close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
క్రిములను వ్యాపింపజేసే సామగ్రి

మనం నిత్యం వాడే వస్తువులపై పేరుకుపోయే బ్యాక్టీరియాతో అనారోగ్యాల బారిన పడొచ్చు. కొన్నిసార్లు ఇవి సంక్రమిత వ్యాధులను వ్యాపింపజేసే అవకాశం ఉంది. ఇటువంటి వాటిపై కనీస అవగాహన పెంచుకోవడం అవసరం.
* మన శరీరంపై ఉండే బ్యాక్టీరియాతో ఎలాంటి ముప్పు ఉండదు. కానీ మనం వాడే ఫోన్లు, ట్యాబ్‌లు, ఇతర గ్యాడ్జెట్లను వేరెవరికైనా ఇచ్చినప్పుడు వారి ఒంటి మీద ఉండే బ్యాక్టీరియా వీటి ద్వారా వ్యాపించొచ్చు. ఇది వ్యాధులకు కారణమయ్యే అవకాశం ఉంది. తరచుగా వాటిని యాంటీ బ్యాక్టీరియల్‌ లిక్విడ్‌లో ముంచిన వస్త్రంతో శుభ్రం చేసుకుంటే ఎలాంటి సమస్యలూ ఎదురుకావు.
* మనీ పర్సులు, బ్యాక్‌ప్యాక్స్‌, కూరగాయలు, సామాన్లు తీసుకెళ్లే సంచులను ఎప్పుడో గానీ శుభ్రం చేయం. వీటిని నిత్యం వెంట తీసుకెళ్తూ ఎక్కడ పడితే అక్కడ ఉంచుతాం. దీంతో ఇవి క్రిములకు ఆవాసాలుగా మారతాయి. నెలలో రెండుసార్లయినా వీటిని శుభ్రపరచుకోవాలి. వర్షాలకు తడిస్తే ఉతికి ఆరబెట్టిన తరువాతే వాటిని వాడాలి.
* కారు సీట్లు... ప్రమాదకరమైన ఫెకల్‌ అనే బ్యాక్టీరియాకు ఆవాసాలు. వీటితో చిన్న పిల్లలకు ముప్పు ఉంటుంది. ఇది  పిల్లల శరీరంలోకి ప్రవేశించి దీర్ఘకాలిక వ్యాధులకు కారణం కావచ్చు. కారు సీట్లను వారానికోసారైనా శుభ్రం చేయాలి.
* పరిశుభ్రంగా లేని కాంటాక్ట్‌ లెన్స్‌ వాడితే కంటికి ఇన్‌ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. వాటిని వాడే ముందు, వాడిన తరువాత శుభ్రం చేసుకోవాలి. కార్నియాకు లెన్స్‌ పెట్టుకునే ముందు చేతులను సబ్బుతో కడగాలి.
* పెంపుడు జంతువులను, వాటికి సంబంధించిన వస్తువులను తాకిన తరువాత చేతులను సబ్బుతో కడగడం మర్చిపోవద్దు. వీటి శరీరంపై ఉండే బ్యాక్టీరియా  అనేక రకాల వ్యాధులను కలుగజేస్తుంది. చిన్న పిల్లలను వీటికి దూరంగా ఉంచడం మంచిది.
* బూట్లు, సాక్సులను పరిశుభ్రంగా ఉంచుకోకపోతే ప్రమాదకర ఈ-కోలి బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశం ఉంది. సాక్సులను తడిగా ఉన్నప్పుడు వాడితే ఫంగస్‌ వ్యాపించొచ్చు. నిత్యం వాడే సూట్‌కేసులను వారానికోసారైనా పొడివస్త్రంతో శుభ్రం చేయాలి.


మరిన్ని