అందుకే ఆంధ్రప్రదేశ్‌లో సుఖ ప్రసవాల్లో అగ్రగామిగా నిలిచింది. విజయనగరం జిల్లాలో అమ్మాయి.. అమ్మ... అమ్మమ్మ ఇలా ఏ తరాన్ని అడిగినా చాలామంది తన ప్రసవం ఘోషా ఆసుపత్రిలో జరిగిందని చెబుతారు.  దీని  ఏర్పాటు వెనక ఓ తెలుగింటి ఆడపడుచు ఆశయం ఉంది. శ్రమ ఉంది. 116 ఏళ్ల తర్వాత కూడా అది ప్రజలకు వరంగా మిగులుతోంది.

‘కార్పొరేట్‌ ఆసుపత్రిని తలదన్నే సదుపాయాలున్నా.. పేదింటి ఆడపడుచు కూడా ఏమాత్రం సంకోచం లేకుండా, డబ్బు గురించి ఆలోచించకుండా సుఖ ప్రసవం చేయించుకుని తన బిడ్డతో నవ్వుతూ ఇంటికెళ్లే ఆసుపత్రి ఏదయినా ఉందంటే అది మా ఘోషా ఆసుపత్రే’ అంటారు విజయనగరం వాసులు. అవును మరి.. 116 సంవత్సరాలుగా అక్కడి ఆడపడుచుల నమ్మకం ఏమాత్రం సడలనీయకుండా ఈరోజుకీ  భరోసానిస్తోందీ ఆసుపత్రి. ఈ ఆసుపత్రికి ప్రాణం పోసింది ఓ రాణిగారు. ఆమె పేరు.. రాణి రివా... రివా సర్కార్‌ అని కూడా అంటారు. ఆ పేరుని చూసి ఇదేదో ఉత్తరాది పేరు అనుకునేరు. ఈమె అచ్చంగా మన తెలుగింటి ఆడపడుచు. విజయనగరం ఆడ బిడ్డ... రాణి అప్పలకొండయాంబకున్న మరోపేరు అది. మూడో విజయరామరాజు గజపతి కుమార్తె ఈమె. విజయనగరం ప్రజలకు ఎన్నో సేవలు అందించిన  ఆనందగజపతిరాజు చెల్లెలు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని భగేల్‌ఖండ్‌కి చెందిన రామ్‌రాజ్‌సింగ్‌ని వివాహం చేసుకున్న తర్వాత రాణి రివాగా మారారామె.

కరోనా సమయంలో కోవిడ్‌ రోగుల కంటే కూడా గర్భిణులే ఎక్కువ ఇబ్బందులు పాలయ్యారు. ప్రైవేట్‌ ఆసుపత్రులూ వెనకడుగువేశాయి. ఆ సమయంలో వైద్యుల కొరత ఇబ్బందిపెడుతున్నా ఘోషా ఆసుపత్రి మాత్రం ‘మన ఆడ బిడ్డలను మనం చూడకపోతే ఇంకెవరు చూస్తారు’ అంటూ ముందుకొచ్చింది. కోవిడ్‌ బారినపడ్డ గర్భిణులను కేంద్ర ఆసుపత్రికి తరలించి అక్కడికి ఘోష ఆసుపత్రి నుంచి సిబ్బందిని పంపించి ప్రసవాలు చేసింది.

ఎన్నో కలలతో అత్తవారింట అడుగుపెట్టిన ఆమె కొంతకాలానికే భర్త మరణించడంతో తిరిగి విజయనగరం చేరుకున్నారు. ఇక్కడ పరిపాలనా వ్యవహారాలు చూడటం మొదలుపెట్టారు. ఆ సమయంలో ప్రజల కష్టాలు ఆమెని కలచివేశాయి. ముఖ్యంగా గర్భిణుల వెతలు ఆమెని కన్నీళ్లు పెట్టించాయి. ‘సరైన వైద్య సదుపాయాలే ఉంటే వీళ్లకీ కడుపుకోతలుండవుగా’ అన్న ఆలోచనతో రాణీ అప్పలకొండయాంబ 1904లో సుమారు అయిదెకరాల భూమిలో ఘోష ఆస్పత్రిని నిర్మించారు. ‘స్త్రీలకోసం ప్రత్యేకంగా’ అనే అర్థం వచ్చేట్టు ‘ఘోష’ అనే పేరుపెట్టారామె.ప్రజలకు మంచి నీటిని అందించడంకోసం చంపావతి నది నుంచి పైప్‌లైన్లను సైతం వేయించారు అప్పటి నుంచి రాణి సంకల్పం చెక్కుచెదరలేదు. 116 ఏళ్లుగా ఆసుపత్రి ఏ రోజూ స్త్రీల నమ్మకాన్ని వమ్ము చేయలేదు సరికదా రోజురోజుకూ విశ్వాసాన్ని పెంచుకుంటూ పోతోంది. అత్యుత్తమ సదుపాయాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తోంది. అందుకే ఏటా కేంద్ర ప్రభుత్వం అందించే స్వచ్ఛభారత్‌, నాక్‌తో పాటూ మరెన్నో ప్రతిష్ఠాత్మక అవార్డులని అందుకుంటూ శెభాష్‌ అనిపించుకుంటోంది.

-చందక మధు, విజయనగరం


మరిన్ని