close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ఏటా లక్షల్లో  అమ్ముతున్నాం!  

దూర ప్రయాణాలు చేయాలంటే...చంటోడికి డైపర్‌ తొడగాల్సిందే. ఉద్యోగానికి వెళ్లి తిరిగొచ్చేవరకూ నాన్నని బుజ్జాయి విసిగించకూడదంటే కూడా డైపరో, లంగోటీనో వాడాల్సిందే. అయితే డైపర్లు దద్దుర్లు వంటి సమస్యలకు కారణమైతే, లంగోటీలు అసౌకర్యంగా ఉంటాయి. అందుకే దీనికి పరిష్కారంగా ముంబయికి చెందిన పల్లవి ఈ రెండూ ఇచ్చే ప్రయోజనాలు కలగలిసి సూపర్‌బాటమ్స్‌ పేరుతో పర్యావరణహిత డైపర్లను తయారు చేశారు.

‘చాలా సందర్భాల్లో సమస్య ఎదురైనప్పుడే పరిష్కారం కోసం ఆలోచిస్తాం....అలాంటప్పుడు ఒకడుగు ముందుకేసి మన పరిధి దాటి దానికోసం ప్రయత్నిస్తే అద్భుతాలెన్నో చేయొచ్చు. ఇదేదో ఊరికే చెబుతోన్న మాట కాదు...వ్యక్తిగతంగా నాకు ఎదురైన అనుభవం’ అని అంటారు ముంబయికి చెందిన పల్లవి ఉతోగి. ‘మా బాబు పుట్టే సమయానికి నాకు రెండు రకాల డైపర్స్‌ గురించి మాత్రమే తెలుసు. ఒకటి డిస్పోజబుల్‌ డైపర్లు...రెండోవి లంగోటీలు. మొదటి రకంలో రసాయనాల వినియోగం ఎక్కువ కాబట్టి వాటిని పిల్లాడికి వేస్తే దద్దుర్లు వచ్చేవి. పైగా రోజూ వాడిపాడేసిన డైపర్లతో చెత్త బుట్ట నిండిపోయేది. ఇక, రెండోది ప్రయత్నిస్తే...రోజంతా వాటిని తీయడం, ఉతకడంతో అలసిపోయేదాన్ని. దాంతో ఈ రెండు రకాలూ నాకు అంత సౌకర్యంగా, సురక్షితంగా  అనిపించలేదు. 

వెంటనే అమ్ముడయ్యాయి...

నాకెదురవుతోన్న సమస్యను నా స్నేహితురాళ్లతో పంచుకున్నా... వారూ ఇలాంటి ఇబ్బందే పడుతున్నారని తెలుసుకున్నా. ప్రత్యామ్నాయం కోసం నేనూ మా వారు చాలా ప్రయత్నించాం. కానీ మాకు నిరాశే ఎదురయ్యింది. ఒకటి, రెండు రకాలు దొరికినా...అవి అంతగా నచ్చలేదు. అయితే అభివృద్ధి చెందిన అమెరికాలాంటి దేశాల్లో రీయూజబుల్‌ క్లాత్‌డైపర్స్‌ వినియోగం ఎక్కువని తెలిసింది.  అక్కడి నుంచి కొన్ని తెప్పించుకుని బాబుకి వాడి చూశా. ఆ రకాలు చాలా బాగున్నప్పటికీ మన దేశంలోని చిన్నారులకు అంత సౌకర్యంగా అనిపించవు అని అర్థమైంది. దాంతో అదే ఫార్ములాతో నేను వాటిని చేయగలనా అని పరిశీలించా. ఇందుకోసం భారతీయ ప్రింట్లు, వస్త్రాలతో కొన్ని ప్రయోగాలు చేశా. వాటిని పిల్లలున్న స్నేహితులు, బంధువులకు ఇచ్చి వాడి చూడమన్నా...వాటిని వాళ్లు చాలా ఇష్టపడ్డారు. అమ్మడం మొదలుపెట్టేసరికి హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి. దాంతో సూపర్‌ బాటమ్స్‌ పేరుతో 2014లో సంస్థను ప్రారంభించాం’ అంటారామె.

ఇబ్బందులూ ఉన్నాయి...

‘వ్యాపారం అంటే చెప్పినంత సులువు కాదు...మార్కెటింగ్‌ ఇబ్బందులు చాలానే ఉంటాయి. ముఖ్యంగా అప్పటికి ఇలాంటి ఉత్పత్తులు మార్కెట్‌లో పెద్దగా లేవు. లంగోటీలకు క్లాత్‌ డైపర్లకు మధ్య తేడాని వివరిస్తూ వినియోగదారులను ఒప్పించడం అంత సులువైన విషయం ఏమీ కాదు. మరో పక్క మార్కెట్‌లో మన ఉత్పత్తులను పోలిన నాసిరకం రకాలు ఎన్నో వస్తుంటాయి...ఇలాంటి ఇబ్బందులు చాలానే వచ్చాయి. కానీ నాణ్యతలో రాజీపడకపోవడంతో మా బ్రాండ్‌ క్రమంగా ఆదరణ పొందింది. అటు లంగోటీలు, ఇటు డైపర్లకూ ఉండే ప్రత్యేకతలన్నీ మా సూపర్‌ బాటమ్స్‌కి ఉండటం వల్లే మేం నిలదొక్కుకోగలిగాం. వీటన్నింటినీ పర్యావరణహితంగా, జీరోవేస్ట్‌ పద్ధతిలో తయారుచేస్తున్నాం’ అంటారు పల్లవి. మొదట్లో సొంత డబ్బులే పెట్టుబడిగా పెట్టినప్పటికీ తర్వాత ఏంజెల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌నీ అందుకున్నారామె. ప్రస్తుతం అమెజాన్, ఫ్లిఫ్‌కార్ట్‌ లాంటి ఈ కామర్స్‌సైట్లతో పాటు ఆర్‌యూ లాంటి చోటా అందుబాటులో ఉన్నాయి. ఏటా లక్షకు పైగా డైపర్లను వీరు అమ్ముతున్నారు.


మరిన్ని