close

ఫీచర్ పేజీలు

చెవుల్లో అనువుగా..

సమీపించిన ఉత్సవాలు
బన్సీలాల్‌పేట్‌, న్యూస్‌టుడే

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే విశిష్ట వేడుక బోనాలు. లయబద్ధంగా డప్పు చప్పుళ్లు, పోతరాజుల నృత్యాలు, విన్యాసాలు, బోనాలతో తరలివచ్చే మహిళలు, ఫలహారం బండ్ల ఊరేగింపు, ఆసక్తికరంగా సాగే రంగం..ఇలా ఎటుచూసినా ఆధ్యాత్మిక సంరంభమే. భాగ్య నగరంలో ఆషాఢమాసమంతా సందడిగా అమ్మవారికి నైవేద్యం సమర్పించే ఘట్టాలే.   వారం రోజుల్లో వేడుకలకు అంకురార్పణ జరగనున్న నేపథ్యంలో ఆయా ఆలయాల వెనుక ఉన్న చారిత్రక నేపథ్యం.. ఏ రోజు ఏయే కార్యక్రమాలు ఉంటాయో తెలిపే ప్రత్యేక కథనమిది.

కోట వద్దకు ఊరేగింపు అలా..
గోల్కొండ కోటలో బోనాల మహోత్సవాలు వచ్చే నెల 4 నుంచి ఆగస్టు 1 వరకూ నిర్వహిస్తారు. ప్రతి గురు, ఆదివారాల్లో కోటలో ఉత్సవాలు ఉంటాయి. కుతుబ్‌షాహీ రాజైన అబుల్‌హసన్‌ తానీషా హయాంలో మంత్రులైన అక్కన్న, మాదన్నలు ఈ ఆలయాన్ని నిర్మించారు. తొలిరోజు పూజకు లంగర్‌హౌస్‌ కూడలి నుంచి అమ్మవారి రథం ఊరేగింపు ప్రారంభమవుతోంది. ప్రభుత్వం తరఫున మంత్రులు అక్కడే పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. తొట్టెలకు పూజలు నిర్వహించి ఆలయానికి తీసుకొస్తారు. చిన్నబజార్‌లో పూజారి అనంతచారి ఇంట్లో అమ్మవారి విగ్రహానికి పూజల తర్వాత గోల్కొండకు చేరుకుంటారు. ప్రతి ఆదివారం 50వేల మందికి పైగా దర్శించుకోనున్నారు.

ఎల్లమ్మ కల్యాణం
చారిత్రక ఆధారాల ప్రకారం 700 ఏళ్లకు పూర్వమే బల్కంపేట ఎల్లమ్మ ఆలయం ఉన్నట్లు తెలుస్తోంది. భూమి ఉపరితలానికి పదడుగుల లోతున బావిలో అమ్మవారు శయన రూపంలో తూర్పుమూలంగా వెలిసినట్లు చెబుతారు. నిజాంల హయాంలో ఆలయం పునర్నిర్మించారు. 1919లో రాజా శివరాజ్‌ బహదూర్‌ పాలనలో కొత్తగా పునరుద్ధరించారు. బావి నుంచి అన్ని కాలాల్లో జలధార ఉబికివస్తుంది. దివ్య ఔషధంగా భక్తులు భావిస్తారు. ఆషాఢ మాసంలో జరిగే అమ్మవారి కల్యాణానికి భక్తులు తరలివస్తారు.

మహాకాళి నేపథ్యం
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి ఇక్కడ కొలువవడానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇదే ప్రాంతానికి చెందిన సురిటి అప్పయ్య 1813లో మధ్యప్రదేశ్‌లోని మిలటరీ టవర్‌లో పనిచేసేవారు.. నాడు అక్కడ కలరా ప్రబలగా ఉజ్జయినిలోని మహాకాళిని సందర్శించి ప్రజలను రక్షిస్తే సికింద్రాబాద్‌లో విగ్రహ ప్రతిష్ఠచేసి పూజలు నిర్వహిస్తామని మొక్కుకున్నారు. పరిస్థితులు అనుకూలించాయి. చెక్కలు, కర్రలతో 1815లో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠచేశారు. సమీపంలోని పురాతన బావిలో బయటపడిన మాణిక్యాలమ్మ విగ్రహాన్ని అమ్మవారి పక్కన ప్రతిష్ఠించారు. 1864లో ప్రతిమలు ప్రతిష్ఠ చేసి ఆలయ నిర్మాణం చేశారు. 1953లో ఆలయాన్ని దేవాదాయ ధర్మాదాయశాఖ ఆధీనంలోకి తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది.

జులై 7న జరిగే ఎదుర్కోలుతో ఉత్సవాలు ప్రారంభమై 15 రోజులు కొనసాగుతాయి. తొలిరోజు కర్భలామైదానం వద్ద డొక్కాలమ్మ దేవాలయం నుంచి ఘటాన్ని అలంకరించి ఊరేగింపుగా తీసుకొస్తారు. జాతర రోజు లక్షలాదిమంది బోనాలతో వస్తారు. ఫలహార బండి, తొట్టెలు ఆకర్షణ.

ఏం చేస్తున్నారంటే..
కోట వద్ద పటిష్టమైన బారికేడ్లలో క్యూలైన్లు, మంచినీటి సదుపాయం, వైద్యశిబిరాలు, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో త్రీడీ మ్యాపింగ్‌ ఏర్పాటు చేయనున్నారు. ట్రాఫిక్‌ సమస్యలు లేకుండా ప్రణాళికలు రూపొందించనున్నారు. గోల్కొండ పరిధిలో రూ.3కోట్లతో రోడ్ల మరమ్మతులు, అభివృద్ధి పనులు పూర్తిచేస్తారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు