
గ్రేటర్ హైదరాబాద్
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో తెరాస సభ్యత్వ నమోదు లక్ష్యాన్ని మించి విజయవంతంగా సాగుతోందని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులతో పాటు ప్రజలు సభ్యత్వం తీసుకుంటున్నారని చెప్పారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్దేశించిన గడువు ఈ నెలాఖరు వరకే ఉందని, అప్పటిలోగా నమోదు ప్రక్రియ పూర్తి కావాలన్నారు. తెరాస సభ్యత్వ నమోదుపై సోమవారం తెలంగాణ భవన్ నుంచి ఆయన సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లాల వారీగా సభ్యత్వాల తీరును పరిశీలించారు. అనంతరం నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ‘‘అన్ని వర్గాల వారిని పార్టీలో చేర్చాలి. సభ్యత్వాల నమోదుతో పాటు డిజిటలీకరణను సమాంతరంగా కొనసాగించాలి. ఎమ్మెల్యేలు లేనిచోట స్థానిక నేతలు ప్రత్యేక శ్రద్ధ చూపాలి. పార్టీ శ్రేణులన్నీ సమన్వయంతో పనిచేయాలి. సభ్యత్వ నమోదులో కష్టపడిన వారికి గుర్తింపు ఉంటుంది’’ అని కేటీఆర్ అన్నారు.