
గ్రేటర్ హైదరాబాద్
తండా ఉపాధ్యాయురాలి సృజనకు గుర్తింపు
చిన్నారులకు బోధనలో సౌలభ్యం, వైవిధ్యం
ఈనాడు డిజిటల్, మహబూబ్నగర్: జాతీయ బొమ్మల ప్రదర్శనకు మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోచమ్మగడ్డ తండా ప్రాథమిక పాఠశాలలో తయారైన 5 బొమ్మలు ఎంపికయ్యాయి. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 2 వరకు దృశ్యమాధ్యమంలో జరుగుతాయివి. తండా పాఠశాల ఉపాధ్యాయురాలు కళావతి రూపుదిద్దిన 5 బొమ్మలను అందులో ప్రదర్శించనున్నారు. తెలంగాణ నుంచి 11 పాఠశాలలు వివిధ కేటగిరీల కింద పంపిన మొత్తం 21 బొమ్మలు ప్రదర్శనకు ఎంపికయ్యాయి. అందులో ఒక్క పోచమ్మగడ్డ తండా బడి నుంచే 5 కేటగిరీల్లో బొమ్మలు ఎంపిక కావడం విశేషం. తెలంగాణ నుంచి ఈ ప్రదర్శనలో పాల్గొంటున్న ఏకైక ప్రాథమిక పాఠశాల సైతం ఇదే. ప్రాథమిక తరగతుల పిల్లలకు సులువుగా పాఠాలు అర్థమయ్యేలా కళావతి ఎనిమిదేళ్లుగా ఈ బొమ్మల ద్వారా విద్యాబోధన చేస్తున్నారు.
గతానికి భిన్నంగా..
గతంలో జాతీయ బొమ్మల ప్రదర్శనల్లో బొమ్మల తయారీ పరిశ్రమలకు మాత్రమే అవకాశం కల్పించేవారు. కానీ, ఈసారి చిన్నారులు ఆటలాడుతూ చదువుసంధ్యలు నేర్చుకోవడాన్ని ప్రోత్సహించడంతో పాటు బోధనలోనూ పాలుపంచుకునేలా చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా బొమ్మల ద్వారా విద్యాబోధన చేస్తున్న గురువులు, పాఠశాలలూ ఈ ప్రదర్శనలో పాల్గొనాల్సిందిగా కోరింది. ఏటా దిల్లీలో జరిగే జాతీయ బొమ్మల ప్రదర్శనను ఈ ఏడాది కొవిడ్ నిబంధనల కారణంగా వర్చువల్ విధానంలో నిర్వహిస్తున్నారు. జాతీయ ప్రదర్శనకు తన బొమ్మలు ఎంపికైనందుకు ఆనందంగా ఉందని ఉపాధ్యాయురాలు కళావతి చెప్పారు. ఆ స్ఫూర్తితో మరిన్ని కొత్త బొమ్మల్ని సృజించి బోధనను మరింత సులభతరం చేసేందుకు ప్రయత్నిస్తానన్నారు.