
ఆంధ్రప్రదేశ్
హోటల్ గదిలో విగతజీవుడై కనిపించిన దేల్కర్
దాద్రా, నగర్ హవేలీ నుంచి 7సార్లు ప్రాతినిధ్యం
ముంబయి: కేంద్ర పాలిత ప్రాంతం దాద్రా, నగర్ హవేలీ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న మోహన్ దేల్కర్ (58) సోమవారం ముంబయిలోని ఒక హోటల్లో విగతజీవుడై కనిపించారు. దీన్ని ఆత్మహత్యగా భావిస్తున్నారు. ఆత్మహత్యకు కారణాలను పేర్కొంటూ ఆయన రాసినట్లు భావిస్తున్న ఒక లేఖ కూడా హోటల్ గదిలో కనిపించిందని పోలీసులు చెప్పారు. గుజరాతీ భాషలో ఇది రాసి ఉందని తెలిపారు. మోహన్ మరణానికి కారణాలు.. పోస్ట్‌మార్టమ్ తర్వాతే తెలుస్తుందని చెప్పారు. ప్రాథమిక సమాచారం ఆధారంగా.. ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా ఈ ఘటనపై కేసు నమోదు చేశామని వివరించారు. మోహన్ ఏడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. సిబ్బంది వ్యవహారాలు, ప్రజా ఫిర్యాదులు, న్యాయ శాఖలపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘాల్లో ఆయన సభ్యుడిగా ఉన్నారు. కేంద్ర హోంశాఖపై ఏర్పాటైన సంప్రదింపుల కమిటీలోనూ ఆయన సభ్యుడిగా వ్యవహరించారు.
మోహన్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన పూర్తి పేరు మోహన్ సంజిభాయ్ దేల్కర్. గిరిజన హక్కుల కోసం ఉద్యమించారు. కార్మిక నేతగా ఆయన ప్రస్థానం మొదలైంది. 1989-2009 మధ్య వరుసగా ఆరుసార్లు ఎంపీగా గెలుపొందారు. 2009, 2014లో ఓడిపోయారు. 2019లో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. గతంలో ఆయన కాంగ్రెస్, భాజపాలో ఉన్నారు.