close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
మరణం జయించి... ఉద్యోగం సాధించి

ప్రేమలో విఫలమై చావు చివరిదాకా వెళ్లిందామె కూతురి బాధను చూసి కుంగిపోయిన ఆమె తల్లి... కాలం చేసింది. బెంగతో తండ్రి మంచం పట్టాడు.  ఇవన్నీకాక, ఆర్థిక ఇబ్బందులు... ఇలా తన ప్రతి అడుగులోనూ ఓ కన్నీటి కడలినే ఈదింది... అక్క అండతో ధైర్యం కూడగట్టుకుంది... కసితో చదివి ఇటీవలే ఎస్సై కొలువు సాధించింది. ఆమె సిద్దిపేట జిల్లాకు చెందిన బోయిని విజయభారతి. ఆ విజయగాథ ఆమె మాటల్లోనే....

లక్ష్యం స్పష్టంగా ఉంటే...అడుగడుగునా అడ్డంకులు ఎదురైనా అవలీలగా అధిగమించగలం. ఆ స్పష్టత వచ్చాకే... ప్రేమ వైఫల్యం, లావుగా ఉన్నాననే వెక్కిరింతలు...ఒంటరిదాన్ననే భావన అన్నీ చిన్నవిగా కనిపించాయి.  ‘నువ్వు తప్పకుండా పోలీస్‌ కావాలి...’ అన్న అమ్మ కోరికే మొదటి ప్రాధాన్యం అయ్యింది. నేను మళ్లీ కోలుకునేలా చేసింది.
‘కెరటాలు కాళ్లను తాకాయని సముద్రాన్ని చులకన చేయడం ఎంత తప్పో... సమస్యలు ఎదురయ్యాయని మనల్ని మనం తక్కువ చేసుకోవడం అంతే పొరపాటు’. ఆ సత్యాన్ని తెలుసుకొని నన్ను నేను మార్చుకుంటూ జీవితంలో అనుకున్న లక్ష్యం చేరుకోగలిగా. ఎస్సైగా చూడాలన్న అమ్మ కోరికను తీర్చా. మాది హుస్నాబాద్‌ మండలం పోతారం(ఎస్‌). అమ్మ లక్ష్మి సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహంలో వాచ్‌మెన్‌గా చేసేది. నాన్న రైతు. ఐదుగురు అక్కాచెల్లెళ్లం. అందరికంటే నేనే చిన్నదాన్ని. ఆడపిల్లలమనీ అమ్మానాన్న మమ్మల్ని ఎప్పుడూ భారంగా భావించలేదు. వచ్చే అరకొర ఆదాయంతోనే చదివించారు. అమ్మకి మాలో ఒకరినైనా పోలీసుగా చూడాలనేది కోరిక. అందుకే నన్ను అబ్బాయిలా పెంచింది. అక్కలందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. దాంతో అమ్మ కోరికను నేనే నెరవేర్చాలని నిర్ణయించుకున్నా. చిన్నప్పటి నుంచే చదువులో ముందుండేదాన్ని. ఇంటర్‌ వరకు అమ్మమ్మ వాళ్ల ఊరు సిరిసిల్లలో చదివా. కరీంనగర్‌లో బీఫార్మసీ, గతేడాది కేయూ నుంచి ఆంగ్లంలో పీజీ పూర్తి చేశా. 2016లో ప్రైవేటు ఉద్యోగం వచ్చినా చేయలేదు. గ్రూప్స్‌ సాధించాలనే లక్ష్యంతోనే చదివా.

