
జాతీయ- అంతర్జాతీయ
ఈనాడు డిజిటల్, బెంగళూరు: కరోనాతో కర్ణాటకలో మరోమారు లాక్డౌన్ విధించే సూచనలు కనిపిస్తున్నాయి. సరిహద్దుల్లోని కేరళ, మహారాష్ట్రల్లో వైరస్ మళ్లీ విజృంభిస్తుండటం, ఆ రాష్ట్రాల్లో అక్కడక్కడా లాక్డౌన్ అమలు చేస్తుండటంతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తం అవుతోంది. కర్ణాటకలో ప్రస్తుతం రోజుకు 400కుపైగా కేసులు నమోదవుతున్నాయి. వీటిలో సగం బెంగళూరు నుంచే వస్తున్నాయి. రాష్ట్రంలోని నర్సింగ్ కళాశాలల్లో చదువుతున్న కేరళ విద్యార్థులు వారాంతాల్లో సొంత ఊళ్లకు వెళ్లి వస్తుండటంతో వారి నుంచి వైరస్ వ్యాపిస్తోందని అధికారుల అంచనా. గతవారం బెంగళూరు, మంగళూరుల్లోని నర్సింగ్ కళాశాలల్లో 80 మంది కేరళ విద్యార్థులకు కరోనా సోకినట్లు గుర్తించారు. ఆ కళాశాలలను కంటెయిన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. వయనాడ్, కాసరగోడులతో పాటు 13 సరిహద్దు ప్రాంతాలను మూసివేశారు. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలవద్ద తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు.