close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
పెళ్లి చేసుకుని వదిలేశాడు!

నేను, ఒకబ్బాయి నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నాం. చదువు అయిపోయాక పెళ్లి చేసుకోవాలనుకున్నాం. అంతా సవ్యంగా సాగుతోందనుకున్న సమయంలో అతడికి మరో ఇద్దరు అమ్మాయిలతోనూ సంబంధం ఉందని తెలిసింది. నిలదీస్తే... మాయమాటలు చెప్పాడు. నాతో మాట్లాడిన వీడియో కాల్స్‌ రికార్డు చూపించి, లొంగదీసుకున్నాడు. చివరకు నా ఒత్తిడిమీద రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. ఆ ఫొటోలు తన దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఇంటికి వచ్చి మాట్లాడమని అడుగుతోంటే... మరో అమ్మాయినీ పెళ్లిచేసుకున్నానని అంటున్నాడు. మా మధ్య ఛాటింగ్‌లు ఆధారాలుగా ఉన్నాయి. వాళ్ల నాన్న కానిస్టేబుల్‌. ఆయనకు ఫోన్‌ చేసి ఇవన్నీ చెప్తే కొడుకునే వెనకేసుకొస్తున్నాడు. మా ఇంట్లో ఇవన్నీ చెప్పినా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి రారు. నా పేరు బయటకు రాకుండా అతడిని శిక్షించే అవకాశం ఉంటుందా?  - ఓ సోదరి
మ్మాయిలు ఎంత సులువుగా ఆకర్షణలకు లొంగిపోతారో మీ ఉత్తరం తెలియజేస్తోంది. నాలుగు గోడల మధ్య తాళి కట్టడం, గుడిలో దండలు మార్చుకోవడం నిజమైన పెళ్లి కాదు. హిందూ వివాహ చట్టం ప్రకారం పెళ్లికి కొన్ని నియమ నిబంధనలున్నాయి. అలా జరిగితేనే ఆ పెళ్లికి గుర్తింపు ఉంటుంది. ఇలాంటి మోసాలు జరగకుండా ఉండేందుకు పెళ్లి రిజిస్ట్రేషన్‌ తప్పనిసరని చట్టం చెబుతోంది. మీతో శారీరక సంబంధం పెట్టుకొని ఉంటే అదీ నేరమే. అంతమంది అమ్మాయిలను మోసం చేస్తుంటే  అందరూ మీలాగే తమ పేరు బయటకు రాకూడదని పోలీస్‌ స్టేషన్‌లో అతడిపై ఫిర్యాదు చేయకుండా వదిలేశారేమో! కుదిరితే అంతా కలిసి ఆ పనిచేయండి. పెళ్లి పేరుతో అమ్మాయిలను వంచిస్తున్నందుకు భారత శిక్షాస్మృతిలోని సెక్షన్‌ 420, 375, 493, 496 కింద పోలీసులు అతడిపై కేసులు నమోదు చేస్తారు. అతడు ఉద్యోగం చేస్తూ ఉంటే... అక్కడికీ వెళ్లి ఆ ఉన్నతాధికారులకు విషయం చేయండి. మహిళా కమీషన్‌లోనూ ఫిర్యాదు చేయొచ్చు. ఎక్కడైనా సరే... మీ పేరు బయటకు రాకుండా చేయాలనుకునే ప్రయత్నాలు సఫలం కాకపోవచ్చు. పోలీసు స్టేషను చుట్టూ తిరిగితేనే పనులు అవుతాయి. మీలాంటి బాధితులు రెగ్యులర్‌ లేదా స్పీడ్‌ పోస్ట్‌ల రూపంలో చేసే ఫిర్యాదులు చాలావరకూ చెత్త బుట్ట దాఖలయ్యే అవకాశాలెక్కువ. మీకు తాళి కట్టినా... దానికి న్యాయబద్ధత (లీగాలిటీ) లేదు కాబట్టి మీరు భార్యగా నిరూపించుకోలేరు. అవకాశం ఉంటే... ఈ విషయం పెద్ద మనుషుల పంచాయతీలోనూ పెట్టి చూడండి. మోసపోయినవారందరినీ కూడగట్టండి. మరే అమ్మాయికీ ఇలా జరగకూడదనే ఉద్దేశంతోనే మీరు ముందుకొచ్చారని చెప్పండి. ఇలాంటి మనస్తత్వం ఉన్న అబ్బాయితో మీరు ఇప్పుడే ఇబ్బందులు పడుతున్నారు... పెళ్లి చేసుకున్నా సక్రమంగా కాపురం చేస్తాడనే నమ్మకం మీకు ఉందా... లేకపోతే మాత్రం వదిలేయడం మంచిది. మీకు వేరే వాళ్లతో పెళ్లయినా అతడు మీ జోలికి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడమూ ముఖ్యమే.

మీ ప్రశ్నలు ఇకపై vasulegal@eenadu.net కు పంపించగలరు.


మరిన్ని