close

తాజా వార్తలు

ప్రపంచాన్ని శాసించే చిత్రాలు తీయగలం: పవన్‌

హైదరాబాద్‌: చరిత్ర రాసేవారు లేకపోతే చరిత్ర కనుమరుగైపోతుందని, పుస్తకాల్లో నిక్షిప్తం చేయకపోతే తక్కువ స్థాయి వ్యక్తులు రాసిందే చరిత్రగా చలామణి అవుతుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ప్రపంచంలో ఎవరినైనా ఎదురించొచ్చుగానీ లక్షల మెదళ్లను కదిలించగలిగే శక్తి ఉన్న కవులు, రచయితలను ఎదుర్కోవడం చాలా కష్టమన్నారు. అలాంటి వ్యక్తులపట్ల తనకు అపారమైన గౌరవం ఉందని, అందుకే సినిమా వేడుకల్లో వాళ్ల ముందు తలదించుకొని కూర్చుంటానని అన్నారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ప్రముఖ రచయిత, రాజకీయ, సామాజిక విశ్లేషకుడు తెలకపల్లి రవి రాసిన ‘మన సినిమాలు’ పుస్తకాన్ని పవన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు తనికెళ్ళ భరణి, పరుచూరి గోపాలకృష్ణ, సుద్దాల అశోక్ తేజ, రావి కొండలరావు, సినీ పాత్రికేయుడు డా.రెంటాల జయదేవ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్‌  మాట్లాడుతూ.. తనకు తెలంగాణ అంటే ఎంతో ఇష్టమన్నారు. ఇష్టం కోసమే తెలంగాణ గురించి మాట్లాడతానని.. రాజకీయాల కోసం మాట్లాడబోనన్నారు. తెలంగాణ తన రక్తంలో, గుండెల్లో ఉందని పవన్‌ వ్యాఖ్యానించారు.

ఆ పుస్తకం ఇచ్చినప్పుడు గబ్బర్‌సింగ్‌ హిట్‌ కంటే ఎక్కువ ఆనందపడ్డా 
“అన్ని మైత్రిలకంటే సాహిత్య మైత్రీ చాలా గొప్పదని సీనియర్ పాత్రికేయులు నాగేంద్ర ఓ పుస్తకంపై రాసిచ్చారు. ఆ మాట నాకు ఇప్పటికీ గుర్తుంది. బందోపాధ్యాయ రాసిన వనవాసి అనే పుస్తకం నన్ను ప్రకృతి ప్రేమికుడిగా మార్చేసింది. అలాంటి పుస్తకాన్ని తనికెళ్ళ భరణి నాకు గిఫ్ట్‌గా ఇచ్చినప్పడు గబ్బర్‌సింగ్‌ సినిమా హిట్‌ అయినదానికంటే ఎక్కువ ఆనందం కలిగింది. గుడిపాటి వెంకట చలం మైదానం పుస్తకం రాశారని తెలుసు గానీ, మాలపిల్ల సినిమాకు కూడా ఆయన రచయితని ఈ పుస్తకం చూసే వరకు నాకు తెలియదు. ఇలాంటి ఎన్నో తెలియని విషయాలు తెలిస్తే వారిపై గౌరవం పెరుగుతుంది. తెలుగు పరిశ్రమలో చాలా మంది గొప్ప స్టోరీ టెల్లర్స్ ఉన్నారు’’ అని చెప్పారు.

బాహుబలి వంటి చిత్రాలు వచ్చినా..
బాహుబలి వంటి సినిమాలు వచ్చినాగానీ, ఇంకా అద్భుతమైన సినిమాలు తీయగల సాహిత్యం మన దగ్గర చాలా ఉందని చాలా మందికి తెలియదు. అదిగానీ మనం అర్ధం చేసుకోగలిగితే చాలా గొప్ప సినిమాలు వస్తాయి. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రపంచాన్ని శాసించగలిగే సినిమాలు తీయగలం. అలా తీయాలంటే ఇలాంటి పుస్తకాలు చాలా ఉపయోగపడతాయి. ముందుగా ఇలాంటి పుస్తకాన్ని రాసిన సీనియర్ పాత్రికేయులు తెలకపల్లి రవికి అభినందనలు.  రెండేళ్లపాటు శ్రమించి ఈ పుస్తకాన్ని మన ముందుకు తెచ్చారు. ఈ పుస్తకాన్ని నేను ఆవిష్కరించడం నాకెంతో సంతోషంగా ఉంది’’ అన్నారు. 

జానీ ఎందుకు ఆడలేదో నాకే బాగా తెలుసు

‘‘జానీ సినిమా ఎందుకు ఆడలేదో అందరి కంటే కూడా నాకే బాగా తెలుసు. కమర్షియల్ యాంగిల్ లో పడి అనుకున్న కథను తెరకెక్కించలేకపోయాను. పరుచూరి సోదరుల గొప్పతనం ఏంటంటే ఒక సామాజిక సమస్యను కమర్షియల్ విలువలు ఉంటూనే మనం ప్రభావితం అయ్యేలా రాయగలరు. అలాంటి రచనా శక్తి అందరికీ రాదు. అదొక అరుదైన కళ.  సావిత్రి గారు, ఎస్వీ రంగారావు గారు ఎవరో ఈ జనరేషన్‌లో చాలా మందికి తెలియదు. సావిత్రి గారి బయోపిక్ తీస్తేనేగానీ ఆమె సామర్థ్యం, కష్టాన్ని మనం గుర్తించలేకపోయాం’’ అని పవన్‌ అన్నారు.  

అలాంటి సినిమాలు చాలా రావాలి
‘‘సినిమాలు నిజ జీవితాన్ని ఎంత ప్రభావితం చేస్తాయో.. నిజ జీవితాలు కూడా సినిమాలను అంతే ప్రభావితం చేస్తాయి. అలాంటి సినిమాలకు జాతీయ అవార్డులు రావడం నిజంగా ఆనందం కలిగించింది. వారి గొప్పతనం తెలకపల్లి రవి గారు లాంటి సంపాదకులు పదేపదే మనకు చెప్పడం వల్ల చాలా మందిలో ప్రేరణ కలిగి అలాంటి సినిమాలు వచ్చాయి. అలాంటి సినిమాలతో పాటు చాలా విలువలు ఉన్న సినిమాలు ముందు ముందు చాలా రావాలి. నా సినిమాల్లో ఎన్నో కమర్షియల్ హంగులు ఉన్నా సమాజానికి ఉపయోగపడే మంచిని చెప్పడానికి నా వంతు ప్రయత్నం చేశాను. మంచి సినిమాలు ఎవరు చేసినా ప్రేమించేవాడిని, ఆహ్వానించేవాడిని. ఇలాంటి పుస్తకాలు ముందు ముందు ఇంకా రావాలి, తెలుగు సినిమా చరిత్రను మరింత ముందుకు తీసుకెళ్లాలి. చరిత్రను ఇలా పుస్తకాల్లో నిక్షిప్తం చేయడానికి ఒక కమిటీ ఉంటే దానిని ముందుకు తీసుకెళ్లడానికి నా వంతు కృషి చేస్తా” అని పవన్‌ హామీ ఇచ్చారు. 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు