close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ఆ రోజు సిరాజ్‌ను ఎందుకు రావొద్దన్నానంటే...

తనని గుండెలపైన ఆడించిన నాన్న... తన ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకున్న నాన్న... ఇక లేడని తెలిసినప్పుడు ఏ కొడుకైనా చివరిచూపు కోసం పరితపిస్తాడు. కానీ సిరాజ్‌ అలా చేయలేదు.. గుండెని రాయి చేసుకున్నాడు. అందుకు కారణం అతని తల్లే. ఆటను వదిలేసి వెనుతిరగాలనుకున్న సమయంలో తల్లి షబానాబేగం చెప్పిన ఓ మాట అతనిపై మంత్రంలా పనిచేసింది.  అతన్ని ఆపింది. ఆమాటలే అతని విజయానికి బాటలు పరిచాయి.. తండ్రి కలని నిజం చేశాయి... ఇంతకీ ఆ తల్లి చెప్పిన మాటలు ఏంటి?
ఆస్ట్రేలియాతో ప్రతిష్ఠాత్మక టెస్టు సిరీస్‌కు ఎంపికైన హైదరాబాద్‌ పేసర్‌ మహమ్మద్‌ సిరాజ్‌ కంగారూ గడ్డపై అడుగుపెట్టాడు. కానీ అంతలోనే తండ్రి చనిపోయాడంటూ విషాద వార్త అతని చెవిన పడింది. తనను క్రికెటర్‌గా తీర్చిదిద్దేందుకు ఎంతో శ్రమ పడ్డ నాన్న ఇక లేడనే విషయాన్ని జీర్ణించుకోలేక అతను వెక్కివెక్కి ఏడ్చాడు. తండ్రి చివరి చూపైనా దక్కించుకోవాలని భారత్‌కు తిరిగి వచ్చేద్దామని తల్లికి ఫోన్‌ చేశాడు. ‘‘నువ్వు దేశం తరపున టెస్టు క్రికెట్‌ ఆడాలనేది మీ నాన్న కల. అది నిజం చేసే ఇంటికి రా’’.. అంటూ ఆ తల్లి చెప్పిన మాటలు అతనిపై మంత్రంలా పనిచేశాయి. ఆ తర్వాత గబ్బా వేదికగా అతను సాధించిన విజయం ప్రపంచానికి మొత్తానికి తెలుసు. కానీ ఆ బిడ్డను అంత ధీరోదాత్తుడిగా మలచిన ఆ తల్లి బాధ మాత్రం కొందరికే తెలుసు. భర్త పోయిన బాధలోనూ.. దుఃఖాన్ని దిగమింగుకుని కొడుకుకు ఆత్మస్థైర్యం కలిగిస్తూనే వచ్చిన ఆ అమ్మ పేరు షబానా బేగం. అంత విషాదంలోనూ సిరాజ్‌కు మానసిక బలాన్ని అందించారామె.
ఐపీఎల్‌ పదమూడో సీజన్‌ కోసం గతేడాది ఆగస్టులోనే సిరాజ్‌ ఇంటి నుంచి వెళ్లాడు. మంచి ప్రదర్శన ఇవ్వడంతో ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌కు టీమ్‌ఇండియాలో చోటు దక్కించుకున్నాడు. ‘ఆ వార్త తెలిశాక మేమందరం చాలా సంతోషపడ్డాం. ముఖ్యంగా వాళ్ల నాన్న ఆనందానికైతే అవధుల్లేవు. టెస్టుల్లో ప్రాతినిథ్యం వహిస్తే చూడాలనేది ఆయన కల.  కానీ అదే సమయంలో అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ఆరోగ్యం మెరుగుపడి ఇంటికి తిరిగొస్తారనుకున్నా. కానీ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతారని ఊహించలేదు. ఆయన మరణం సిరాజ్‌పై ప్రభావం చూపించకూడదనుకున్నా. అందుకే తను ఇంటికి వస్తా అంటే వద్దని చెప్పా. టెస్టుల్లో ఆడాలనే మీ నాన్న కలను నిజం చేశాకే స్వదేశంలో అడుగుపెట్టమని చెప్పా. నా బాధను పంటిబిగువున దాచి తనతో రోజుకు రెండు, మూడు గంటలు ఫోన్‌లో మాట్లాడేదాన్ని. ఇంటికి వచ్చిన వాడిని చూడగానే కన్నీళ్లు ఆగలేదు. పట్టుకొని ఏడ్చేశాకే నా మనసు కుదుటపడింది’.. అంటూ మనసులోని బాధని చెప్పారు షబానాబేగం.

- శనిగారపు చందు


చిన్నప్పటి నుంచే..

సిరాజ్‌కు చిన్నప్పట్నుంచీ క్రికెట్‌ అంటే ప్రాణం. మ్యాచ్‌లంటూ ఎప్పుడూ బయటే ఉండేవాడు. ఓ వైపు పేదరికం అడ్డుపడుతున్నా వాడిని నిరుత్సాహపరచాలనుకోలేదు. నా భర్త ఆటో నడిపేవారు. నేను కూడా ఏవో చిన్నచిన్న పనులు చేసేదాన్ని. వచ్చిన డబ్బుతోనే ఇల్లు నెట్టుకొచ్చాం. మరోవైపు సిరాజ్‌ ఆటలో అంచెలంచెలుగా ఎదిగాడు. మ్యాచ్‌ ఉందంటూ పరీక్షలు ఎగ్గొట్టినా అతణ్ని ఏమనలేకపోయేవాళ్లం. ఇంటర్‌లోనూ అదే జరిగింది. ఏదో ఒక రోజు తను మమ్మల్ని గర్వపడేలా చేస్తాడనే నమ్మకంతో సిరాజ్‌ను ప్రోత్సహించాం. 2017 ఐపీఎల్‌ తర్వాత మా పరిస్థితి మారింది. మా పెద్దోడు ఇప్పుడు సిరాజ్‌ బాధ్యతలు చూసుకుంటున్నాడు. వాళ్లిద్దరినీ చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది.  తల్లిదండ్రులుగా మా బాధ్యతను సమర్థంగా నిర్వర్తించినందుకు ఎంతో తృప్తిగా ఉంది. ఆయన మా మధ్య లేకపోవచ్చు.. కానీ పై నుంచి సిరాజ్‌ని చూసి గర్వపడుతూనే ఉంటారు.


మరిన్ని