
క్రీడలు
దిల్లీ: ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంలో ఎలాగైనా ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్‌ను దక్కించుకోవాలని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) పక్కా ప్రణాళిక రచించింది. అందుకోసం ప్రత్యేకంగా మాక్ (నమూనా) వేలం కూడా నిర్వహించడం విశేషం. తాజాగా దీనికి సంబంధించిన వీడియోను ఆ జట్టు ట్విట్టర్లో పోస్టు చేసింది. వేలం జరిగే తీరు, మ్యాక్స్‌వెల్ కోసం ఇతర జట్ల నుంచి పోటీ తదితర అంశాలపై ముందుగానే ఆ జట్టు క్రికెట్ డైరెక్టర్ మైక్ హెసన్ అధ్యయనం చేసినట్లు ఆ వీడియోలో కనిపించింది. అంతే కాకుండా అతని కోసం చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) నుంచి తీవ్రమైన పోటీ ఎదురవుతుందని హెసన్ అంచనా నిజమవడం విశేషం. మ్యాక్స్‌వెల్ కోసం సీఎస్కే చివరి వరకూ ప్రయత్నించగా.. ఆర్సీబీ రూ.14.25 కోట్ల భారీ ధరతో అతణ్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అతణ్ని జట్టులోకి ఎందుకు తీసుకోవాలనుకున్నారో హెసన్ వివరించాడు. ‘‘ఇన్నింగ్స్‌లో 10 నుంచి 15 ఓవర్ల మధ్యలో మ్యాక్స్‌వెల్ బ్యాటింగ్ ప్రమాదకరంగా ఉండడమే అతనిపై మేం ఆసక్తి ప్రదర్శించడానికి కారణం. 2014 నుంచి ఆ మధ్య ఓవర్లలో అతని సగటు 28 కాగా.. స్ట్రైక్‌రేట్ 161.5గా ఉంది. అది మా జట్టుకు కలిసొస్తుందనుకున్నాం. అతను బౌలింగూ చేయగలడు. మూణ్నాలుగు ఓవర్లు వేసే టాప్-6 బ్యాట్స్‌మన్ అవసరం మాకుంది. మ్యాక్స్‌వెల్ రెండు ఓవర్లే వేసినా.. అవి మాకెంతో ప్రయోజనం కలిగిస్తాయి’’ అని ఆ వీడియోలో హెసన్ పేర్కొన్నాడు.