close

తాజా వార్తలు

బరువు తగ్గేందుకు కార్న్‌వాల్‌ సిద్ధం

ప్రత్యేక శిక్షకుడిని నియమించాం: విండీస్‌ బోర్డు

గయానా: వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్ రకీమ్‌ కార్న్‌వాల్‌ బరువు తగ్గేందుకు సిద్ధమయ్యాడని ఆ జట్టు క్రికెట్‌ బోర్డు అధ్యక్షుడు రిక్కీ స్కెరిట్‌ పేర్కొన్నాడు. 6.6 అడుగుల ఎత్తు, సుమారు 140 కేజీల బరువున్న కార్న్‌వాల్‌ భారత్‌తో జరగబోయే టెస్టు మ్యాచ్‌లకు ఇటీవల ఎంపికయ్యాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్న అతడికి విండీస్‌ సెలక్టర్లు టెస్టు జట్టులో అవకాశమిచ్చారు. అంతకుముందు 2017లో భారత్‌తో తలపడిన మ్యాచ్‌లో అదరగొట్టిన భారీకాయుడు అనూహ్యంగా ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు.

కాగా అధిక బరువు కారణంగా అంతర్జాతీయ క్రికెట్‌లో కార్న్‌వాల్‌ కొనసాగలేడని పలువురు భావిస్తున్న తరుణంలో భారత్‌తో టెస్టు సిరీస్‌లో చోటు దక్కించుకోవడం విశేషం. ఈ నేపథ్యంలో కార్న్‌వాల్‌ బరువు తగ్గేందుకు సిద్ధమయ్యాడని, తర్వలోనే సంబంధిత శిక్షణలో పాల్గొంటాడని ఆ జట్టు బోర్డు అధ్యక్షుడు తెలిపాడు. వెస్టిండీస్‌ క్రికెట్‌ ఆధ్వర్యంలో ఒక ట్రైయినర్‌ని నియమించామని, పోషకాహార నిపుణుడైన ఈ ట్రైయినర్‌ సరైన ప్రణాళికతో కార్న్‌వాల్‌ బరువుని తగ్గిస్తాడని చెప్పాడు. అలాగే కార్న్‌వాల్‌ పూర్తి ఫిట్‌నెస్‌ సాధించేందుకు శిక్షకుడు సహకరిస్తాడని రిక్కీ వివరించాడు. 

ఇదిలా ఉండగా విండీస్‌ తరఫున 55 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడిన ఈ భారీకాయుడు 24.43 సగటుతో 2,224 పరుగులు చేశాడు. అలాగే బౌలింగ్‌లో 260 వికెట్లు తీశాడు. ఇక 2017లో భారత పర్యటన సందర్భంగా ఓ మ్యాచ్‌లో విరాట్‌కోహ్లీ, ఛతేశ్వర్‌ పుజారా, అజింక్యా రహానే వంటి మేటి ఆటగాళ్లను పెవిలియన్‌ చేర్చాడు. విండీస్‌ తరఫున ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అతడు స్పిన్‌ బౌలర్‌గా మంచి ప్రదర్శన చేశాడని, తద్వారా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడని రిక్కీ పేర్కొన్నాడు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు