close

ఫీచర్ పేజీలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆ బుగ్గలిక ఎగరవా?

కొత్త సంవత్సరం.. వాలంటైన్స్‌ డే.... పుట్టినరోజు వేడుక... సందర్భం ఏదైనా నింగికెగిరే రంగురంగుల బుడగలే కదా ఆ వేడుకకు వన్నె తెచ్చేది. అవి లేకపోతే! అదేం ప్రశ్న? బుడగలు ఎగరాలన్నా... రాకెట్లు దూసుకుపోవాలన్నా స్కానింగులు జరగాలన్నా వాటికి హీలియం వాయువు కావాలి. అదిప్పుడు భూమ్మీద నుంచి ఖాళీ అయిపోతోంది..
‘పార్టీ సిటీ’... అమెరికన్‌ యువతకు పెద్దగా పరిచయం అక్కర్లేని సంస్థ. పార్టీలకు కావాల్సిన బుడగలు.. ఇతర హంగామాలన్నీ ఏర్పాటు చేసే ఈ సంస్థ.. ఈ ఏడాది 45 బ్రాంచీలను మూసేసింది. నష్టాలొచ్చి ఆ సంస్థ మూతబడితే ప్రపంచవ్యాప్తంగా ఇదో చర్చ అయ్యేదే కాదేమో! కానీ.. కారణం అది కాదు. పార్టీల్లో అలంకరించే బుడగల్లో నింపేందుకు వాడే హీలియం వాయువు కొరతతో మూతబడటమే ఇక్కడ విశేషం. సరే... ఎక్కడో అమెరికాలో కదా! అయినా పార్టీలు, బుడగల్లేకపోతే మనం బతకలేమా అని మీరు అనుకోవచ్చు. ప్రపంచమంతా అనుకుంటున్నట్టుగా... హీలియం వాయువు ప్రయోజనాలు కేవలం బుడగలు ఎగరేయడానికి మాత్రమే పరిమితం అయితే శాస్త్రవేత్తలు, వ్యాపారవేత్తలు, ప్రభుత్వాలు ఇంతగా ఆందోళన చెందాల్సిన పనేలేదు. వైద్యం మొదలుకుని... అంతరిక్షం వరకు ఆయా రంగాల పరిశోధనల్లో ఎంతో కీలకంగా మారిన హీలియం వాయువు కొన్నేళ్లలో భూమ్మీద నుంచి కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. దాంతో ప్రత్యామ్నాయ వాయువుల గురించి, దాని పునర్వినియోగం గురించిన చర్చ మొదలయ్యింది.

ఎక్కడ వాడతారు?
గాలికంటే తేలిగ్గా ఉండే హీలియం వాయువుని.. మొదట్లో బుడగలు ఎగరడానికి మాత్రమే వాడేవారు. హీలియం అత్యుత్తమ ప్రయోజనాలు తెలిసిన తర్వాత శాస్త్రవేత్తలు... వైద్యం, రాకెట్ల తయారీ, క్రయోజనిక్స్‌, రక్షణ వ్యవస్థలు, సోలార్‌ టెలిస్కోపులు, ఆప్టిక్‌ ఫైబర్స్‌, సముద్రం అడుగున సంచరించడానికి అవసరమైన ఆక్సిజన్‌ సిలిండర్లలలో సహా ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించడం మొదలుపెట్టారు.
* రాకెట్లని అంతరిక్షంలోకి పంపేటప్పుడు వాటిల్లోని ఇంధన వాయువులని అదిమిపెట్టి ఉంచేందుకు, అధిక ఉష్ణోగ్రతల కారణంగా రాకెట్ల అంతర్గత భాగాలు దెబ్బతినకుండా ఉండేందుకు ఈ వాయువుని ఉపయోగిస్తారు.
* ఆసుపత్రుల్లో ఉపయోగించే ఎమ్మారై స్కానర్లలోని సూపర్‌ కండక్టింగ్‌ మాగ్నెట్స్‌ని చల్లబరిచి వాటి పనితీరు సక్రమంగా సాగేందుకు, ఆస్తమా వంటి వైద్య విధానాల్లోనూ హీలియంని ఉపయోగిస్తారు.
* అత్యధిక ఉష్ణోగ్రతలు, ఒత్తిడి ఉండే చోట ఆ పరిస్థితుల నుంచి హీలియం రక్షణగా ఉపకరిస్తుంది. ఉదాహరణకి సముద్రం అడుగున తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. అలాంటి పరిస్థితిలో డైవింగ్‌ చేసేవారికి అమర్చే సిలిండర్లలో ఈ హీలియంని కూడా నింపుతారు. ఇలా చేయడం వల్ల నైట్రోజన్‌ వాయువుతో తలెత్తే ‘నైట్రోజన్‌ నార్కోసిస్‌’ అనే ప్రమాదకర పరిస్థితి నుంచి రక్షణ కలుగుతుంది.
* భూమి నుంచి సుదూర తీరంలో ఉన్న సౌరమండలాలపై పరిశోధనలు చేయడానికి ఉపకరించే టెలిస్కోపుల్లోని లెన్సులు తీవ్రమైన వేడికి గురై పాడవ్వకుండా ఉండేందుకు, వాటిని చల్లబరిచేందుకు ఈ వాయువునే వాడతారు.
* సైనికులు శత్రుదేశాల ఆనుపానులని కనిపెట్టేందుకు హీలియం నింపిన ఎయిర్‌షిప్స్‌, బ్లింప్స్‌ని గాల్లోకి పంపి పహారా కాస్తుంటారు.
* టెలికమ్యూనికేషన్స్‌లో భాగంగా డేటా ట్రాన్స్‌ఫర్‌ చేయడానికి ఉపయోగించే ఆప్టిక్‌ ఫైబర్స్‌లో గాలి బుడగలు ఉండి సమాచారలోపం తలెత్తకుండా ఉండేందుకు హీలియం ప్రధానంగా ఉపయోగపడుతుంది.

చంద్రుడిపై నుంచి తవ్వి తెచ్చుకోవాల్సిందేనా?
హీలియంకుండే ప్రత్యేక స్వభావం వల్ల దానిని నోబుల్‌ గ్యాస్‌ అంటారు. ఇంతవరకూ దీనికి ప్రత్యామ్నాయం కూడా కనిపించలేదు. ఖతార్‌, టాంజానియా వంటి చోట్ల హీలియం నిల్వలు ఉన్నా వాటిని వెలికితీయడంలో అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఇక ఉన్న ఆశల్లా... ఇతర గ్రహాల్లో కుప్పలుతెప్పలుగా ఉన్న హీలియం వాయువుని పట్టి తెచ్చుకోవడమే. అందుకే చైనా, అమెరికా వంటి దేశాలు ఈ వాయువు సమృద్ధిగా ఉన్న చంద్రుడిపై పరిశోధనల కోసం ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. అక్కడ మైనింగ్‌ చేసి తెచ్చిన హీలియంని న్యూక్లియర్‌ రియాక్టర్లలో వాడటానికి, రాకెట్లని నింగిలోకి పంపించడానికి ఉపయోగించాలని చూస్తున్నాయి.
లేకపోతే ఏమవుతుంది?
సముద్రంలో ఎటుచూసినా నీరే. కానీ వాడుకోవడానికే ఒక్క చుక్కా పనికిరాదు. హీలియం పరిస్థితి కూడా అంతే. నక్షత్రాలు, గ్రహాలు, చంద్రుడు ఇలా ఎక్కడ చూసినా హీలియం వాయువు ఉంది. విశ్వంలో అత్యంత సమృద్ధిగా లభించే వాయువుల జాబితా తీస్తే అందులో హైడ్రోజన్‌ తర్వాత హీలియమే ఉంటుంది. కానీ.. భూమ్మీద మాత్రం దీని లభ్యత చాలాచాలా తక్కువ. పైగా ఇది గాలికంటే చాలా తేలిగ్గా ఉంటుంది. అందుకే... భూమిని తవ్వి సహజ వాయువులతో కలిపి వెలికి తీసిన తర్వాత దీనిని దాచిపెట్టకపోతే అటునుంచి అటే మన వాతావరణం నుంచి తప్పించుకుని పైకి వెళ్లిపోతుంది. అలాగే భూమినుంచి వెలికితీయడమే కాదు... దాచిపెట్టడం, రీసైక్లింగ్‌ చేయడం కూడా ఖరీదైన వ్యవహారాలే. అందుకే శాస్త్రవేత్తలు దీనిని బంగారం కంటే అపురూపమైన దానిగా భావిస్తారు. ద్రవరూప హీలియంని ‘సూపర్‌ లిక్విడ్‌’ అని పిలుస్తారు.
* టెక్సాస్‌లో ఉన్న యూఎస్‌ ఫెడరల్‌ హీలియం రిజర్వ్‌ ప్రపంచ అవసరాలకు సరిపోయేదానిలో 30 శాతం వాయువుని అందిస్తోంది. దీనిదగ్గర ఉన్న నిల్వలు 2021నాటికి పూర్తిగా ఖాళీ అయిపోతాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అదే జరిగితే ఎమ్మారై స్కానింగ్‌ వంటివి అత్యంత ఖరీదైన వ్యవహారాలుగా మారిపోతాయి. దాంతో బెలూన్లు అమ్మే దుకాణాలు మూతపడినట్టుగానే చిన్న ఆసుపత్రులు మూతపడే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే హీలియం తగినంత లేక సైన్సు పరిశోధనలు వాయిదా పడుతున్నాయని ఆయా సంస్థలు చెబుతున్నాయి.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు