
క్రీడలు
టీ20లో ఆసీస్‌పై కివీస్ గెలుపు
క్రైస్ట్‌చర్చ్: డెవాన్ కాన్వే. పాపం.. ఐపీఎల్ వేలంలో ఈ న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ అమ్ముడుపోలేదు. ఏ ఫ్రాంఛైజీ కూడా అతడి పట్ల ఆసక్తి చూపలేదు. కానీ కాన్వే సోమవారం ఫ్రాంఛైజీలను ఆలోచనలో పడేసే ఉంటాడు. ఎందుకంటే ఆస్ట్రేలియాతో తొలి టీ20లో అతడు విధ్వంసం సృష్టించాడు. కేవలం 59 బంతుల్లో 99 (10 ఫోర్లు, 3 సిక్స్‌లు) పరుగులతో అజేయంగా నిలిచాడు. దీనిపై భారత ఆఫ్‌స్పిన్నర్ అశ్విన్ స్పందిస్తూ.. ‘‘డెవాన్ కాన్వే నాలుగు రోజులు ఆలస్యమయ్యాడంతే. కానీ ఇది సూపర్ ఇన్నింగ్స్’’ అని ట్వీట్ చేశాడు. కాన్వే చెలరేగడంతో న్యూజిలాండ్ 53 పరుగుల తేడాతో గెలిచింది. కాన్వేతో పాటు ఫిలిప్స్ (30), నీషమ్ (26) మెరవడంతో మొదట కివీస్ 5 వికెట్లకు 184 పరుగులు చేసింది. ఛేదనలో ఆస్ట్రేలియా.. 17.3 ఓవర్లలో 131 పరుగులకే ఆలౌటైంది. 19 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఆ జట్టు ఏ దశలోనూ గెలిచేలా కనపడలేదు. ఇష్ సోధి (4/28), సౌథీ (2/10), బౌల్ట్ (2/22) ఆసీస్‌ను దెబ్బతీశారు. మిచెల్ మార్ష్ (45) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.