close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
అవాంఛితరోమాలు తగ్గేదెలా?

నాకు వయసు ఇరవై ఏడు సంవత్సరాలు. అధికబరువు, అవాంఛిత రోమాలతో బాధపడుతున్నా. పరీక్షలు చేయించుకుంటే పీసీఓడీ ఉందని తెలిసింది. ముఖంపై ఎక్కువగా కనిపిస్తున్న అవాంఛిత రోమాల్ని... షేవింగ్‌తో తొలగించడం మొదలుపెట్టా. కొన్నాళ్లకి నిపుణులైన వైద్యుల దగ్గర లేజర్‌ చేయించుకున్నా. సమస్య తగ్గకపోగా ఆ ప్రదేశం నల్లగా, గరకుగా మారిపోయింది. చికిత్స తీసుకుంటూ, బరువు తగ్గేందుకు వ్యాయామాలు చేస్తున్నా. నా ముఖం చూస్తే నాకే భయమేస్తోంది. దీనికి ఏదయినా  పరిష్కారం ఉందా?

- ఓ సోదరి
మీకు పీసీఓడీ ఉందని చెప్పారు. అవాంఛిత రోమాలకు చాలా కారణాలు ఉంటే... అందులో పీసీఓడీ ఒకటి. శరీరంలో పురుష హార్మోన్లు ఎక్కువగా ఉత్పత్తి కావడం దీనికి మూలం.  ఈ సమస్య ఉన్నప్పుడు అండాశయాల్లో చిన్న చిన్న సిస్టులు ఏర్పడటం, బరువు పెరగడం, అవాంఛితరోమాలు, మొటిమలు, స్ట్రెచ్‌మార్క్స్‌, నెలసరిలో తేడాలు.. వంటి ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. కొన్నిసార్లు వంశపారంపర్యంగానూ అవాంఛిత రోమాలు రావొచ్చు. ఇంకొన్నిసార్లు యాంటీ డిప్రెసెంట్లు, స్టిరాయిడ్‌ మాత్రలు వాడుతున్నా శరీరంలో కార్టిజోల్‌ హార్మోన్‌ పెరుగుతుంది. అప్పుడూ అవాంఛిత రోమాలు కనిపిస్తాయి. ఒక్కోసారి ఒత్తిడితోనూ ఈ సమస్య ఎదురవుతుంది. కారణాన్ని గుర్తిస్తే తదనుగుణంగా చికిత్స చేయించుకోవచ్చు. ముందు బరువు తగ్గడం అవసరం. దానివల్ల సహజంగానే అవాంఛిత రోమాలు నియంత్రణలోకి వస్తాయి. కొన్ని క్రీమ్‌లు ఉంటాయి. అవసరం అనుకుంటే లేజర్‌ లేదా ఎలక్ట్రాలసిస్‌ సూచిస్తారు. మీరు జీవనశైలిలోనూ మార్పులు చేసుకోవాలి. ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. సమతులాహారం తీసుకోవాలి. ఇంట్లో షేవింగ్‌ చేయడం, ప్ల్లక్కింగ్‌, త్రెడింగ్‌ వంటి పద్ధతుల్ని అనుసరించడం వల్ల చర్మ సున్నితత్వం దెబ్బతింటుందని మరవకండి.

* మీ సందేహాలను vasubeauty@eenadu.net కు పంపించగలరు.


మరిన్ని