
గ్రేటర్ హైదరాబాద్
గాంధీభవన్, న్యూస్‌టుడే: ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిన తెరాసకు, రాష్ట్ర విభజన హామీలు విస్మరించిన భాజపాకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిన విధంగా బుద్ధి చెప్పాలని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి పట్టభద్ర ఓటర్లకు పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తేనే ఆ హామీలు అమలుకు నోచుకుంటాయన్నారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం సోమవారం గాంధీభవన్‌లో జరిగింది. రేవంత్‌రెడ్డితోపాటు అభ్యర్థి చిన్నారెడ్డి, ఏఐసీసీ ఇన్‌ఛార్జి కార్యదర్శి బోసురాజు, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు కుసుమకుమార్, పొన్నం ప్రభాకర్ తదితరులు హాజరయ్యారు. ఎన్నికల ప్రచారం, ఇతర అంశాలపై చర్చించారు. అనంతరం రేవంత్‌రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ.. తెరాస, భాజపాలు అన్ని వర్గాలను మోసం చేశాయన్నారు. ఈ నెల 24 నుంచి మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తామన్నారు. పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశ వివరాల్ని ఈ సందర్భంగా ప్రకటించారు.
‘భాజపాకు లాభం చేయడమే కేసీఆర్ లక్ష్యం’
కాంగ్రెస్ ఓట్లను చీల్చేందుకు భాజపాతో ఒప్పందంలో భాగంగానే కేసీఆర్ పీవీ కుమార్తెను పోటీకి దించారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. నిజంగా పీవీ కుటుంబంపై ప్రేమ ఉంటే ఆమెను రాజ్యసభకో లేదా గవర్నర్ కోటా ఎమ్మెల్సీగానో ఎంపిక చేసేవారని చెప్పారు. సోమవారం జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి తరఫున నామినేషన్ దాఖలు కార్యక్రమానికి హాజరైన రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.