
క్రైమ్
మాజీ ఎంపీపీ భర్తపై సర్పంచ్ బంధువుల రాళ్లదాడి
ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి
పెద్దేముల్, న్యూస్‌టుడే: దాయాదుల మధ్య కొంతకాలంగా జరుగుతున్న గొడవలు చినికిచినికి గాలివానగా మారి మాజీ ఎంపీపీ భర్త హత్యకు దారితీశాయి. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలో హన్మాపూరు గ్రామంలో సోమవారం ఈ దారుణం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం..హన్మాపూరు పంచాయతీ సర్పంచ్ సుమలత బావ పసుల వెంకటేశం, మాజీ ఎంపీపీ వాణిశ్రీ భర్త వీరప్ప(40) దాయాదులు. ఇరు కుటుంబాల మధ్య రెండు నెలలుగా గొడవలు జరుగుతూ వస్తున్నాయి. హన్మాపూరు గ్రామంలో అభివృద్ధి పనులు చేస్తున్న వెంకటేశం, అందుకు అవసరమైన ఇసుక కోసం ఆదివారం సమీపంలోని వాగు వద్దకు వెళ్లారు. వీరప్ప కుటుంబ సభ్యులు ఇసుక తీసుకొచ్చేందుకు అదే సమయంలో వాగు వద్దకు ట్రాక్టర్లతో వెళ్లారు. ఈ క్రమంలో ఇరువర్గాలు మరోసారి గొడవపడ్డాయి. ఒకరిపై ఒకరు దాడి చేసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. గ్రామ పెద్దలు ఇరువర్గాలకు రాజీ కుదిర్చే క్రమంలో సోమవారం ఉదయం హన్మాపూర్లోని ఊరడమ్మ ఆలయం వద్ద పంచాయితీ పెట్టారు. పంచాయితీ జరుగుతుండగానే ఇరువర్గాలు మరోసారి ఘర్షణ పడ్డాయి. వీరప్పను లక్ష్యంగా చేసుకుని వెంకటేశం సహా ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు అఖిల్, ప్రవీణ్, శ్రీనివాస్, పార్వతప్ప, భారతమ్మ రాళ్లు, కర్రలతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఆయన్ను చికిత్స కోసం తాండూరు జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా మాధ్యమధ్యలో వీరప్ప చనిపోయారు. ఘటనకు సంబంధించి 11 మందిపై కేసు నమోదు చేసినట్టు సీఐ జలంధర్‌రెడ్డి తెలిపారు.