
తెలంగాణ
కరోనా క్రియాశీల కేసులు 1.50 లక్షలపైకి
24 గంటల్లో 14,199 మందికి కొవిడ్-19
వైరస్ బారిన మహారాష్ట్ర మంత్రి భుజబల్
దిల్లీ, ముంబయి: దేశంలో మళ్లీ కరోనా విజృంభణ ఛాయలు కనిపిస్తున్నాయి. మహారాష్ట్ర, కేరళ తదితర రాష్ట్రాల్లో రోజువారీ కేసులు పెరుగుతుండడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 14,199 మందికి కొవిడ్-19 సోకింది. వీటిలో ఒక్క మహారాష్ట్ర కేసులే 6,971 ఉండగా, కేరళవి 4,070 ఉన్నాయి. మహారాష్ట్ర మంత్రి చగన్ భుజబల్ కరోనా బారిన పడ్డారు. కేసుల పెరుగుదల నేపథ్యంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దిల్లీలో.. కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ తదితరులతో సమీక్షించారు. మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కేసులు ఉన్నట్టుండి పెరగడంపై చర్చించారు. కరోనా మార్గదర్శకాలను పౌరులు నిర్లక్ష్యం చేస్తే లాక్డౌన్ విధించడం తప్ప ప్రభుత్వానికి మరో ఐచ్ఛికం లేదని ముంబయి ఇన్‌ఛార్జి మంత్రి అస్లాం షేక్ ప్రజలకు స్పష్టంచేశారు.
క్రియాశీల కేసుల్లో వరుసగా ఐదోరోజూ పెరుగుదల
దేశంలో కరోనా క్రియాశీల కేసుల్లో వరుసగా అయిదో రోజూ పెరుగుదల నమోదైంది. దీంతో వీటి సంఖ్య మళ్లీ 1.50 లక్షల మార్క్ దాటింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 83 కరోనా మరణాలు సంభవించినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ సోమవారం ప్రకటించింది. వీటిలో ఒక్క మహారాష్ట్రలోనే 35 ఉండగా, కేరళలో 15 మంది చనిపోయారు. మొత్తం కేసుల సంఖ్య 1,10,05,850కి చేరగా, మొత్తం మరణాల సంఖ్య 1,56,385కు చేరింది. కొవిడ్-19 నుంచి ఇప్పటివరకు 1,06,99,410 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 97.22 శాతానికి చేరగా, మరణాల రేటు 1.42 శాతంగా నమోదైంది. క్రియాశీల కేసులు 1,50,055కు చేరగా, మొత్తం కేసుల్లో వీటి వాటా 1.36 శాతంగా ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) వివరాల ప్రకారం దేశంలో ఇప్పటివరకు 21,15,51,746 కరోనా పరీక్షలు నిర్వహించారు. ఒక్క ఆదివారం నాడే 6,20,216 నమూనాలను పరీక్షించారు.
ఈ నెల్లో ఏడుగురు మంత్రులకు కరోనా
మహారాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి చగన్ భుజబల్ కొవిడ్-19 బారినపడ్డారు. స్వయంగా ఆయనే సోమవారం ఈ విషయాన్ని వెల్లడించారు. దీంతో ఉద్ధవ్ సర్కారులోని మంత్రుల్లో ఈ నెలలో కరోనా బారిన పడిన ఏడో బాధితుడు చగన్. తనకు కరోనా సోకిందని, గత రెండు మూడు రోజుల్లో తనను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ మంత్రి ఓ ట్వీట్ చేశారు. మహారాష్ట్ర మంత్రులైన అనిల్ దేశ్‌ముఖ్, రాజేంద్ర సింగణె, జయంత్ పాటిల్, సతేజ్ పాటిల్, బచ్చు కాడు, రాజేశ్ టోపేలు ఈ నెలలో ఇప్పటికే కరోనా బారినపడిన సంగతి తెలిసిందే.
* ముంబయిలో కరోనా కేసుల్లో ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి చూస్తే ఇప్పటివరకు 36.38 శాతం పెరుగుదల చోటుచేసుకున్నట్లు బృహన్ ముంబయి నగరపాలక సంస్థ గణాంకాలను బట్టి తెలుస్తోంది. ఈ నెల 8న ముంబయిలో కరోనా కేసుల సంఖ్య 5,335గా ఉండగా, ఆదివారం నాటికి 7,276కు చేరింది.
కార్యక్రమాలను రద్దుచేసుకున్న శరద్‌పవార్
మహారాష్ట్రలో మళ్లీ కరోనా భయాలు పెరుగుతున్న వేళ ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన బహిరంగ కార్యక్రమాలు అన్నింటినీ రద్దు చేసుకుంటున్నట్లు సోమవారం ప్రకటించారు.
* రాష్ట్రంలో అన్ని మతపరమైన, సామాజిక, రాజకీయ సమావేశాలను సోమవారం నుంచి నిషేధిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు. ఎన్సీపీ పార్లమెంటు సభ్యురాలు సుప్రియా సూలే, మహారాష్ట్ర ఉన్నత, సాంకేతిక విద్యా శాఖల మంత్రి ఉదయ్ సామంత్‌లు సైతం తమ కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు.