
జాతీయ- అంతర్జాతీయ
ఈనాడు, దిల్లీ: సస్పెండైన మున్సిఫ్ మెజిస్ట్రేట్ రామకృష్ణతో జరిపిన సంభాషణ విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలంటూ జస్టిస్ ఈశ్వరయ్య దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వు చేసింది. వారి సంభాషణలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై కుట్రకు పథకం వేసినట్లు స్పష్టమవుతున్నందున, దానిలో వాస్తవాలు తేల్చేందుకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఆర్.వి.రవీంద్రన్తో విచారణ కమిటీ వేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గతంలో తీర్పునిచ్చింది. హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వాలంటూ జస్టిస్ ఈశ్వరయ్య సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. గత నెల 11న జరిగిన విచారణలో సంభాషణపై అఫిడవిట్ దాఖలు చేయాలని జస్టిస్ ఈశ్వరయ్యను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆయన అఫిడవిట్ దాఖలు చేయడంతో జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సుభాష్రెడ్డిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం కేసు విచారణను చేపట్టింది. పిటిషనర్ జస్టిస్ ఈశ్వరయ్య తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. తన పిటిషనర్ వాదనలు వినకుండానే, ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే హైకోర్టు విచారణకు ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు.