
క్రైమ్
మర్మాంగాలకు తగలడంతో మృత్యువాత
లొత్తునూర్(గొల్లపల్లి), న్యూస్‌టుడే: కోడి కత్తి ప్రమాదవశాత్తూ మర్మాంగాలకు తగలడంతో వ్యక్తి మరణించిన ఘటన జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో సోమవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం...లొత్తునూర్ శివారులో కోడి పందెం నిర్వహించడానికి స్థానికులు సిద్ధమయ్యారు. వెల్గటూరు మండలం కొండాపూర్‌కు చెందిన తనుగుల సతీష్ (45) కోడి ఒక కాలికి కత్తికట్టాడు. రెండో కాలికి కట్టే ప్రయత్నంలో ఉండగానే అది తప్పించుకునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో కత్తి పురుషాంగానికి, వృషణాలకు తగలడంతో అక్కడే కుప్పకూలాడు. జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.