close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
అంతా శూన్యమైనవేళ... అన్నీ తానైంది!

అమ్మా..నేనో వలస కూలీని..  బిడ్డలతో పునరావాస కేంద్రంలో ఉన్నా.  రెండు రోజుల నుంచీ పిల్లలు ఏమీ తినలేదు..అంటూ ఓ మహిళ ఏడుస్తూ అర్ధరాత్రి ఫోన్‌ చేసింది..ఆ మాట విని చలించిన ఆ అధికారిణి వెంటనే అప్పటికప్పుడు పులిహోర తయారుచేసి 30 కిలోమీటర్ల దూరంలో కొవిడ్‌ శిబిరంలో ఉన్న ఆ మహిళను వెతికి పట్టుకొని బిడ్డలకు ఆహార పొట్లాలు అందించి ఆకలి తీర్చారు..విజయనగరం ఎస్పీ రాజకుమారి సేవాభావానికి ఇదొక ఉదాహరణ మాత్రమే..కొవిడ్‌ సమయంలో అలుపెరగకుండా ఆమె చేసిన సేవకుగానూ ‘కొవిడ్‌ ఉమెన్‌ వారియర్‌’గా కేంద్రమంత్రి ప్రకాష్‌ జావడేకర్‌ చేతుల మీదుగా దిల్లీలో జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు..
కొవిడ్‌ కష్టకాలంలో ఎదురైన అనేక సమస్యలకు ఆమె ఓ పోలీస్‌ ఉన్నతాధికారిణిలా కాకుండా మనసున్న మానవతామూర్తిలా స్పందించారు. ఆకలితో ఉన్నవారి పట్ల అమ్మలా దయ చూపించారు. గర్భిణులు, పిల్లల సమస్యలని ఓ తల్లిలా అర్థం చేసుకున్నారు. వలస కార్మికులకు అన్నంపెట్టి, వారి కాళ్లకు చెప్పులు అందించారు. ఆమె ఒక్కరే... కానీ 50 వేల మందికి సాయం అందించారు. ఆమె చొరవ కారణంగానే విజయనగరం జిల్లాలో కరోనా విస్తృతికి అడ్డుకట్ట పడి.. గ్రీన్‌జోన్‌ జిల్లాగా మారింది. ఆ సమయంలో ఆమె చేసిన  అవగాహన కార్యక్రమాలు ఎందరికో స్ఫూర్తిగా నిలిచాయి.
డ్రోన్‌తో పర్యవేక్షించారు...  లాక్‌డౌన్‌ అమలులో భాగంగా రాజకుమారి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకున్నారు. డ్రోన్‌ కెమెరాలతో ఏ ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉందో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పకడ్బందీగా చర్యలు చేపట్టారు. యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా యువతను  ఆకట్టుకునేలా వీడియో, ఆడియో సందేశాలిచ్చారు. జిల్లాలో సుమారు 40 అంతర్‌ జిల్లా, అంతర్‌ రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి..వాటి దగ్గర డీఎస్పీ, సీఐలని సమన్వయకర్తలుగా నియమించి పర్యవేక్షించారు. 12 మొబైల్‌ బృందాలను నియమించి ఎప్పటికప్పుడు లాక్‌డౌన్‌ అమలు తీరును సమీక్షిస్తూ వచ్చారు. ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారు, ఆసుపత్రులకు వెళ్లాలని, చివరి చూపు చూడాలని, పిల్లల మీద బెంగ పెట్టుకున్నామని ఇలా అన్ని రకాల విజ్ఞప్తుల పట్ల ఆమె సానుకూలంగా స్పందించి అత్యధికంగా ఇ-పాస్‌లు మంజూరు చేశారు. చేతిలో చిల్లిగవ్వ లేదని అన్నవారికి స్వయంగా వాహనాలు సమకూర్చి ఇళ్లకు పంపించారామె. అందుకే ఆమె ప్రజల మనసుల్లో గుర్తుండిపోయారు.

రాజకుమారి గతేడాది నాలుగు స్కోచ్‌ అవార్డులను అందుకున్నారు. అందులో రెండు కొవిడ్‌ సమయంలో అందించిన సేవలకుగాను, మరో రెండు మహిళల భద్రతకు సంబంధించి చేసిన సేవకూ అందాయి.

మహిళలకు అండగా...  మహిళలకు అన్ని వేళలా అండగా ఉండేందుకు రాజకుమారి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. మహిళా కానిస్టేబుళ్లతో మహిళా రక్షక్‌ బృందాలను ఏర్పాటు చేశారు. వీరికి తైక్వాండోలో ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. ఏ మహిళ అయినా రాత్రి సమయంలో ఇంటికి వెళ్లలేని పరిస్థితిలో ఉంటే 100కు ఫోన్‌ చేసి పోలీసుల సాయం, రక్షణ పొందేలా ఏర్పాటు చేశారు. ఒకవేళ దూర ప్రాంతం వెళ్లలేని పరిస్థితి ఉంటే దిశ మహిళా పోలీసు స్టేషన్‌లోనే వారికి ఆశ్రయం కల్పిస్తారు.

‘పోలీసు అంటే కొట్టడం..తిట్టడం.. అరెస్టు చేయడం..జైలులో పెట్టడం అనుకుంటారు చాలామంది. విధి నిర్వహణలో మానవత్వానికీ ప్రాధాన్యమివ్వాలి.  ఎవరికీ ఏ కష్టం రాకుండా, ఎవర్నీ నొప్పించకుండా పనిచేయాలి. అది మా బాధ్యత. మార్చి 23 నుంచి విజయవంతంగా లాక్‌డౌన్‌ను అమలు చేయగలిగామంటే అది అందరి సహకారం వల్లే సాధ్యమైంది.’
 

-బి.రాజకుమారి, ఎస్పీ-విజయనగరం

- చందక మధు, విజయనగరం


మరిన్ని