close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
అమ్మాయి జాగ్రత్త!

కౌమారం ఎగసిపడే జలపాతంలాంటిది... అందంగా కనిపించే ఆ ప్రవాహంలో సుడులెన్నో ఉంటాయి. అప్రమత్తంగా లేకపోతే పాతాళానికి జారిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఆడపిల్లలు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. మరి తల్లిదండ్రులేం చేయాలి? అందుకోసమే ఈ చెక్‌లిస్ట్‌ అని చెబుతున్నారు మానసిక వైద్యురాలు గౌరీదేవి.
కొత్త డ్రెస్‌ ఎక్కడిదంటే స్నేహితురాలు కానుకిచ్చిందంటోంది... ఆలస్యంగా ఎందుకొచ్చావంటే అదనపు తరగతులని అబద్ధమాడేస్తోంది ఎలా?
ఆపత్కాలంలో ఓ అబద్ధం చెప్పడం తప్పుకాకపోవచ్చు...కానీ చిన్న చిన్న విషయాల్లోనూ ఇదే తీరు కనిపిస్తుంటే తేలిగ్గా తీసుకోవద్దు. చేసిన తప్పు తప్పించుకోవడానికే ఇలా చేస్తూ ఉండొచ్చు. లేదా తాను భ్రమల్లో బతుకుతూ...ప్రతిదానికీ ఇతరుల్ని నిందిస్తూ కొత్త కథలు అల్లేస్తూ ఉండొచ్చు. దొంగతనం చేయడం, ప్రేమ వ్యవహారాలు కప్పి పుచ్చడం వంటి కారణాలేవైనా కావొచ్చు.  వెంటనే ఆమె పొరపాటుని సరిదిద్దడానికి ప్రయత్నించండి. మీవల్ల కాకపోతే సైౖకియాట్రిస్ట్‌ సాయం తీసుకోవడానికీ మొహమాట పడొద్దు.
ఆమె ఫోన్‌ లాక్‌ ఓ పద్మవ్యూహంలా ఉంటుంది. స్నేహితులతోనూ రహస్యంగా మాట్లాడుతోంది....అసలేం చేస్తోంది?
కొందరు అమ్మాయిలు... చూడ్డానికి సాధారణంగానే కనిపిస్తారు. కానీ తమ ప్రతి కదలికా రహస్యంగా ఉంచాలనుకుంటారు. ఎక్కువ సమయం సెల్‌ఫోనుల్లో గడిపేస్తుంటారు. స్నేహితులతోనూ రహస్య మంతనాలు చేస్తారు. మీరు ఇదంతా ఇది సాధారణమే అనుకుని వదిలేయొద్దు. ఇవి పోర్న్‌ వీడియోలు చూడటం, ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడటం వంటి వాటికీ సూచనలూ కావొచ్చు. కాస్త గమనిస్తే తెలుసుకోవచ్చు. అదే అయితే వాటి నుంచి బయటపడేయడానికి కౌన్సెలింగ్‌, చికిత్స అవసరం.
వేల రూపాయల దుస్తులు అవసరం అంటోంది. అబ్బాయిలతో కలిసి మెలిసి తిరగడమే ఆధునికత అని వాదిస్తోంది.
టీనేజ్‌....పిల్లల్లో సొంత వ్యక్తిత్వం అభివృద్ధి చెందే దశ. ఇప్పుడే లైంగిక హార్మోన్ల ప్రభావమూ ఎక్కువగా ఉంటుంది. వాటి ఫలితంగానే తామన్నీ చేయగలమనీ, తమకన్నీ తెలుసనీ భావిస్తుంటారు. మితిమీరిన స్వేచ్ఛను కోరుకుంటారు. నిర్ణయాధికారం తమదేనని వాదిస్తుంటారు. ఇలాంటప్పుడు వారితో గొడవపడటం మంచిది కాదు. వారి అభిప్రాయాల్ని గౌరవిస్తూనే...తప్పొప్పులను చెప్పడానికి ప్రయత్నించండి. అబ్బాయిలతో స్నేహం మంచిదే కానీ...హద్దుల్లో ఉండాల్సిన అవసరం నొక్కి చెప్పండి. ఇలాంటి వారి విషయంలో ముందు సమస్య తీవ్రతను గుర్తించడమే అసలైన సవాల్‌.
మమ్మల్ని అమ్మానాన్నలుగా చెప్పుకోవడానికి ఇష్టపడటం లేదు...వద్దన్న పనే పంతం పట్టి చేస్తోంది!
కొందరు పిల్లలు స్నేహితుల తల్లిదండ్రులతో పోల్చుకుని వారిలా మీరూ ఉండాలని కోరుకుంటారు. వారి ఊహలకు తగ్గట్లు లేరని భావించి ఇలా ప్రవర్తిస్తుంటారు. వద్దన్న పనే చేస్తానంటున్నారంటే కొంత మీరూ కారణం కావొచ్చు. పిల్లల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా మీకు నచ్చిన కోర్సులో చేర్పించడమో, అభిరుచిలో శిక్షణ ఇప్పించడమో దీనికి మూలం అయ్యి ఉండొచ్చు. లేదా మీరు అంచనాలు పెంచేసి వారిపై ఒత్తిడి చేస్తున్నారేమో కూడా గమనించాలి.
పదహారేళ్లకే ప్రేమ అంటోంది. స్నేహితులు లేకపోతే తాను లేనంటోంది... గారాబమే హద్దుదాటేలా చేసిందా?
ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం లేనప్పుడు ఇక్కడ కోల్పోయిన ప్రేమ, స్వేచ్ఛల్ని ఇతరుల్లో వెతుక్కుంటారు చాలామంది పిల్లలు. వారి స్నేహితులు, వాళ్ల కుటుంబాలతోనూ మీరు అనుబంధం పెంచుకోండి. అప్పుడే  పిల్లల ప్రవర్తనలోని మార్పుల్ని సులువుగా గమనించొచ్చు. అలానే మరీ కఠినంగా ఉండటం, అతిగా గారాబం చేయడం రెండూ మంచివి కావు.


మరిన్ని