
గ్రేటర్ హైదరాబాద్
మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించిన కిష్టరాయనిపల్లి బాధితులు
నారాయణగూడ, న్యూస్టుడే: మల్లన్నసాగర్ తరహా పరిహారం ఇస్తామని చెప్పి మోసం చేశారని డిండి ఎత్తిపోతల పథకంలోని కిష్టరాయనిపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ భూ నిర్వాసితులు మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. సోమవారం కమిషన్ కార్యాలయానికి వచ్చిన నల్గొండ జిల్లా నాంపల్లి మండలం లక్ష్మణాపురం గ్రామ ప్రజలు పరిహారం ఇచ్చే వరకు పొలాల్లో మట్టి తీయకుండా పనులు నిలిపివేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. విలేకరులతోనూ మాట్లాడారు. 2015 జూన్ 12న ఈ ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారని, బాధితులకు పూర్తి పరిహారం చెల్లించిన తర్వాతనే రిజర్వాయర్ పనులు చేపడతామని భరోసా ఇచ్చారని తెలిపారు. తమ నుంచి సేకరించిన విలువైన సాగు భూమికి ఎకరానికి రూ.4.15 లక్షలు ఇస్తామని చెప్పి అది కూడా విడతల వారీగా ఇస్తున్నారని వివరించారు. దీంతో వేరేచోట భూములు కొనుక్కోలేకపోయామని పేర్కొన్నారు. పొలాలు పోతున్నాయనే ఆవేదనతో భూముల వద్దకు వెళ్లిన తమపై పోలీసులు దాడులు చేస్తున్నారని మహిళా రైతులు తెలిపారు. ప్రాజెక్టు పరిసరాల నుంచి పోలీసు బలగాలను వెనక్కు పంపించాలని, పరిహారం అందేవరకు పనులు నిలిపి న్యాయం చేయాలని కోరారు.