
సినిమా
ఇంటర్నెట్‌డెస్క్: యువ దర్శకులను, నటులను, సాంకేతిక నిపుణులను ప్రోత్సహించే అగ్ర కథానాయకుల్లో చిరంజీవి ఒకరు. అడిగిన వెంటనే ప్రీరిలీజ్ ఈవెంట్లకు వెళ్లడం, ట్రైలర్లు, టీజర్లు రిలీజ్ చేస్తుంటారు. చిరు సామాజిక మాధ్యమాల్లోకి అడుగు పెట్టిన తర్వాత చిత్ర పరిశ్రమకు సంబంధించిన చిన్న చిన్న అంశాలపై కూడా తన అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఉప్పెన’. కృతిశెట్టి కథానాయిక. విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌ను తెచ్చుకుంది.
ఈ సందర్భంగా చిత్ర బృందానికి అభినందనలు తెలియజేస్తూ, సందేశంతో కూడిన లేఖతో పాటు, ఓ గిఫ్ట్‌ను కూడా పంపారు. సముద్రం ఒడ్డున మోకాళ్లపై నిలబడిన యువ జంట ఒకరినొకరు హత్తుకుని కళ్లలో కళ్లు పెట్టి చూసుకుంటున్న బొమ్మను పంపారు. ‘ది థ్రిల్ ఆఫ్ లవ్ కపుల్ ఫిగరైన్’ పేరుతో విక్రయిస్తున్న దీని ధర ఎంతో తెలుసా? అక్షరాల రూ.83వేలు. స్పెయిన్‌కు చెందిన ప్రముఖ లగ్జరీ ఉత్పత్తుల సంస్థ ‘లాడ్రో’ దీన్ని విక్రయిస్తోంది.
చిరంజీవిలాంటి అగ్ర కథానాయకుడు తమకు అభినందనలతో పాటు, గిఫ్ట్‌లు కూడా పంపడంపై చిత్ర బృందం ఆనందంతో ఉబ్బితబ్బిబవుతోంది. ఈ సినిమా నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన దర్శకుడు సుకుమార్ చిరు పంపిన గిఫ్ట్‌ను సోషల్ మీడియాలో పంచుకుంటూ .. ‘కొణిదెల చిరంజీవి, మద్రాసు, ఇండియా ఈ అడ్రస్‌కు చిన్నప్పుడు అమాయకంగా రాసిన లేఖలకు ఇప్పుడు ప్రతిలేఖ వచ్చినంత అనుభూతి కలిగింది’ అని పేర్కొన్నారు.