
గ్రేటర్ హైదరాబాద్
ఐటీ దాడుల్లో వెల్లడి
దిల్లీ: రెండు వ్యాపార సంస్థలకు చెందిన రూ.వందల కోట్ల విలువైన అక్రమ లావాదేవీలను ఆదాయ పన్ను శాఖ వెలికితీసింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సోమవారం ప్రకటించింది. మధ్యప్రదేశ్‌కు చెందిన సోయా ఉత్పత్తుల తయారీ సంస్థకు సంబంధించి రూ.450 కోట్ల మేర అక్రమ ఆదాయం బయటపడినట్లు తెలిపింది. ఈ నెల 18న మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లో 22 చోట్ల చేసిన దాడుల్లో వాటికి సంబంధించిన ఆధారాలు లభ్యమైనట్లు పేర్కొంది. రూ.8 కోట్ల లెక్క చూపని నగదు, రూ.44 లక్షల విలువైన విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. 9 బ్యాంకు లాకర్లను కూడా కనుగొన్నట్లు వివరించింది. ఆ సంస్థ షేర్ మార్కెట్ వ్యాపారం పేరుతో నకిలీ కంపెనీలతో లావాదేవీలు జరిపినట్లు చూపించి ఈ అక్రమాలకు పాల్పడినట్లు తెలిపింది. మరోవైపు పుణె కేంద్రంగా పొగాకు ఉత్పత్తుల ప్యాకేజింగ్, అమ్మకం, విద్యుత్తు ఉత్పత్తి, పంపిణీ, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్న ఓ సంస్థకు చెందిన రూ.335 కోట్ల అక్రమ ఆస్తులను ఆదాయ పన్ను శాఖ కనుగొంది. ఈనెల 17న మహారాష్ట్ర వ్యాప్తంగా 34 చోట్ల చేసిన ఈ దాడుల్లో రూ.కోటి మేర లెక్కచూపని నగదు లభ్యమైనట్లు పేర్కొంది. పొగాకు ఉత్పత్తులకు సంబంధించి ఆ సంస్థ కంప్యూటర్లలో లభ్యమైన వివరాల మేరకు రూ.243 కోట్ల వరకూ నగదు లావాదేవీలు జరిగినట్లు పేర్కొంది. పొగాకు ఉత్పత్తుల డీలర్లపై జరిపిన దర్యాప్తులో మరో రూ.40 కోట్ల లావాదేవీలు వెలుగులోకి వచ్చాయని తెలిపింది. రియల్ ఎస్టేట్ కార్యకలాపాల్లో రిజిస్ట్రేషన్ విలువకు సంబంధించి చేసిన అక్రమాల్లో రూ.18 కోట్లు పొందినట్లు ఆధారాలు లభించాయని వెల్లడించింది.