close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
పశువులు మేపిన అమ్మాయిఇకపై న్యాయమూర్తి!

తెల్లవారుజామున నాలుగ్గంటలకే నిద్రలేచి పశువుల కొట్టంలో పనులన్నీ పూర్తిచేసి... పాలు పితికి, వాటిని ఇంటింటికీ తిరిగి అమ్మిన తర్వాతే పుస్తకాలు తెరిచేది సోనాల్‌శర్మ. అంత పని చేసిన తర్వాత కూడా ఇక చదువుకొనే సమయం ఎక్కడిది అనుకోవచ్చు. కానీ అన్ని పనులు చేసిన తర్వాత కూడా చదువుపై ప్రేమను ఏమాత్రం తగ్గించుకోలేదు సోనాల్‌. ఆ శ్రమ ఊరికే పోలేదు. జడ్జి పదవికి  అర్హురాలిని చేసింది.

సోనాల్‌ తండ్రి ఖ్యాలీలాల్‌ది పాల వ్యాపారం. అతని నలుగురి పిల్లల్లో సోనాల్‌ ఒకరు. రాజస్థాన్‌లోని ఉదయపుర్‌లో ఉన్న ప్రతాప్‌నగర్‌ ఆమె సొంతూరు. వీళ్ల కుటుంబానికి నాలుగు ఆవులే ఆధారం. అయినా తమ పిల్లలను బాగా చదివించాలనుకునేవారా దంపతులు. దానికి తగ్గట్టు సోనాల్‌ చిన్నప్పట్నుంచీ చదువుపై ఆసక్తిని చూపించేది. ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి వరకు చదువుకున్న ఆమె మంచి మార్కులను సాధించింది. అంతవరకూ బాగానే ఉంది కానీ... ఇంటర్‌లో చేరిన తర్వాత నుంచీ తన కోసం ఫీజు కట్టడానికి అప్పులు చేస్తున్న తండ్రిని చూసి మనసు చలించిపోయేది. కానీ ఈ కష్టాలు పోవాలంటే  ఇంకా బాగా చదువుకోవాలని అనుకుంది. అందరిలా ప్రైవేటుకు వెళ్లే స్తోమత లేకపోవడంతో లైబ్రరీలోనే చదువుకునేది. తెలియని విషయాలను మాస్టార్ల దగ్గర అడిగి తెలుసుకునేది. తను చదువుకోవడంతో పాటూ తండ్రికి అండగా ఉండటం కూడా ముఖ్యమని అనుకుంది. అందుకే... ఉదయం నాలుగ్గంటలకే తండ్రిలాగే నిద్రలేచేది. పశువుల కొట్టాన్ని శుభ్రం చేయడం... పాలు పితికి ఇరుగుపొరుగు వారికి వాటిని అమ్మి రావడం వంటి పనులన్నింటిలో తండ్రికి చేదోడువాదోడుగా ఉండేది. ఆ తరువాత మిగిలిన కొద్ది సమయంలో కూడా ఏకాగ్రతతో చదువుకునేది. ‘బుద్ధిగా పాలు అమ్ముకోక... నీకెందుకీ చదువని’ చాలామంది సోనాల్‌ని విమర్శించేవారు. ‘ఆడపిల్లలున్నారు. ఉన్నదాంట్లో మంచి సంబంధం చూసి పెళ్లి చేసి పంపించేయ్‌’ అంటూ అటు తండ్రికి కూడా బంధువులు సలహాలిచ్చేవారు. సోనాల్‌ మాత్రం తనకి జడ్జి అవ్వాలని ఉందని తండ్రితో తన మనసులోని మాట చెప్పింది. ఆమాటకు తండ్రి సంతోషించాడు. తన స్తోమతకు మించిన విషయమే అయినా చదివించాలనే గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఆమె కూడా మనసు పెట్టి చదవడంతో బీఏ ఎల్‌ఎల్‌బీలో బంగారు పతకాలను సాధించింది. సుఖాదియా యూనివర్శిటీలో ప్రతిష్ఠాత్మక ఛాన్సెలర్‌ మెడల్‌నూ దక్కించుకుంది.

జడ్జి పదవికి అర్హత సాధించేందుకు అవసరమైన జ్యుడిషియల్‌ ఎగ్జామ్స్‌ రాసేటప్పుడు కూడా తన తండ్రి ఇచ్చిన ప్రోత్సాహమే తనని ముందుకు నడిపించిందంటుంది. ‘పరీక్షల సమయంలో నన్ను ఆవుల దగ్గర ఏ  పనిచేయనిచ్చేవారు కాదు. అయినా రోజూ నేను చేసే పనులన్నీ ముగించిన తరువాతే చదువుకునేదాన్ని. తోటి పిల్లలందరూ హాయిగా ఆడుకుంటుంటే.. నేను మాత్రం ఆవుల దగ్గర పేడ ఎత్తేదాన్ని. చిన్నప్పుడు బడికి వెళ్లేటప్పుడు నా చెప్పులకంటుకున్న పేడని చూసి స్నేహితులందరూ ఆటపట్టించేవారు. కానీ వాటిని పట్టించుకునేదాన్ని కాదు. ఆ పనే కదా మా ఇంటికి ఆధారం. అందుకే నేను చేసే పనిని గౌరవించేదాన్ని. గతవారమే జ్యుడిషియల్‌ ఎగ్జామ్స్‌ ఫలితాలు వచ్చాయి. ఎంపికయ్యా. చాలా సంతోషంగా ఉంది. నా బాల్యమంతా పేదరికంలోనే గడిచింది. నాలాంటి పేదలకు న్యాయం జరిగేలా చూడాలనుకునేదాన్ని. ఇప్పుడా కల నెరవేరబోతోంది. జోథ్‌పుర్‌ జ్యుడిషియల్‌్ అకాడమీలో ఏడాదిపాటు శిక్షణకు వెళ్లనున్నా. జడ్జిగా నా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి, పేదలకూ న్యాయం దక్కేలా చేయడానికి కృషి చేస్తా. అమ్మానాన్నను గర్వపడేలా చేస్తా’ అని చెబుతోంది సోనాల్‌ శర్మ.


మరిన్ని