close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
కాళ్లూ చేతులూ లేకున్నా...ఆల్‌రౌండర్‌ అయ్యింది

క్యాన్సర్‌తో బాధపడుతూ ఆశలన్నీ ఆవిరై.. మరణం అంచుల్లో ఉన్న వాళ్లకి కూడా నూర్‌ మాటలు వింటే బతుకు మీద ఆశపుడుతుంది. మరణాన్ని జయించాలన్న తపన మొదలవుతుంది. నూర్‌ బొమ్మ వేసినా, వయెలిన్‌ వాయించినా, పాటపాడినా అందులో జీవకళ ప్రవహిస్తుంది. పదిహేడేళ్లకే ఓ అమ్మాయి ఇవన్నీ చేయడం, తన సేవతో తోటివారి మనసులని గెల్చుకోవడం గొప్పే. కానీ పుట్టుకతోనే కాళ్లూ, చేతులూ లేని ఓ అమ్మాయి చేయడం ఇంకా గొప్పవిషయం! కాదంటారా...

హెమీమెలియా... అరుదైన వ్యాధి. నూటికో కోటికో ఒక్కరికి వస్తుంది. చందమామలాంటి నూర్‌జలీల్‌ ఆ కోటిలో ఒక్కరు అయ్యింది. ఈ వ్యాధి కారణంగానే ఆమె పుట్టుకతోనే చేతులూ, కాళ్లూ లేకుండా పుట్టింది. కేరళలోని కాలికట్‌కు చెందిన మధ్యతరగతి కుటుంబం నూర్‌ది. తమ బిడ్డలో లోపాన్ని గుర్తించిన తల్లిదండ్రులు... ఆ పాప తన సమస్యను అధిగమించేందుకు కావాల్సిన ధైర్యాన్ని కానుకగా ఇవ్వాలనుకున్నారు. ‘నువ్వూ అందరిలాంటి అమ్మాయివే’ అనే నమ్మకాన్ని కలిగించేందుకు స్కూల్లో చేర్పించారు. కానీ ఆ ప్రయత్నం అంత తేలిగ్గా అయిపోలేదు. చాలా స్కూళ్లు ‘ఇలాంటి అమ్మాయి మా స్కూల్లో చేరితే తోటిపిల్లలు ఇబ్బందిపడతారండీ’ అంటూ మొహంమీదే చెప్పేశాయి. చివరికి ఓ స్కూల్‌ ఆమెకు సీటు ఇచ్చింది. అక్కడే నూర్‌కి తక్కినవారికీ, తనకీ మధ్య ఉండే తేడా ఏంటో తెలిసింది. తోటిపిల్లలు చేసే హేళనలు, గుచ్చిగుచ్చి చూసే చూపులతో చాలాసార్లు నిరాశలోకి కూరుకుపోయింది. ‘అందరిలా నేనెందుకు లేనమ్మా’ అంది అమ్మతో. అందుకు సమాధానంగా ఆమె తల్లి... ‘నీ లోపాల గురించి మర్చిపో... నువ్వెలా ప్రత్యేకంగా ఉండగలవో ఆలోచించు’ అంది. నూర్‌పై ఆ మాటలు మంత్రంలా పనిచేశాయి. దానికితోడు ఓ సంస్థ అందించిన కృత్రిమ కాళ్లు నూర్‌ని సాధించాలనే ఆశయం దిశగా కొత్త అడుగులు వేయించాయి. ఓ రోజు అనుకోకుండా అక్క స్కూల్‌కి రికార్డు పుస్తకాన్ని తీసుకెళ్లడం మరిచిపోయింది. దాన్ని డ్రాయింగ్‌ బుక్‌ అనుకుని దానిలో బొమ్మ గీసింది నూర్‌. విషయం తెలిస్తే అక్క తిడుతుందని భయపడింది. కానీ ఇంటిల్లిపాదీ తనని పొగడ్తలతో ముంచెత్తడం ఆశ్చర్యపోయింది. అవును మరి.. మొండిచేతులతో కూడా ఆమె అద్భుతమైన చిత్రాన్ని గీసింది. అది మొదలు చిత్రలేఖనం ఆమెకు ప్రాణమైంది. కేరళ ప్రభుత్వం వరద సాయాన్ని కోరుతూ ఓ ప్రత్యేక మ్యాగజైన్‌ని ప్రచురించింది.

దానికి నూర్‌ వేసిన బొమ్మ ముఖచిత్రమై ఎన్నోవేలమందికి సాయం అందడానికి కారణమైంది. అది మొదలు ఎప్పటికప్పుడు తన చిత్రాలని వేలం వేసి వచ్చిన డబ్బుని క్యాన్సర్‌ రోగులకు అందిస్తోంది. నూర్‌ బొమ్మలు వేయడంలోనే కాదు పాటలు పాడటం, వయొలిన్‌ కూడా బాగా వాయించగలదని ఇంట్లో వాళ్లకి తెలిసింది. ‘నా మొండిచేతులతో పదునైన తీగలని మీటడానికి చాలా కష్టపడ్డాను. నాలాంటి వాళ్లకి ఆ కష్టం తప్పదని తెలుసు. నాదైన ప్రత్యేకత కోసమే అంత కష్టపడ్డాను. గిటార్‌ వాయించడంలోనూ శిక్షణ తీసుకున్నా’ అంటోంది నూర్‌. పదోతరగతి పూర్తయ్యేసరికి స్కూల్‌లో ఆల్‌రౌండర్‌గా నిలిచి తనను హేళన చేసినవారి నుంచే అభినందనలనూ అందుకుంది. తనలా మరెవరూ బాధపడకూడదని స్ఫూర్తి ప్రసంగాలు ఇవ్వడం మొదలుపెట్టింది. క్యాన్సర్‌ రోగుల అంతిమదశలో గడిపే పాలియేటివ్‌ సెంటర్‌లో స్వచ్ఛందంగా పనిచేస్తూనే డిగ్రీ పూర్తిచేసింది. ‘డ్రీమ్‌ విత్‌ అజ్‌’ అనే ఎన్జీవోతో కలిసి పనిచేస్తున్నా. నా సంగీతంతో వారిలో ఉత్సాహం నింపుతా. నేను చేసిన పనులు, నా మాటలు నచ్చి...దాదాపు పదిహేను వేలమంది ఇన్‌స్టాలో అనుసరిస్తున్నారు. నాసాను సందర్శించడం, ఎవరెస్టు పర్వతం ఎక్కడం నా లక్ష్యం’ అనే నూర్‌ ప్రస్తుతం సివిల్స్‌ కోసం సిద్ధమవుతోంది.
 


మరిన్ని