close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
మీ ఇంటిని అందంగా సర్దిపెడతారు!

వార్డ్‌రోబ్‌ తెరిస్తే చాలు... కిందపడిపోయేన్ని డ్రెస్సులు. మనకు కావాల్సింది మాత్రం దొరకదు!  ఆఫీసు టైం అయిపోతుంది. వంటకు కావాల్సిన సరకులు ఎక్కడ పెట్టామో గుర్తుకురాదు... అలాగని పద్ధతిగా సర్దుకునే సమయం దొరకదు. ఇంకొందరికి అంత ఓపిక ఉండదు.  ఇలాంటివాటికి పరిష్కారం చూపిస్తున్నారు ముంబయికి చెందిన రోహిణీ రాజగోపాలన్‌. స్పేస్‌ మేనేజ్‌మెంట్‌ ఆర్గనైజర్‌గా వినూత్నమైన వృత్తిని ఎంచుకున్న ఆమె గురించి తెలుసుకుందాం!

‘ఏంటి? ఇంత చదువుకునీ... పరాయి ఇళ్లకు వెళ్లి బీరువాలను, వంటగదుల్నీ సర్దుతావా? అదేం పని అని ఆశ్చర్యంగా అడుగుతారు చాలామంది. ఆర్గనైజర్‌ అనే వృత్తే ఉందని మేరీకోండో పుస్తకం చదివేవరకూ నాకూ తెలియదు. ఇక ఎంత డిమాండ్‌ ఉందో మార్కెట్‌లోకి అడుగుపెట్టాకే అర్థమైంది. మొదట నా తల్లిదండ్రులూ నేను చేస్తున్న పనిని మెచ్చలేదు. వారిని ఒప్పించడానికి నాకు కొంత సమయం పట్టింది. ఈ రోజుల్లో ఇంటిని అందంగా, శుభ్రంగా సర్దుకునే తీరిక చాలామందికి ఉండటంలేదు. అందుకే ఇంట్లో అన్ని వస్తువులూ ఉన్నా అవసరానికి మాత్రం అందుబాటులో కనిపించవు. వీటన్నింటినీ ఓ క్రమపద్ధతిలో పెట్టి...అవసరమైనవి అందుబాటులో ఉంచి, అనవసరమైన వస్తువులను తీసేసి పనులు సులువుగా పూర్తయ్యేలా చూడటమే మా పని’ అంటారు స్పేస్‌ మేనేజ్‌మెంట్‌ ఆర్గనైజర్‌ రోహిణి.  
ముంబయికి చెందిన రోహిణి ఎంబీఏ చేసి మొదట్లో ప్రముఖ సంస్థలకు బ్రాండింగ్‌ చేసేవారు. రెండో బిడ్డ పుట్టాక కొంత విరామం తీసుకోవాలనుకున్నారు. అప్పుడు  తరచూ ఆమె స్నేహితులు, కుటుంబ సభ్యులు...ఇంట్లోని వస్తువులు, సర్దుకోవడం, ఇరుకుగా మారుతున్న స్థలం వంటి విషయాల గురించి చర్చించేవారు. అది అంత క్లిష్టమైన అంశం ఎలా అయ్యిందో ఆమెకి అర్థం కాలేదు. అదే సమయంలో మేరీకోండో ఇల్లు సర్దుకోవడానికి సంబంధించి రాసిన స్పార్క్‌ జోయ్‌ పుస్తకం రోహిణి కంట పడింది. ‘అప్పుడే తెలిసింది ఆర్గనైజర్లకు భవిష్యత్తులో ఎంత డిమాండ్‌ ఉండబోతోందో. ఒక్క ఆస్ట్రేలియాలోనే సుమారు ఇరవై వేలమంది ప్రొఫెషనల్‌ ఆర్గనైజర్లు ఉన్నారట. అమెరికాలోని ప్రతి నగరంలోనూ ఇరవై నుంచి ముప్పై మంది ఈ వృత్తిలో నిపుణులుగా రాణిస్తున్నారు. మరి మన దేశానికి ఇలాంటి అవసరం అంతకంటే ఎక్కువే అనిపించింది’ అంటారామె.

శిక్షణ తీసుకుని మరీ... ‘చిన్నప్పుడు సెలవుల్లో నానమ్మ ఇంటికి వెళ్లేదాన్ని. అక్కడ నా కజిన్‌ ఒకరు... తన బొమ్మలు, ఇతర వస్తువులు, పుస్తకాలతో షెల్ఫ్‌లన్నీ నింపేసేది. నేను వెళ్లాక ఇద్దరం కూర్చుని అనవసరమైనవన్నీ తీసేసి... అందంగా సర్దేవాళ్లం. ఏటా ఇది మాకో పనిలా ఉండేది. అయితే భవిష్యత్తులో దీన్నే వృత్తిగా తీసుకుంటానని మాత్రం అనుకోలేదు’ అంటారామె. ఆ పుస్తక ప్రభావంతోనే డీక్లట్టరింగ్‌, ఆర్గనైజింగ్‌ల గురించి మరింత లోతుగా తెలుసుకోవడం మొదలుపెట్టారు రోహిణి. ఏడాది తర్వాత ఓ ఆన్‌లైన్‌ కోర్సులో చేరి ప్రొఫెషనల్‌గా సర్టిఫికెట్‌నూ అందుకున్నారు. ‘శిక్షణ పూర్తయ్యాక  స్నేహితుల ఇళ్లల్లో వార్డ్‌రోబ్‌, కిచెన్‌ వంటివి సర్దిపెట్టి చూశా. వారికెంతో నచ్చింది. పైగా  వారు తమ షాపింగ్‌ శైలినే నేను చెప్పిన సూచనలకు అనుగుణంగా మార్చుకోవడం నాలో ఉత్సాహం నింపింది. అలా 2016లో ‘ఆర్గనైజ్‌విత్‌ఈజ్‌’ పేరుతో సంస్థను ప్రారంభించాం’ అని చెబుతారు రోహిణి.
వినియోగదారుల అభిరుచితో... ‘పళ్లెం నిండా రుచికరమైన పదార్థాలెన్నో ఉంటాయి. కానీ మనకు నచ్చిన వాటిమీదకే మొదట మనసు మళ్లుతుంది. ఇంటిని అమర్చుకోవడం కూడా ఇలాంటిదే. చాలామంది తమకు ఉపయోగంలో లేనివాటిని తీసి పాడేయరు. దీంతో అవన్నీ చెత్తలా పేరుకుపోతాయి. ఇలాంటప్పుడు సున్నితంగా చెప్పి వినియోగదారుల ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యం ఇచ్చి ఈ పని చేయాల్సి ఉంటుంది. ఇల్లంతా శుభ్రం అయ్యాక వారి ముఖాల్లో సంతోషం చూస్తే మా శ్రమంతా పోతుంది’ అంటారామె. ముంబయి, బెంగళూరు, హైదరాబాద్‌, పుణెల్లో సుమారు 120కి పైగా ఇళ్లను పదుల సంఖ్యలో ఆఫీసుల్నీ వీరు నిర్వహించారు. ఈ బృందంలో పదిహేనుమంది సిబ్బందీ పనిచేస్తున్నారు.


మరిన్ని