
ఫీచర్ పేజీలు
సమస్య-సలహా
సమస్య: నా వయసు 88 సంవత్సరాలు. మూడు నెలల నుంచి ఛాతీ, వీపు ఎముకలు నొప్పి పెడుతున్నాయి. ఆర్థోపెడిక్ డాక్టర్‌ను కలిస్తే ఎముకలు అరిగిపోయాయని చెప్పారు. మరో డాక్టర్ ఛాతీ ఎక్స్‌రే తీసి లోపల పొగ బారినట్టు ఉందన్నారు. కడుపు ఉబ్బరంగా, బరువుగా ఉంటుంది. తేన్పులు బాగా వస్తుంటాయి. కూర్చున్నా, నడుస్తున్నా ఆయాసం వస్తుంది. మొలల సమస్యా ఉంది. నివారణ మార్గం తెలపండి.
- ఉప్పులూరు వెంకట రామారావు, హైదరాబాద్
సలహా: మీకు బహుశా ఊపిరితిత్తులు సాగి పోవటం (ఎంఫెసీమా) వల్ల ఛాతీ ఎక్స్‌రేలో పొగ బారినట్టు కనిపిస్తుండొచ్చు. ఇక మీ సుస్తీ విషయమై- రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తెలుసుకోవటం ముఖ్యం. ఈఎస్ఆర్ ఎంత ఉందో కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు మొలల మూలంగా మలంలో రక్తం పోయే అవకాశాలు ఎక్కువ. హిమోగ్లోబిన్ తగ్గినా ఆయాసం, నీరసం వంటివి వస్తుంటాయి. హిమోగ్లోబిన్, ఈఎస్ఆర్ రక్త పరీక్ష చాలా తేలికైంది. మీరు ఎముకలు అరిగాయనీ రాశారు. ఒకసారి వెన్నెముక ఎక్స్‌రే తీయటం అవసరం. ఒకోసారి వెన్నుపూసలు కుంచించుకుపోతుంటాయి (వెడ్జ్ కంప్రెషన్). దీంతో పడుకోవటం, పక్కలకు తిరగటం, పక్క మీది నుంచి లేవటం బాధాకరంగా ఉంటాయి. మీరు కడుపులో మంట, బరువుగా ఉంటోందని రాశారు. ఆకలి ఎలా ఉందన్నది తెలియజేయలేదు. ఇది ముఖ్యం. ఎందుకంటే ఎక్కువకాలం ఆకలి లేకపోవటం, కడుపులో మంట ఉంటే ఒకసారి గ్యాస్ట్రోస్కోపీ పరీక్ష చేయాల్సి ఉంటుంది. గుండెదడ, ఆయాసం ఉన్నాయి కాబట్టి ఈసీజీ కూడా తీయాల్సి ఉంటుంది. ఇక మలబద్ధకం విషయంలోనైతే పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. పెద్ద వయసులో పేగుల కదలికలు కాస్త తగ్గుతాయి. దీంతో మల విసర్జన సాఫీగా అవ్వదు. దీనికి తోడు ఆహారం తీసుకోవటమూ తగ్గుతుంది. కొన్ని మందులతోనూ మలబద్ధకం రావొచ్చు. రాత్రి పడుకునే ముందు ఒక అరటిపండు తిని, గ్లాసు నీళ్లు తాగితే మల విసర్జన సాఫీగా అవ్వచ్చు. అలాగే ఉదయం లేవగానే గ్లాసు నీళ్లు తాగితే పేగులు తేలికగా కదిలే అవకాశముంది. ఇది మలబద్ధకం తగ్గటానికి తోడ్పడుతుంది. ప్రయత్నించి చూడండి.