close

తాజా వార్తలు

సుష్మా ఆదర్శాలను ముందుకు తీసుకెళ్తాం: షా

సంస్మరణ సభలో సుష్మా సేవల్ని కొనియాడిన మోదీ

దిల్లీ: దేశ అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేసిన మహా మనిషి సుష్మా స్వరాజ్‌ అని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. దేశానికి ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేసిన ఆమె ప్రజలకు సేవలందించే విషయంలో ప్రోటోకాల్‌కు ఉన్న అర్థాన్నే మార్చేశారని వ్యాఖ్యానించారు. దిల్లీలో కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్‌ సంస్మరణ సభలో మోదీ, అమిత్‌ షా, అడ్వాణీ, రాజ్‌నాథ్‌ సింగ్ తదితరులు పాల్గొని నివాళులర్పించారు. పార్టీలకతీతంగా నేతలు సంస్మరణ సభలో పాల్గొని సుష్మాతో తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. విదేశాంగ మంత్రిగా సుష్మా స్వరాజ్‌ భారత ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పారని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కొనియాడారు. కష్టాల్లో ఉన్నవారు ట్వీట్‌ చేసిన వెంటనే స్పందించి వారికి సాయం చేసేవారని గుర్తుచేసుకున్నారు. సుష్మ సేవలను దేశ ప్రజలు చిరకాలం గుర్తుంచుకుంటారని అమిత్‌ షా తెలిపారు. సుష్మా కలల్ని నిజం చేసేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తామని, ఆమె ఆదర్శాలను ముందుకు తీసుకెళ్తామని మోదీ చెప్పారు.

ఆమె జీవితంలో ఘటనలకు సజీవ సాక్షిని: ప్రధాని
‘‘భాజపా కార్యకర్తగా సుష్మా స్వరాజ్‌తో కలిసి పనిచేశా. ఆమె జీవితంలో జరిగిన అనేక అనుభవాలకు, ఘటనలకు నేను సజీవ సాక్షిని. అప్పగించిన ఏ పనినైనా.. కాదనుకుండా చేసేవారు. ఆమె ప్రసంగాలు చాలా మందిపై ప్రభావం చూపేవి. ప్రేరణగా నిలిచేవి. ప్రజల కోసం ప్రోటోకాల్‌ అర్థాన్ని పూర్తిగా మార్చేశారు. భారత విదేశాంగ శాఖలో సంస్కరణలు తీసుకురావడం చాలా పెద్ద పని. కానీ సుష్మ అతి తక్కువ సమయంలో సంస్కరణలు తీసుకొచ్చారు. 70 ఏళ్లలో దేశంలో ఉన్న 77 పాస్‌పోర్టు కార్యాలయాల సంఖ్య.. ఆమె విదేశాంగ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఐదేళ్లలో 505కి పెరిగింది.  సుష్మ హయాంలో పని ఎలా జరిగేదనేందుకు ఇది నిదర్శనం. సుష్మా స్వరాజ్‌ కుమార్తెకు మేమంతా అండగా నిలబడతాం’’ అని మోదీ అన్నారు.

ట్వీట్‌ చేస్తే చాలు.. జవాబుతో పాటు సాయం అందేది: షా
‘‘సుష్మాజీ మన మధ్య లేరన్న విషయాన్ని మనస్సు అంగీకరించడంలేదు. సుష్మా స్వరాజ్‌ నిష్క్రమణతో భాజపాలో మాత్రమే కాదు.. మొత్తం దేశ రాజకీయ ముఖచిత్రంపై ఏర్పడిన శూన్యత చాలా కాలం పాటు భర్తీ కాదు. పార్లమెంటులో ప్రజల గొంతుకను వినిపించడంలో ఆమె ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు. మోదీ నేతృత్వంలో విదేశీ వ్యవహారాల మంత్రిగా నియమించిన నాటి నుంచి ఆ విభాగాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లడంలో ఆమె విజయవంతమయ్యారు.  ప్రపంచంలో ఎక్కడైనా ఒక భారతీయ వ్యక్తి సుష్మా సాయం కోరుతూ ట్వీట్‌ చేస్తే ఆ వ్యక్తికి సమాధానంతో పాటు సహాయమూ లభించేంది. భాజపా నాయకురాలిగా ఎన్నో ఏళ్లుగా ఆమె పార్టీ అభివృద్ధికి, పార్టీ విజయానికి అందించిన సేవలను కార్యకర్తలంతా చిరకాలం గుర్తుంచుకుంటారు. ఆమె ఈ రోజు మన మధ్య లేరు. ఆమె కుటుంబానికి, భాజపా కార్యకర్తలకు ఈ బాధను భరించే శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలి. సుష్మా జీ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా’’ అని అమిత్‌ షా అన్నారు.మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు