close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
పెళ్లి తర్వాత ఉద్యోగం మానేయాలనుకుంటున్నా...

నా వయసు 25. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నా. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. పెళ్లి తర్వాత ఉద్యోగం మానేయాలనుకుంటున్నా. నా స్నేహితుల్లో చాలామంది పెళ్లి, ఉద్యోగం... రెంటినీ బ్యాలెన్స్‌ చేసుకోవడంలో ఇబ్బంది పడుతుండటం చూశాక ఈ నిర్ణయానికి వచ్చా. కొన్నాళ్లపాటు బ్రేక్‌ తీసుకోవడం మంచి ఆలోచనేనా?

-మానస, విజయవాడ

ఉద్యోగం చేసే ప్రతి మహిళకూ... ఏదో ఒక దశలో ఈ సందిగ్ధం ఎదురవుతుంది. నిజానికి ఈ ప్రశ్నకు కచ్చితంగా ఫార్ములా, సలహా లాంటివి లేవు. అయితే, ఈతరం అమ్మాయిల్లో కొందరు ఈ విషయంలో మీలానే పెళ్లి, పిల్లల తర్వాతే కెరీర్‌ని కొనసాగిద్దామనుకుంటున్నారు. ప్రతి కుటుంబంలోనూ ఉద్యోగం చేస్తూ కుటుంబ బాధ్యతల్నీ చూసుకుంటూ ముందుకెళ్లిన మహిళలు కనిపిస్తారు. కచ్చితంగా ఇది కష్టమైన పనే. దీనికి ప్రధాన కారణం ఇంటి నిర్వహణలో, పిల్లల పెంపకంలో మగవాళ్లు తగిన బాధ్యత తీసుకోకపోవమే. ఒకప్పటితో పోల్చితే పరిస్థితి మెరుగుపడింది. కానీ, పూర్తిగా మారిందనలేం.
మీరు ఒక నిర్ణయానికి వచ్చే ముందు వాస్తవాల్నీ చూసుకోవాలి. ఎవరి లక్ష్యమైనా పరిపూర్ణమైన జీవితాన్ని అనుభవించడమే! మన పరిధిని దాటి, కష్టపడి పనిచేసినపుడే జీవితంలో సంతృప్తి ఉంటుందని చాలా మానసిక అధ్యయనాల్లో రూఢీ అయింది. వ్యక్తిగత, వృత్తి జీవితాల్లో రాణించే మహిళలకు ఈ రకమైన సంతృప్తి దొరుకుతుంది. కష్టపడి పనిచేయడం, ఆర్థిక స్వతంత్రం, వృత్తిలో రాణించడం వీటివల్ల వారికి ఆత్మవిశ్వాసం వస్తుంది. బ్రేక్‌ తీసుకుని కెరీర్‌ని పునఃప్రారంభించడం పెద్ద సమస్య కాదు. కానీ మీ రంగంలోని మార్పుల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ అవసరమైన నైపుణ్యాల్ని మెరుగుపర్చుకోండి. గృహిణిగా ఉంటూనే సృజనాత్మకతతో మీదైన ముద్ర వేసే రంగాలు చాలా ఉన్నాయి. మహిళలు ఉద్యోగాల్లోనే కాకుండా ఇతర రంగాల్లోనూ ప్రభావం చూపుతున్నారు. ఆ కోణంలోనూ ఆలోచించండి.


మరిన్ని