close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ఆ యువరాణి... ఆమె రక్షణలో!  

అది 1920...  ఈజిప్టు నుంచి తెచ్చిన ఓ యువరాణిని నిజాం ప్రభువుకు కానుకగా ఇచ్చాడు అతని అల్లుడు.. అపురూపమైన ఆ బహుమతిని ఆయన ఎంతో భద్రంగా దాచిపెట్టారు.  వందేళ్ల తరువాత కూడా ఆమెను ఇంకా అబ్బురంగానే చూస్తున్నారు.  యువరాణీ ఏంటి... దాచిపెట్టడం ఏంటి  అనేగా మీ అనుమానం. అవును... ఆమె 2500 సంవత్సరాల నాటి మమ్మీ. దక్షిణభారతదేశంలో ఉన్న ఈ ఏకైక మమ్మీ సంరక్షణకుచీఫ్‌ ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు బి. గంగాదేవి...
యువరాణి నిషూహూ... 2500 సంవత్సరాల కిందటి టోలెమీ రాజవంశానికి చెందిన అమ్మాయి. సుమారుగా 20 ఏళ్ల వయసులో ఆమె మరణించిన తర్వాత ఆ భౌతికకాయాన్ని మమ్మీగా మార్చి భద్రపరిచారు ఆనాటి రాజవంశీయులు. చాలాకాలంపాటు ఇది ఈజిప్టులోనే ఉంది. 1920లో నిజాం కుటుంబానికి చెందిన నజీర్‌ నవాజ్‌ జంగ్‌ దాన్ని వెయ్యి పౌండ్లకు కొని తన మావయ్య ఆఖరి నిజాం ప్రభువుకు కానుకగా ఇచ్చేందుకు హైదరాబాద్‌ తీసుకొచ్చారు. 1930 నుంచి తెలంగాణా ఆర్కియాలజీ మ్యూజియంలో ఓ గాజుపెట్టెలో భద్రంగా ఉంది. దక్షిణభారతదేశంలో ఉన్న ఏకైక మమ్మీ కూడా ఇదే కావడం విశేషం.
మమ్మీల సంరక్షణ అంత తేలికైన విషయమేమీ కాదు. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా అవి క్షీణించిపోతుంటాయి. అదే జరిగితే మనం తర్వాతి తరాలకు అపురూపమైన ఈ సంపదని అందించలేం. కానీ ఈ పనిని ఎంతో సమర్థంగా చేస్తున్నారు గంగాదేవి. 2012లో తెలంగాణ ఆర్కియాలజీ మ్యూజియంలో టెక్నికల్‌ అసిస్టెంట్‌గా చేరిన ఈమె అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పదోన్నతి పొందారు. అప్పటి నుంచి మమ్మీ బాధ్యతను పూర్తిగా తీసుకున్నారు. ‘మొదట్లో ఇది ఓ చెక్క బాక్సులో ఉండేది. క్రమంగా వాతావరణంలోని తేమ ఈ మమ్మీకి శత్రువుగా మారింది. దాంతో దానికి చుట్టి ఉంచిన 60 మీటర్ల వస్త్రం అక్కడక్కడా చిరగడం మొదలయ్యింది. కాలివేలు ఒకటి బయటికి వచ్చింది. దాంతో ఈ సంపదను కాపాడుకోవడానికి ఏం చేయొచ్చా అని ఆలోచించాను.
నిపుణుల కోసం దేశమంతా గాలించాను. చివరకు ఛత్రపతి శివాజీ మ్యూజియంలో పనిచేస్తున్న ఓ నిపుణుడు దొరికాడు. అతని సాయంతో మమ్మీకి సీటీ స్కాన్‌, ఎమ్మారై స్కాన్‌ చేయించా. పక్కటెముకలు, వెన్నెముక స్వల్పంగా దెబ్బతిన్నట్లు గుర్తించా. మిగతా భాగమంతా చెక్కుచెదరకపోవడం కొంత వరకు అదృష్టమే అనుకున్నా. తిరిగి దీన్ని పాత పద్ధతిలోనే దాచిపెడితే ప్రయోజనం లేదనిపించింది. ఆక్సీకరణ చర్య జరగకుండా అడ్డుకునేందుకు జర్మనీ నుంచి ప్రత్యేకంగా గాజుపెట్టెను తెప్పించా. ఆక్సిజన్‌ ఫ్రీ షోకేస్‌గా పిలిచే ఈ పెట్టెలో పూర్తిగా నైట్రోజన్‌ వాయువు మాత్రమే  ఉండేలా మిషన్‌ను ఏర్పాటు చేశా. మరో 25 ఏళ్లకు పైగా ఈ మమ్మీ చెక్కు  చెదరదు’ అంటున్నారు గంగాదేవి.
మాది కడప జిల్లాలోని ఎర్రగుంట్ల. వ్యవసాయ కుటుంబంలో పుట్టాను. చదువుపై నాకున్న ఆసక్తిని గమనించిన నాన్న ఎంతకష్టమైనా చదివించాలనుకున్నాడు. ఎంఏ చేసిన వెంటనే ఈ ఉద్యోగం వచ్చింది. ఇక్కడి 12 గ్యాలరీల సంరక్షణ బాధ్యత చూస్తున్నా. నిజాంకాలంలో 18 నుంచి 19వ శతాబ్దానికి చెందిన బంగారం, వెండి, రాగితో చేసిన పురాతన ఆభరణాలు, వస్తు సంపద ఇక్కడ ఉంటుంది. ఆ కాలానికి చెందిన ఆయుధాలు, పురాతన చిత్రలేఖనాలు, కాంస్య విగ్రహాలు నా సంరక్షణలోనే ఉంటాయి.


మరిన్ని