close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
నూనెలు తెచ్చే నిగారింపు!

ఒంటికి నూనె రాసుకుని నలుగు పెట్టుకుని స్నానం చేస్తే... కలిగే హాయి అంతా ఇంతా కాదు. ఒకప్పుడు చర్మ సంరక్షణ అంటే అదే. అసలు శరీరానికి నూనె రాసుకుంటే ఎంత మేలో ఇది చదివితే తెలుస్తుంది.
* బాదం నూనెలో మాంసకృత్తులు,  ఖనిజాలు పుష్కలం. ఈ నూనెలో ఎక్కువగా ఉండే విటమిన్‌ ఈ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. పొడి చర్మతత్వం ఉన్నవారు బాదం నూనెను రోజూ రాసుకుంటే... చర్మానికి తేమ అంది తాజాగా కనిపిస్తుంది. మిగిలిన చర్మతత్వాల వారు రెండు మూడు రోజులకు ఓ సారైనా రాసుకుని మర్దన చేయాలి. రక్తప్రసరణ సక్రమంగా జరిగి...ఆ నూనెలోని పోషకాలు శరీరానికి అంది చర్మం నిగనిగలాడుతుంది.

* కొబ్బరినూనెలో ఆరోగ్యానికి మేలు చేసే శాచురేటెడ్‌ ఫ్యాట్స్‌, యాంటీ బ్యాక్టీరియల్‌ సుగుణాలు ఎక్కువ. కొబ్బరినూనె చర్మంపై పేరుకున్న దుమ్మూధూళిని సులువుగా తొలగిస్తుంది. పొడిబారిన చర్మం తేమగా మార్చి, తాజాగా కనిపించేలా చేస్తుంది.

* ఆలివ్‌నూనెలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్‌ ఎ, డి, ఈ లు అధికం. దీన్ని సౌందర్య సంరక్షణలో వాడితే ఎండ కారణంగా ఏర్పడిన నల్ల మచ్చలు అదుపులో ఉంటాయి. చర్మం మృదువుగా, యౌవనకాంతితో కనిపిస్తుంది. తరచూ వాడటం వల్ల వార్థక్యపు ఛాయలు దరిచేరవు.
* పొద్దుతిరుగుడు పువ్వు నూనెను సాధారణంగా వంటలకే ఉపయోగిస్తాం. అది చర్మానికీ ఎంతో మేలు చేస్తుంది. ఈ నూనెలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, విటమిన్‌ ఈ, ఒమేగా-6 యాసిడ్లు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కొత్త చర్మ కణాల ఉత్పత్తికి తోడ్పడతాయి. స్నానానికి ముందు ఈ నూనెతో మర్దన చేసుకుని, నలుగు పెట్టుకుటే... చర్మం కాంతిమంతంగా కనిపిస్తుంది.

* ఆముదం నూనెలోని మాంసకృత్తులు జుట్టుతో పాటు చర్మానికి మేలు చేస్తాయి. కొబ్బరినూనెతో కలిపి రాస్తే చర్మానికి తగినంత తేమ అంది, యౌవన కాంతితో మెరిసిపోతుంది.


మరిన్ని