ప్రేమ కోసం...
అన్నీ అనుకున్నట్లు జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది. ఈ స్థాయికి రావడానికి ముందు నా జీవితంలో ఎన్నో అనుకోని సంఘటనలు జరిగాయి. బీఫార్మసీ మొదటి సంవత్సరం చదివేటప్పుడు ఓ యువకుడు ప్రేమ అంటూ వెంటపడ్డాడు. పదే పదే తన ఇష్టాన్ని నా ముందు ప్రదర్శిస్తుంటే... నేనూ సరే అన్నా. ఇంట్లో వాళ్లను ఒప్పించి ఉద్యోగం వచ్చిన తరువాతే పెళ్లి చేసుకోవాలనుకున్నా. ఈలోగానే మా ఇద్దరి విషయం ఇంట్లో తెలిసి జాగ్రత్త చెప్పారు. అతని కుటుంబ స్థితిగతులు చూసి చాలాసార్లు ఆర్థికంగా సహాయం చేశా. ఉద్యోగం సంపాదించి అందరికీ ఆదర్శంగా నిలవాలని చెప్పినా అతడు పట్టించుకోలేదు. కొన్ని రోజులకు అతడి ప్రవర్తనలో తేడా కనిపించింది. నేను మోసపోయినట్లుగా గ్రహించా. మా మధ్య గొడవలు మొదలయ్యాయి. మానసికంగా ఎంతో కుంగిపోయా. బాధను తట్టుకోలేక ఎన్నోసార్లు ఏడ్చేదాన్ని. ఆఖరికి చావే దిక్కనుకున్నా. ఒత్తిడి తట్టుకోలేక ఓ రోజు అమ్మ వేసుకునే బీపీ మాత్రలు మింగేశా. ఆ క్షణం నేను బతకననే అనుకున్నారు. చివరికి బతికి బయటపడ్డా. అయితే నేనిలా అయిపోవడం చూసి అమ్మ బెంగతో అనారోగ్యం పాలైంది. మంచం పట్టింది. అప్పుడూ ఆమె ఒకటే చెప్పింది. ‘నువ్వు తప్పకుండా పోలీస్‌ కావాలి...’ అని కోరింది. మళ్లీ చదవడం మొదలుపెట్టా.  కష్టాలు ఎన్ని ఎదురైనా నా కాళ్ల మీద నేను నిలబడాలనుకున్నా. అదే లక్ష్యంతో నన్ను నేను మార్చుకోవడానికి ప్రయత్నించా.
అక్క అండతో...
నాలుగో అక్క ప్రతిభా భారతి. న్యాయవాది. ఆమె అండగా నిలవడంతో అబ్బాయిపై పోలీసులకు ఫిర్యాదు చేశా...వారే సమస్యను పరిష్కరించారు. దాన్నుంచి కాస్త బయటపడిన సమయంలోనే పోలీసు ఉద్యోగాలకు ప్రకటన వెలువడింది. సిద్దిపేటలో మాజీ మంత్రి హరీశ్‌రావు, పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ శిబిరం నిర్వహించారు. అందులో చేరేందుకు ప్రవేశపరీక్ష రాశా. అప్పుడే అమ్మకు బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చింది. హుటాహుటిన హైదరాబాద్‌ తీసుకువెళ్లాం. కోలుకుంటుందని అనుకున్నా అనారోగ్యంతో కొన్నిరోజులకే ఆమె మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయింది. అమ్మకు నేనే తలకొరివి పెట్టా. ఒక్కసారిగా నా భవిష్యత్తు అంధకారంగా కనిపించింది. అప్పటివరకూ ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా అమ్మే ధైర్యం చెప్పేది. ఇక తనే లేదంటే జీర్ణించుకోలేకపోయా. ఇక నా జీవితమూ ముగిసిందనుకున్నా. అమ్మ చనిపోడంతో నాన్న మరింతగా కుంగిపోయారు. కర్మకాండ జరిగిన వెంటనే నాన్నకు పక్షవాతం వచ్చింది. మంచాన పడ్డారు. ఈలోగా వారిద్దరి వైద్యంకోసం చేసిన అప్పుల రూపంలో ఆర్థిక ఇబ్బందులు  చుట్టుముట్టాయి. వీటన్నింటితో నేను మళ్లీ కుంగుబాటుకి గురయ్యాను. నా జీవితమే ఇలా ఎందుకు అయ్యిందని ఏడవని రోజు లేదు. నా పరిస్థితి చూసి అక్క అండగా నిలిచింది. అమ్మ లేని లోటును తీర్చింది. తను ఇచ్చి ప్రోత్సాహంతోనే ఉద్యోగం సాధించాలనే కసి పెరిగింది. కేవలం ఇరవై అయిదు రోజులే శిక్షణకు వెళ్లా.

లావుగా ఉన్నానంటూ వెక్కిరించారు...
ఈ సారి నా మనసుని స్థిరంగా ఉంచుకున్నా. ఏకాగ్రతతో కష్టపడ్డా. ఎస్సై ప్రిలిమ్స్‌లో 136 మార్కులతో జిల్లాస్థాయిలో ఉత్తమంగా నిలిచా. శిక్షణ తీసుకునే సమయంలో లావుగా ఉన్నావంటూ కొందరు నిరాశపరిచారు. మరికొందరు ఉద్యోగం రాదంటూ వెక్కిరించారు. నేను అవేవీ పట్టించుకోలేదు. చావోరేవో అనుకుని కష్టపడ్డా. శరీరదార్ఢ్య పరీక్షకు ముందు  నాన్న ఆరోగ్యం కొంత మెరుగైంది. ఆ ఈవెంట్స్‌లో  సునాయాసంగా అర్హత సాధించా. మెయిన్స్‌కు నగరంలో శిక్షణ తీసుకుందామనుకున్న ముందురోజే నానమ్మ చనిపోయింది. బాధలో ఉన్న నాన్నను వదిలి వెళ్లొద్దనుకున్నా. ఇంట్లో ఉండి రోజూ 18 గంటలు చదివేదాన్ని. మెయిన్స్‌ ఫలితాల్లో 254 మార్కులతో సివిల్‌ ఎస్సైగా ఎంపికయ్యా. హుస్నాబాద్‌ నియోజకవర్గంలో నాతో పాటు ఉచిత శిక్షణ తీసుకున్న వారిలో నేనొక్కదాన్నే ఎంపికయ్యా. ఒకప్పుడు వెక్కిరించిన వారు ఇప్పుడు మేడం అని నన్ను పిలుస్తున్నారు. ఐపీఎస్‌ కావడమే నా ముందున్న లక్ష్యం.

- మెతుకు వెంకటేశ్‌, న్యూస్‌టుడే, సిద్దిపేట


మరిన్ని